
సీబీఐకి రూ.100 కోట్లు
న్యూఢిల్లీ: భారీ ఆర్థిక నేరాలను, ఇతర కీలక కేసులను దర్యాప్తు చేసే సీబీఐని మరింత పరిపుష్టం చేసేందుకు సెంట్రలైజ్డ్ టెక్నాలజీ వర్టికల్ (సీటీవీ) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిద్వారా దర్యాప్తునకు అవసరమైన ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణ, డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, వివిధరంగాల నిపుణుల సహకారం, ఇతర కీలక సమాచారాన్ని వేగంగా పొందేందుకు వీలవుతుంది.
దీనికోసం కేంద్రం రూ.100 కోట్లను సీబీఐకి కేటాయించింది. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాలు, చిట్‌ఫండ్ స్కాంలు లాంటి భారీ ఆర్థిక నేరాలను విచారించేందుకు సీటీవీ లాంటి విభాగం చాలా అవసరమని అధికార వర్గాలు తెలిపాయి. సంక్లిష్ట కేసుల కోసం ఈ విభాగాన్ని ఏర్పాటుచేయాలంటూ సీబీఐ కేంద్రాన్ని కోరింది.