సైబర్ దాడులకు సిద్ధం
చెన్నై: భారత ప్రభుత్వం ఆజ్ఞాపిస్తే పాకిస్థాన్లోని వెబ్సైట్లపై సైబర్ దాడులకు సిద్ధమని నేషనల్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ ఎస్.అమర్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆ దేశంలోని వివాస్పద అంశాలను తెలుసుకోవచ్చని అన్నారు. పటాన్కోట్ దాడి అనంతరం తాము పాకిస్థాన్కు చెందిన అధికారిక వెబ్ సైట్లను హాక్ చేయగలమని చెప్పామని ఇందుకు ప్రభుత్వ అనుమతి అవసరమని ఆయన అన్నారు. చెన్నైలో జరిగిన నేషనల్ సైబర్ డిఫెన్స్ సమ్మిట్ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యర్థులకు చెందిన ప్రతీ సమాచారాన్ని హ్యాక్ చేయగల సాంకేతిక పరిజ్ఞానం మనవద్ద ఉందని అన్నారు. ఇండియన్ వెబ్సైట్స్ ఎంత వరకు భద్రం అన్నప్రశ్నకు సమాధానంగా.. మనం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామని, మన సైట్లను హ్యాక్ చేయడం అసాధ్యమన్నారు. గతంలో హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన వారిని గుర్తించామని చెప్పారు.దేశ వ్యాప్తంగా మన సైట్లను పరిరక్షించడానికి 10 లక్షల మంది నిపుణులు అవసరమని తెలిపారు.