
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్‌జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 12,826 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 18,348 కోట్లు ఆర్జించింది. అనూహ్య(విండ్‌ఫాల్) లాభాల పై ప్రభుత్వం పన్ను విధింపు ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం 57%పైగా జంప్‌చేసి రూ.38,321 కోట్లకు చేరింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 59 శాతం వాటా ఉంది.
విక్రయ ధరలు అప్
ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారల్ చమురుకు స్థూలంగా 95.49 డాలర్లు లభించినట్లు ఓఎన్‌జీసీ పేర్కొంది. గత క్యూ2లో ఇది 69.36 డాలర్లు మాత్రమే. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా ఎగసిన విషయం విదితమే. అయితే ప్రభుత్వం పెరిగిన ధరలపై జూలై 1 నుంచీ కొత్తగా విండ్‌ఫాల్ పన్ను విధించింది. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 6,400 కోట్లమేర ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించినట్లు కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ పేర్కొన్నారు.
వెరసి ప్రతీ బ్యారల్‌కు 75–76 డాలర్లు లభించినట్లు తెలియజేశారు. ఇక నేచురల్ గ్యాస్‌పై ఒక్కో ఎంబీటీయూకి 6.1 డాలర్లు లభించగా.. గత క్యూ2లో కేవలం 1.79 డాలర్లు పొందింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 5.47 మిలియన్ టన్నుల నుంచి 5.36 ఎంటీకి తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 5.46 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 5.35 బీసీఎంకు మందగించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కేజీ బేసిన్‌లో ఆరు డిస్కవరీలకు తెరతీసింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.3 శాతం బలపడి రూ. 142 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment