ఆచితూచి వ్యవహరించాల్సిందే! | Sakshi Guest Column On Canada PM Justin Trudeau | Sakshi
Sakshi News home page

ఆచితూచి వ్యవహరించాల్సిందే!

Published Thu, Sep 28 2023 12:26 AM | Last Updated on Thu, Sep 28 2023 12:26 AM

Sakshi Guest Column On Canada PM Justin Trudeau

కెనడాలోని ఒక సిక్కు నాయకుడి హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్  ట్రూడో చేసిన ఆరోపణలు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. రాజకీయంగా తన ప్రాచుర్యం క్రమేపీ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఖలిస్తాన్‌ అనుకూలురు ఉన్న ‘ఎన్‌డీపీ’ తన సంకీర్ణంలో కొనసాగేందుకు ట్రూడో ఈ పని చేసుండాలి. 2018 నాటి భారత పర్యటనలో తనను పట్టించుకోలేదన్న ట్రూడో అసంతృప్తి కూడా మరో కారణం కావొచ్చు. ఏమైనా ఈ వ్యవహార ప్రభావం అమెరికా, ఇతర జీ–7 దేశాల సంబంధాలపై పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా, ఖలిస్తాన్‌కు మద్దతునివ్వని ప్రపంచవ్యాప్త సిక్కుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.

కెనడా ప్రధాని జస్టిన్  ట్రూడో ఈమధ్య పెద్ద దుమారమే లేపారు. ఈ ఏడాది జూన్  18న కెనడాలోని గురుద్వారా వెలుపల జరిగిన కెనడా సిక్కు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనేందుకు తమ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందన్న ట్రూడో ప్రకటన ఇరు దేశాల మధ్య వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం చాలా కాలం క్రితమే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలకు నగదు బహుమతి కూడా ప్రకటించింది. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉండి ఉంటే అది అసాధారణమైన విషయమే అవుతుంది.

కాకపోతే పరిస్థితులను గమనించినప్పుడు నిజ్జర్‌ హత్య పక్కా గ్యాంగ్‌ వార్‌ను పోలుతుంది. నిజ్జర్‌ పూర్వాపరాలను గమనించినా హత్యకు గ్యాంగ్‌ వారే కారణమని అనిపించడం ఖాయం. సత్యం ఏమైనప్పటికీ ట్రూడో ఆరోపణల పుణ్యమా అని ఇప్పుడు భారత్‌ పరువుకు కొంత భంగం కలిగింది. అది కూడా జీ–20 సమావేశాలను అధ్యక్ష స్థానంలో ఉంటూ విజయవంతంగా పూర్తి చేసిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఇబ్బందికరమైంది. కామన్‌ వెల్త్‌ దేశమైన, భారతీయ సంతతివారు ఎక్కువ సంఖ్యలో ఉన్న, ఇండో–పసిఫిక్‌ వ్యూహంలో కీలకమైన కెనడాతో భారత్‌ సంబంధాలిప్పుడు అట్టడుగు స్థాయికి చేరాయి. 

అయితే ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది: చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలంటే భారత్‌ సాయం కచ్చితంగా అవసరమని అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్, పశ్చిమ యూరప్, జపాన్  భావిస్తున్నాయి. ఈ భాగస్వామ్యానికి కొన్ని పరిమితులు లేకపోలేదు. అదే సమయంలో నాటో, జీ–7 దేశాల సభ్య దేశాలతో వ్యవహరించే సందర్భంలో వ్యవహారం మారిపోయేందుకు అవకాశా లెక్కువ.

అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సుల్లివాన్  చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమవుతుంది: ‘‘ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ప్రత్యేకమైన మినహాయింపులు ఎవరికీ ఉండవు. దేశం ఏదైనా సరే, మా ప్రాథమిక నైతిక సిద్ధాంతాల రక్షణ కోసం నిలబడతాం. అలాగే దగ్గరి భాగస్వామి అయిన కెనడా లాంటి దేశాలతో సంప్రదింపులు జరిపి చట్టాన్ని పరిరక్షించేందుకు వారు చేసే ప్రయత్నాల్లోనూ, దౌత్యపరమైన ప్రక్రియల్లోనూ సహకరించుకుంటాం’’ అన్నారు ఆయన. 

తిరస్కరించిన భారత్‌
కెనడాలో ఓ సిక్కు నేత హత్య వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందన్న విషయాన్ని భారత్‌ నిర్ద్వంద్వంగా ఖండించింది. అర్థం లేని, దురుద్దేశపూరిత ఆరోపణలుగా కొట్టి పారేసింది. అయితే ఇంతటితో కథ ముగిసిపోయిందని అనుకునేందుకు వీల్లేదు. వట్టి తిరస్కా రాలతోనో, ఉగ్రవాదంపై చర్యల విషయంలో ట్రూడో నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టడంతోనో సమస్య సమసిపోదు. కెనడాలోని కొంతమంది సిక్కులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం వెనుక చాలా చరిత్రే ఉంది.

అయితే ప్రస్తుతం నిజ్జర్‌ లాంటివాళ్లు చేస్తున్న క్రిమినల్‌ కార్యకలాపాలపై భారత్‌ ఎక్కువగా దృష్టి పెట్టాలి. నిజ్జర్‌ రాజ కీయాలు, ఉగ్రవాద, హింసాత్మక కార్యక్రమాల్లో ఆయన ప్రమేయం వంటివి ఎత్తి చూపడం ఆయన హత్యను సమర్థించినట్లు కనిపించవచ్చు. మరీ ముఖ్యంగా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాల్లో ఈ రకమైన ఆలోచన బలపడవచ్చు. కానీ నిజ్జర్‌ కార్యకలాపాలపై ఉన్న సమాచారం మొత్తాన్ని భారతీయ నిఘా సంస్థలు కెనడా, ఇతర పాశ్చాత్య దేశాలతో పంచుకోవడం మేలు.

ట్రూడో ఆరోపణలను గట్టిగా తిరస్కరించడం ద్వారా భారత్‌ సరైన పనే చేసింది. భారతీయ దౌత్యవేత్తను కెనడా తిప్పి పంపడంతో భారత్‌ కూడా అదే పని చేయడమూ తగిన ప్రతిచర్యే. కానీ, పరిస్థి తులు మరింత దిగజారకుండా ఉండటం ఇరు దేశాలతోపాటు భారత్‌తో మరింత ఎక్కువ సంబంధాలు కోరుకుంటన్న పాశ్చాత్య మిత్రులకూ అత్యవసరం. కెనడాతో మనకున్న సంబంధాలు కాస్తా అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల మైత్రిపై ప్రభావం చూపరాదు. అదే జరిగితే ఈ అంశాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకునేందుకు చైనా, పాకిస్తాన్‌ కాచుకు కూర్చున్నాయన్న విషయం మరవరాదు. 

కెనడా రాజకీయాలూ చూడాలి...
ప్రస్తుత దౌత్య సమస్యకు కెనడాలోని స్థానిక రాజకీయ పరి స్థితులూ కారణం కావచ్చు. ట్రూడో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం ఉగ్రవాదులను సమర్థిస్తున్నారన్న నెపంపై కెనడా లోని కొంత మంది సిక్కులపై విమర్శలు చేయడం కూడా తగదు. దీనివల్ల కెనడాలోని మెజారిటీ సిక్కులు, ఇతర దేశాల వారు, మరీ ముఖ్యంగా భారతీయ సిక్కులను దూరం పెట్టినట్టుగా ఉండకూడదు. ఖలిస్థాన్‌ డిమాండ్‌కు వీరందరూ దూరమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖలిస్తాన్‌ భయాన్ని ఎత్తిచూపాలన్న ఉబలాటం ఉండొచ్చు, కానీ ఇది ఉద్దేశించని నష్టం కలిగించే ప్రమాదం ఉంది.

భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రూడో విమర్శలకు దిగడం వెనుక ఆయనకున్న వ్యక్తిగత ఆసక్తి ఏమిటన్నది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కెనడా రాజకీయాల్లో విదేశాల ప్రమేయంపై ఇప్పటికే విచారణ సాగుతోంది. దేశంలో చైనా కార్యకలాపాలపై చెక్‌ పెట్టలేకపోయారన్న అంశం ట్రూడోకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి, ఈ అంశం దాన్ని పక్కదోవ పట్టించగలదు. ట్రూడో ప్రభుత్వం మనుగడ కోసం సిక్కు రాజకీయ పార్టీ, ఖలిస్థాన్  ఉద్యమ అనుకూలురు ఎక్కువగా ఉన్న న్యూ డెమోక్రటిక్‌ పార్టీ (ఎన్‌డీపీ) మద్దతు అవసరం. ఇందుకోసమే ట్రూడో భారత్‌పై ఈ రకమైన విమర్శలకు దిగి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. 

సిక్కుల మనోభావాలు దెబ్బతినకుండా...
2018లో భారత పర్యటన సందర్భంగా తనను అంతగా పట్టించుకోలేదని ట్రూడో భావించడం కూడా ప్రస్తుత పరిస్థితికి ఒక కారణం కావచ్చు. ‘అన్ని పర్యటనలను అంతం చేసే పర్యటన’ అని ట్రూడో అప్పట్లోనే ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వ్యక్తిగతమైన భారత వ్యతిరేక భావన ఇప్పుడు ఇలా అనాలోచిత తప్పుడు ఆరోపణలకు దారితీసి ఉండవచ్చు. వ్యక్తిగా ట్రూడోతో ఉన్న సంబంధాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను నిర్ణయించే పరిస్థితి ఉండరాదు. రాజకీయంగా, వ్యూహాత్మకంగా, ఆర్థిక అంశాల పరంగానూ ఇరు దేశాల మధ్య సఖ్యత ఎంతో అవసరం. 

భారత్‌ – కెనడా సంబంధాల ప్రభావం అమెరికా, ఇతర జీ–7 దేశాలతో మనకున్న సంబంధాలపై కూడా ఉండవచ్చు. ట్రూడోతో మన గొడవ కాస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను దెబ్బతీయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. పంజా బ్‌లో ఇప్పటికే ఈ అంశంపై అసంతృప్తి రగులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రూడో ప్రభుత్వంపై భారత్‌కు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కేందుకు సిక్కు కుటుంబాలు తమ స్వస్థలాలకు రావడాన్ని అడ్డుకోవడం మార్గం కాదు. ఏమైనా, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారకుండా ఉండాలని ఆశిద్దాం.
శ్యామ్‌ శరణ్‌ 
వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement