
ఒట్టావా: కెనడాలో తొమ్మిదేళ్ల జస్టిన్ ట్రూడో(Justin Trudeau) పాలనకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా మార్క్ కార్నీ(Mark Carney) ఖరారు అయ్యారు. తాజాగా జరిగిన సమావేశంలో తమ కొత్త సారథిగా అధికార లిబరల్ పార్టీ కార్నీని ఎన్నుకుంది. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్‌లో పనిచేయని ఆయన.. కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
తీవ్ర ప్రజా వ్యతిరేకతతో జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త నేత ఎన్నిక దాకా జస్టిన్ ఆ పదవిలో కొనసాగారు. ఇక కొత్త ప్రధానిగా బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు .
తాజాగా జరిగిన ఓటింగ్‌లో లిబరల్ పార్టీ సభ్యులు మొత్తం 1,50,000 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు పొలవ్వగా.. క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134, కరినా గౌల్డ్‌కు 4,785, ఫ్రాంక్ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి. అంటే కార్నేకు వచ్చిన ఓట్లు 86 శాతమన్నమాట.
ఆర్థిక మేధావిగా పేరున్న మార్క్ కార్నీ సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తుండడం గమనార్హం.
ఎవరీ కార్నీ.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే
👉మార్క్ కార్నీ 1965లో ఫోర్ట్ స్మిత్‌లో జన్మించారు. హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్‌మన్ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేసిన ఆయన.. 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగి.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు.
👉2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితులయ్యారు. సరిగ్గా అదే సమయంలో కెనడా ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆ టైంలో ఆయన అనూహ్యంగా.. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు.
👉మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా 2013లో కార్నీ ఎన్నికయ్యారు. తద్వారా ఆ సెంట్రల్ బ్యాంక్‌కు మొట్టమొదటి నాన్-బ్రిటిష్ గవర్నర్‌గా నిలిచారు. అంతేకాదు, జీ7లోని రెండు సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ రికార్డుకెక్కారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడిన ఆయన.. ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. తాజా లిబరల్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికల రేసులో నిలిచిన నలుగురిలో అత్యధికారంగా విరాళాలు సేకరించిన అభ్యర్థి కూడా ఈయనే కావడం గమనార్హం.