కెనడా తదుపరి ప్రధానిగా మార్క్‌ కార్నీ | Mark Carney to replace Justin Trudeau as Canada next prime minister | Sakshi
Sakshi News home page

కెనడా తదుపరి ప్రధానిగా మార్క్‌ కార్నీ

Published Tue, Mar 11 2025 5:10 AM | Last Updated on Tue, Mar 11 2025 6:56 AM

Mark Carney to replace Justin Trudeau as Canada next prime minister

జస్టిన్‌ ట్రూడో స్థానంలో లిబరల్‌ పార్టీ నాయకుడిగా ఎంపికైన బ్యాంకర్‌

టొరంటో: కెనడా సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్‌ రంగ ప్రముఖుడు మార్క్‌ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్‌ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్‌ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం.

 ఆదివారం లిబరల్‌ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్‌లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్‌ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్‌ హౌస్‌ లీడర్‌ కరీనా గౌల్డ్‌(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్‌ బేలిస్‌(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

పదవీ స్వీకారం ఎప్పుడు ?
పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్‌ జనరల్‌కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్‌ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌–3 సమ్మతితో గవర్నర్‌ జనరల్‌.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్‌ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.

ట్రంప్‌ను నిలువరిద్దాం
పార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై  ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్‌లకు దీటుగా మనం కూడా టారిఫ్‌లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్‌ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.

బ్యాంకర్‌ పొలిటీషియన్‌
కెనడా, బ్రిటన్‌లోని సెంట్రల్‌ బ్యాంక్‌లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్‌ అనుభవం గడించిన మార్క్‌ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా గవర్నర్‌ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్‌ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్‌ టారిఫ్‌ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్‌ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

హార్వర్డ్‌లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్‌స్మిత్‌ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్‌లో పెరిగారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్‌ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్‌హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్‌ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్‌ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్‌ పాస్‌పోర్ట్‌ సంపాదించారు. గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడాలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.

3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా సేవలందించారు. 1694లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్‌కు గవర్నర్‌గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్‌ వేళ బ్రిటన్‌ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్‌గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement