కెనడా వక్రబుద్ధి | Sakshi Editorial On Canada PM Justin Trudeau | Sakshi
Sakshi News home page

కెనడా వక్రబుద్ధి

Published Thu, Sep 21 2023 12:20 AM | Last Updated on Thu, Sep 21 2023 12:20 AM

Sakshi Editorial On Canada PM Justin Trudeau

దశాబ్దాలుగా సక్రమంగా లేని భారత్‌–కెనడా దౌత్య సంబంధాల్లో మరోసారి పెను తుపాను రేగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా కెనడా ప్రవర్తనే ఈ పొరపొచ్చాలకు కారణమైంది. ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ను మొన్న జూన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఉదంతంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అక్కడి పార్లమెంటులో ఆరోపించారు. అంతేకాక ఈ విషయంలో భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక అధికారిని ఆ దేశం బహిష్కరించింది. దీనికి ప్రతిచర్యగా మన దేశం కూడా ఢిల్లీలోని కెనడా హైకమిషన్‌లో పనిచేస్తున్న సీనియర్‌ దౌత్యవేత్తను దేశం విడిచివెళ్లాలని ఆదేశించింది.

ట్రూడో ఆరోపణలు దురుద్దేశపూర్వకం, నిరాధారం అని కొట్టిపారేసింది. పనిలో పనిగా ఇరు దేశాలూ తమ తమ పౌరు లకు హెచ్చరికలు జారీ చేశాయి. భారత్‌ వెళ్లే కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తే, కెనడా సందర్శించే భారత్‌ పౌరులపై ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం ఉన్నదని మన దేశం హెచ్చరించింది. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకోవటం వంటి ఉదంతాలు మనకు పాకిస్తాన్, చైనాలతోనే ఎక్కువ. 2013లో అమెరికాలోని న్యూయార్క్‌లో భారత్‌ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌గా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రగడే పట్ల అనుచితంగా ప్రవర్తించి సంకెళ్లు వేసి నిర్బంధించిన ఉదంతం తర్వాత మన దేశం అమెరికా దౌత్యవేత్తలకు అంతవరకూ ఉండే ప్రత్యేక సదుపాయాలను ఉపసంహరించింది. 

గత కొంతకాలంగా కెనడాలో పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రోద్బలంతో ఖలిస్తానీ ఉద్యమకారులు రెచ్చిపోతున్నారు. ఇదిలా కొనసాగితే ఇరు దేశాల దౌత్యసంబంధాలూ దెబ్బతినే ప్రమాదం ఉన్నదని దౌత్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒక్క కెనడాయే కాదు... బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో కూడా ఖలిస్తానీ ఉద్యమకారుల పోకడలు ఆందోళనకరంగానే ఉంటున్నాయి. భారత కార్యాలయాలపై, దేవాలయాలపై దాడులు, మన పౌరులను గాయపరచటం వంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. హింసాత్మక ఘటనలకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని మన దేశం కోరుతున్నా అక్కడి ప్రభుత్వాల స్పందన అంతంతమాత్రం.

ఉద్యమకారులపై చర్యలు తీసు కోవటం మాట అటుంచి ఏకంగా మన ప్రభుత్వంపైనే కెనడా నిందారోపణలకు దిగింది. పాశ్చాత్య దేశాలు తమకు ముప్పు ముంచుకొచ్చినప్పుడు తప్ప ఇతర సమయాల్లో ప్రజాస్వామ్యం గురించి ప్రవచిస్తుంటాయి. 2001లో ఉగ్రవాదులు తమ దేశంలో పెనువిధ్వంసం సృష్టించి, వందలాది మంది మరణానికి కారకులయ్యాక అమెరికా గ్వాంటనామో బేలో శత్రు దుర్భేద్యమైన జైలు నిర్మించి కేవలం ఉగ్రవాదులన్న అనుమానంతో దశాబ్దాల తరబడి ఎందరినో ఏకాంతవాసంలో నిర్బంధించింది. ఇప్పటికీ ఆ జైల్లో ఎలాంటి విచారణ లేకుండా ఎందరో మగ్గిపోతున్నారు.

అలాంటి దేశాలు భారత్‌కు సూక్తులు చెబుతున్నాయి. నిఘా వ్యవస్థల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లు గతంలోనే ‘ఫైవ్‌ అయిస్‌’ (పంచ నేత్రాలు) పేరిట ఒక ఉమ్మడి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఖలిస్తానీ ఉద్యమకారుల ఆగడాల గురించి ఈ వ్యవస్థ వద్ద ఎలాంటి సమాచారం ఉందో తెలియదుగానీ... తాజాగా కెనడా చేసిన ఆరోపణలపై మాత్రం అందులోని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు ‘ఆందోళన’ వ్యక్తం చేశాయి.

ఈమధ్యే న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు నిజ్జార్‌ ఉదంతాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చానని ట్రూడో అంటున్నారు. మోదీ సైతం ఖలిస్తానీ వాదుల ఆగడాలపై ఆయనను ప్రశ్నించారు. నిజ్జార్‌ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ఈలోగానే ట్రూడో అంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడారన్నది ఆశ్చర్యకరం. 

మొదటినుంచీ కెనడా అంతర్గత రాజకీయాలు భారత్‌–కెనడా సంబంధాలను శాసిస్తున్నాయి. కెనడాలో భారతీయుల సంఖ్య దాదాపు 14 లక్షలు. ఇది కెనడా జనాభాలో 3.7 శాతం. అందులో సగం మంది సిక్కులు. కొన్ని నియోజకవర్గాల్లో సిక్కు ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం, వారిపై ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం ఉండటం కెనడా రాజకీయాల్లో వారి ప్రాబల్యాన్ని పెంచింది. అందుకే కావొచ్చు...పంజాబ్‌లో 90వ దశకంలోనే అంతరించిన ఖలిస్తానీ ఉద్యమం ఇంకా అక్కడ సజీవంగా మనుగడలో ఉంది.

2021 ఎన్నికల్లో ట్రూడో నాయకత్వంలోని లిబరల్‌ పార్టీ మెజారిటీ సాధించలేక సిక్కు నేత జగ్మీత్‌సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమాక్రటిక్‌ పార్టీ(ఎన్‌డీపీ) మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచీ ఖలిస్తాన్‌ ఉద్యమకారుల విషయంలో కెనడా మరింత మెతకగా ఉంటోంది. కొత్తగా అమెరికా కనుసన్నల్లో ఏర్పాటైన ఇండో–పసిఫిక్‌ కూటమి తర్వాత భారత్‌తో భాగస్వామ్యం కోసం కెనడా తహతహలాడటం మొదలుపెట్టినా, ఖలిస్తానీ వాదులు ఆ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు ఏదో ఒక ఎత్తుగడ వేస్తున్నారు.

ఇప్పుడు హత్యకు గురైన నిజ్జార్‌ వివాదరహితుడేమీ కాదు. 2007లో పంజాబ్‌లోని ఒక సినిమా హాల్‌లో బాంబు దాడి మొదలుకొని ఇంతవరకూ 20 కేసుల్లో నిందితుడు. ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌. ఇతగాడే కాదు...అనేకమంది మాఫియా ముఠాల నేతలు కెనడాలో ఆశ్రయం తీసుకుంటూ భారత్‌లో నేరాలకు దిగుతున్నారు. వీరిని అప్పగించమని మన దేశం కోరుతున్నా కెనడా పెడచెవిన పెడుతోంది. కెనడా తీరుతెన్నులపై మన దేశం దౌత్య యుద్ధం సాగించాలి. జరుగుతున్నదేమిటో ప్రపంచ దేశాలకు వివరించాలి. కెనడాలో చదువులకూ, ఉపాధికీ వెళ్లిన మన పౌరుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement