సాక్షి, న్యూఢిల్లీ : జడ్జీలకు, ప్రభుత్వ సర్వెంట్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై ప్రాథమిక దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం నుంచి తప్పనిసరి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెల్సిందే. దేశంలో వేళ్లూనుకుంటున్న అవినీతిని కూకటి వేళ్లతో సహా నిర్మూలిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను ఎలా సమర్థిస్తుంది? అత్యున్నత స్థానాల్లో అవినీతికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను రాజస్థాన్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉల్లంఘించడం లేదా?
ప్రభుత్వ సర్వెంట్ల పరిధిలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఆమె క్యాబినెట్ మంత్రులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. పదవిలో ఉన్న పబ్లిక్ సర్వెంట్లతోపాటు పదవీ విరమణ చేసిన వారిని కూడా విచారించాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అంటే, వసుంధర రాజే దగ్గరి నుంచి ఆమె మంత్రివర్గ సహచరులపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లయితే వారు ఆ పదవుల నుంచి తప్పుకున్నప్పటికీ వారి విచారణకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే విచారణ జరపనేరాదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 156వ సెక్షన్‌లో సవరణ తీసుకొచ్చింది. కేంద్ర చట్టంలో సవరణ తీసుకోవాల్సి వచ్చినందున రాష్ట్ర గవర్నర్ దానికి తప్పనిసరి ఆమోదం తెలిపాల్సి వచ్చింది. ఇలాంటి చట్టాల విషయంలో గవర్నర్ ఆమోదమంటే కేంద్ర హోం శాఖ అనుమతి ఉన్నట్లే లెక్క. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రమాదకర సవరణ కూడా తీసుకొచ్చింది. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో విచారణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయక ముందే నిందితుల పేర్లనుగానీ, వారి వివరాలనుగానీ వెల్లడించిన జర్నలిస్టులకు రెండేళ్ల జైలు లేదా జరిమానా విధించాలన్నదే ఆ సవరణ.
సుప్రీం కోర్టు తీర్పుల ఉల్లంఘనే....
అవినీతి వ్యతిరేక కార్యకర్త, ప్రముఖ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ కేసులో 1997లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉంది రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్. కొన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణల విషయంలో సీబీఐ విచారణపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదన్నది ఈ కేసులో తీర్పు సారాంశం. జాయింట్ సెక్రటరీ స్థాయి, అంతకన్నా పై స్థాయి ఉద్యోగుల విచారణకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరంటూ ‘ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్’లోని నిబంధనను 2014లో సుప్రీం కోర్టు కొట్టివేయడం కూడా ఇక్కడ గమనార్హం. చట్టం ముందు అందరూ సమానమంటూ రాజ్యాంగంలోని 14వ అధికరణంను ఉల్లంఘించడమేనని కూడా ఆ తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది.
కేసు విచారణ మొదలు పెట్టడం ఎలా?
ప్రాథమిక విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అంటే పరోక్షంగా కేసు విచారణను కాదనడమే. చాలా కేసుల్లో అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక విచారణ జరపనిదే దర్యాప్తు అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించలేరు. అలాంటప్పుడు వారు ఏదైనా కేసు విచారణకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినప్పుడు ఆ కేసుకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలను ఎక్కడ నుంచి తేగలరు? ఎలా తేగలరు? పైగా ఇక్కడ అవినీతి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థలకున్న విచక్షణ లేదా స్వయం ప్రతిపత్తి అధికారాలను దెబ్బతీయడం కాదా!
మీడియాకు కఠిన శిక్షల వెనక ఆంతర్యం ఏమిటి?
దర్యాప్తుకు అనుమతి పొందిన కేసుల్లో మాత్రమే నిందితుల పేర్లను వెల్లడించాలని, లేకపోతే జర్నలిస్టులకు రెండేళ్లు జైలు శిక్ష విధించడం అన్న నిబంధన దేన్ని సూచిస్తోంది! ప్రాథమిక దశలోనే అవినీతిని వెల్లడించవద్దనా? నిందితుల పేర్లను వెల్లడించకుండా అవినీతి వార్తలను మీడియా ఎలా కవర్ చేయగలదు? 2జీ స్పెక్ట్రమ్ కేసును తీసుకున్నట్లయితే ఎవరి పేరు లేకుండా ఎలా రాయగలం? ఒకవేళ ప్రస్థావించకపోయినా ప్రధాన నిందితుడు ఏ రాజా అన్న విషయం పాఠకులకు అర్థంకాదా? బోఫోర్స్ కుంబకోణం కేసునే తీసుకుంటే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గురించి చెబుతున్నట్లా, కాదా? నిందితుడు ఎవరో తెలుస్తోందన్న కారణంగా కూడా జర్నలిస్టులను శిక్షిస్తారా?
ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తే పర్యవసానాలేమిటీ?
రాజస్థాన్‌లో ఇలాంటి ఆర్డినెన్స్‌ను తీసుకోవడంలో తమ పార్టీకి ఎలాంటి దురుద్దేశాలు లేవని, తమది అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పార్టీ అని కేంద్రంలోని బీజేపీ పార్టీ సమర్థించుకుంది. మరి బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి చట్టాలనే తీసుకొస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి? బెంగళూరులో ఓ ఉక్కు వంతెన నిర్మాణానికి సంబంధించి బీజేపీ ఇటీవల చేసిన అవినీతి ఆరోపణలను మీడియా ప్రచురించడంతోపాటు అవినీతిని వెలికితీసేందుకు కషి చేసింది. రాజస్థాన్ లాంటి చట్టం కర్ణాటకలో కూడా ఉంటే మీడియాకు ఆ అవినీతి ఆరోపణలను ప్రచురించే అవకాశం ఉండేది కాదుకదా? ఇదే విషయాన్ని బీజేపీ నేతల దష్టికి తీసుకెళితే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం రాజస్థాన్ ఒక్కటే కాదని, ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సమర్థించుకుంటున్నారు. ఇది సమంజసమేనా?
Comments
Please login to add a commentAdd a comment