న్యూఢిల్లీ: ఉత్పత్తులు, సర్వీసులపై వినియోగదారులను తప్పుదోవ పట్టించే నకిలీ ఆన్‌లైన్ సమీక్షలకు చెక్ చెప్పే దిశగా కేంద్రం కొత్త పాలసీని రూపొందించింది. ఇది నవంబర్ 25 నుండి అమల్లోకి రానుంది. ఆయా ఆన్‌లైన్ పోర్టల్స్ ముందుగా వీటిని స్వచ్ఛందంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ తప్పుడు రివ్యూల సమస్య కొనసాగిన పక్షంలో నిబంధనలను కేంద్రం తప్పనిసరి చేయనుంది. దీని ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు స్వచ్ఛందంగా అన్ని పెయిడ్ రివ్యూల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది.
ఇతరుల నుండి కొనుగోలు చేసిన సమీక్షలు, అలాగే సరఫరాదారు లేదా థర్డ్ పార్టీ తమ ఉత్పత్తులు/సర్వీసుల రివ్యూ కోసం నియమించుకున్న ఉద్యోగులు రాసే సమీక్షలను ప్రచురించకూడదు. ఆన్‌లైన్ వినియోగదారుల రివ్యూలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ పేరిట కొత్త ప్రమాణాన్ని రూపొందించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం తెలిపారు. ఉత్పత్తులు .. సర్వీసుల సరఫరాదారులు, తమ సొంత కస్టమర్ల నుండి రివ్యూలను సేకరించే సంస్థలు, సరఫరాదారు నియమించుకున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టరు సహా కన్జూమర్ రివ్యూలను ఆన్‌లైన్‌లో ప్రచురించే అన్ని సంస్థలకు ఇవి వర్తిస్తాయని వివరించారు.
15 రోజుల్లో సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం..
ఆన్‌లైన్ పోర్టల్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను వచ్చే 15 రోజుల్లోగా ప్రారంభించనున్నట్లు సింగ్ చెప్పారు. ఈ–కామర్స్ సంస్థలు ఈ సర్టిఫికేషన్ కోసం బీఐఎస్‌కి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. చాలా దేశాలు తప్పుడు రివ్యూలకు అడ్డుకట్ట వేసేందుకు చాలా తంటాలు పడుతున్న తరుణంలో ఈ తరహా ప్రమాణాలను ప్రవేశపెట్టిన తొలి దేశం బహుశా భారతేనని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా టూర్..ట్రావెల్, రెస్టారెంట్లు .. హోటళ్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సింగ్ తెలిపారు.
జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థలు కొత్త ప్రమాణాలపై సంప్రదింపుల ప్రక్రియలో పాల్గొన్నట్లు సింగ్ చెప్పారు. అలాగే ప్రమాణాల రూపకల్పనలో సీఐఐ, ఫిక్కీ తదితర పరిశ్రమ సమాఖ్యలను కూడా సంప్రదించినట్లు వివరించారు. నిబంధనల ప్రకారం .. ఏ సంస్థలోనైనా రివ్యూలను హ్యాండిల్ చేసే బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగిని రివ్యూ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తారు. సమీక్షలు చట్టబద్ధమైనవిగా, కచ్చితమైనవిగా, తప్పుదోవ పట్టించని విధంగా ఉండాలి. రివ్యూ చేసే వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేర్లను వెల్లడించకూడదు. సమీక్షలసేకరణ పక్షపాతరహితంగా ఉండాలి.
చదవండి: మూన్‌లైటింగ్: 81 శాతం ఉద్యోగులు స్పందన ఇదే.. సర్వేలో షాకింగ్ విషయాలు!
Comments
Please login to add a commentAdd a comment