రోజూ బడి బాదరబందీ ఏమిటన్న బెంగ లేదు... చండామార్కుల వంటి గురువుల ఆగ్రహ నయనాలు తమవైపే తీక్షణంగా చూస్తాయన్న భయం లేదు. అడిగిన ప్రశ్నకు బదులీయకపోతే వీపు పగలవచ్చునన్న బెరుకు లేదు. సెలవులు ఎప్పుడెప్పుడా అన్న చింత లేదు. కరోనా వైరస్ మహ మ్మారి పుణ్యమా అని కనీవినీ ఎరుగని రీతిలో నాలుగు నెలలుగా బడులన్నీ తలుపులు మూసుకున్నాయి. పిల్లలంతా వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే వారిలో చాలామందికి బడికెళ్తేనే బాగుండునన్న అభిప్రాయం కలిగివుండొచ్చు. కానీ ఈ మహమ్మారి పీడ పోయేదాకా అది సాధ్యమయ్యేలా లేదు.
అందుకే ఒకటి రెండు నెలలుగా ఆన్‌లైన్ బోధన అనే మాట వినబడుతోంది. లేడికి లేచిందే పరుగన్నట్టు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇదే అదునుగా సొమ్ములు పోగేసుకోవచ్చునన్న దురాశతో ఆన్‌లైన్ బోధన మొదలుపెట్టేశాయి. కనుకనే తల్లిదండ్రుల నుంచి, విద్యారంగ నిపుణుల నుంచి ఆన్‌లైన్ బోధనపై మార్గదర్శకాలను విడుదల చేయాలన్న డిమాండు మొదలైంది. ఆలస్యంగానే అయినా మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వీటిని విడుదల చేసింది.
ఆన్‌లైన్ బోధనంటూ మొదలుపెట్టిన పాఠశాలలు, కళాశాలలు మౌలికమైన అంశాలను విస్మ రించాయి. తరగతి గదిలో జరిగే బోధన మాదిరే ఆన్‌లైన్‌లోనూ బోధిస్తే సరిపోతుందని అవి భావిం చాయి. ఎదురుగా ఒక కెమెరా పెట్టుకుని బ్లాక్ బోర్డు ముందు టీచర్ నించుని చెప్తే ఎప్పటిలానే విద్యార్థికి అవగాహన కలుగుతుందని యాజమాన్యాలు అనుకున్నాయి. కానీ తరగతిలో పిల్లలనుద్దేశించి బోధించడం వేరు. ఆ పిల్లలకే ఆన్‌లైన్‌లో పాఠం చెప్పడం వేరు. పిల్లలు బడికొచ్చి టీచర్ చెప్పే పాఠాలు వినడం, నోట్సు రాసుకోవడం మాత్రమే చేయరు. తమ తోటివారితో సంభాషణల్లో నిమగ్నమవుతారు.
అవి బోధనకు సంబంధించి కావొచ్చు... ఊళ్లో జరిగిన ఘటన గురించి కావొచ్చు... ఇంట్లో వచ్చిన కష్టసుఖాల గురించి కావొచ్చు... తమకు ఎదురైన అనుభవం గురించి కావొచ్చు. ఈ క్రమంలో వారికి తమ చుట్టూ వున్న సమాజం గురించి అర్థమవుతుంది. బుద్ధి విక సిస్తుంది. దేన్నయినా నేర్పుగా ఎలా ఎదుర్కొనాలో తెలుస్తుంది. తోటి పిల్లలను వారు అనునిత్యం గమనిస్తారు. ఒక అంశాన్ని వారు అవగాహన చేసుకుంటున్న తీరుకూ, తమ తీరుకూ పోల్చు కుంటారు. మరింత సులభంగా, ప్రభావవంతంగా చదవడం ఎలాగో తెలుసుకుంటారు. వివేచ నాత్మక అధ్యయన నైపుణ్యం అలవడుతుంది. తరగతి గది చర్చల్ని ప్రోత్సహిస్తుంది. ఏకకాలంలో ఉపాధ్యాయులనూ, విద్యార్థులనూ సానబడుతుంది. టీచర్లు చదువు చెప్పి ఊరుకోరు.
తమ ముందున్నవారి ముఖకవళికలు గమనిస్తూ ఎవరికి అవగాహన కలుగుతున్నదో, ఎవరిలో ఇంకా సందేహాలున్నాయో పోల్చుకోగలుగుతారు. వాటిని అడిగేందుకు ప్రోత్సహిస్తారు. వారితో సంభాషిస్తూ... వారి స్థాయికి దిగి బోధించే ప్రయత్నం చేస్తారు. తాము చెప్పే పాఠంపై పిల్లల్లో ఒక రకమైన ఆసక్తిని, అనురక్తిని కలగజేస్తారు. ఈ క్రమంలో మరింత మెరుగ్గా బోధించడమెలాగో తాము కూడా నేర్చుకుంటారు. అటు విద్యార్థులు సైతం తమకు అర్ధమవుతున్నదేమిటో, కానిదేమిటో చెప్పగలిగే సామర్థ్యం అలవర్చుకుంటారు. అంతేకాదు... భిన్న అంశాలపై తార్కికంగా ఆలోచించడం, అభి ప్రాయాలు ఏర్పర్చుకోవడం సాధ్యపడుతుంది. బోధించడమనేది ఒక కళ అయినట్టే... వినడం కూడా కళే. ఆ లక్షణం వారిని ఉన్నతశిఖరాలకు ఎదిగిస్తుంది. చదువుకైనా, ఆటలకైనా, ఇతరత్రా కార్య కలాపాలకైనా తోటివారిని కూడగట్టడం పిల్లలు నేర్చుకుంటారు. ముందురోజు ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేసుకోవడం, ఎప్పటికప్పుడు అసైన్‌మెంట్లు చేయడం, రోజూ నిర్ణీత సమయానికల్లా బడికి హాజరుకావడం వంటివి పిల్లలను నియమబద్ధ జీవితంవైపు అడుగులేయిస్తాయి. అనంతర కాలంలో సమాజంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి.
దురదృష్టవశాత్తూ ఆన్‌లైన్ విద్యాబోధనలో ఇదంతా సాధ్యం కాదు. అవసరమైన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉన్నవారికీ... వాటిని సమకూర్చుకునే స్తోమత లేనివారికీ మధ్య ఎటూ అంతరాలు ఏర్పడుతున్నాయి. అన్నీ సమకూర్చుకోగలిగినవారు సైతం చదువుకునే క్రమంలో పొందవలసిన జ్ఞానానికి ఆన్‌లైన్ విధానం వల్ల దూరమవుతున్నారు. కొన్ని దశాబ్దాలక్రితం దూరవిద్యా విధానం మొదలైనప్పుడు విద్యారంగ నిపుణుల్లో చాలామంది దాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్‌లైన్ బోధన తప్పేలా లేదు. పిల్లల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు బెంబేలు పడుతున్నారు.
బడిలో ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా అక్కడికి చేరేలోగా, అక్కడినుంచి తిరిగొచ్చేలోగా ఏమవుతుందోనన్న ఆందోళన వారికుంది. అందుకే సెల్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్లు కొనిస్తే చదువుకుంటారని వారనుకున్నారు. అయితే ఎక్కువ సమయం ఆ ఉపకరణాలతో గడిపితే పిల్లల్లో ఏర్పడే సమస్యలపైనా తల్లిదండ్రులకు భయం వుంది. కనుకనే తగిన మార్గదర్శకాలు రూపొందించాలన్న అభిప్రాయం కలిగింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రోజుకు అరగంట మించి బోధించరాదని, ఒకటి నుంచి 8వ తరగతి వరకూ రోజుకు రెండు క్లాసులు, అవి కూడా ఒక్కోటి 30–45 నిమిషాల మధ్య మాత్రమే ఉండాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. 9–12 తరగతుల వారికి గరిష్టంగా నాలుగు సెషన్లు మాత్రమే వుండాలని సూచిస్తున్నాయి. వీటిపైనా, ఇతర మార్గదర్శకాలపైనే మరింత లోతుగా చర్చించి, అవసరమైన సవరణలు చేస్తే పిల్లలకు ఉపయోగపడతాయి. బోధనకు రోజులో ఎంత కేటా యించాలన్న అంశంతోపాటు, ఆన్‌లైన్ విధానంలో దానికి సృజనాత్మకత జోడించి మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దడమెలాగన్న అంశంపైనా నిపుణులు శ్రద్ధ పెట్టాలి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకూ ఇదంతా తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment