వేటకు దిగకుండా విశ్రాంతి తీసుకుంటున్నంత మాత్రాన పులితో ప్రమాదం లేదనుకుంటే పొర పాటే. రెండున్నరేళ్ళుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా సంగతీ అంతే. కొన్ని నెలలుగా మన దేశంలో అలజడి చేయని కరోనా మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగు తున్నాయి. తాజాగా దేశంలో రోజువారీ ఇన్ఫెక్షన్లు గత 3 నెలల్లో అత్యధికమైన 5 వేల పైచిలుకుకు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.67కూ, వారంవారీ పాజిటివిటీ రేటు 1.12కూ ఎగబాకింది.
కేంద్ర సర్కారే బుధవారం ఈ సంగతి ప్రకటించడం ప్రస్తుత పరిస్థితికి నిలువుటద్దం. సోనియా గాంధీ, షారుఖ్ ఖాన్ లాంటి ప్రముఖుల పేర్లు తాజా కరోనా బాధితుల జాబితాకెక్కడం అందరినీ తల తిప్పి చూసేలా చేస్తోంది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా కట్టడిలో లేదన్న వార్తలతో, మన దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తుందా? నాలుగో వేవ్ ముప్పు తప్పదా అన్న చర్చ మొదలైంది.
ఈ చర్చకు కారణాలు కూడా అనేకం. గడచిన వేవ్‌లలో లాగానే ఇప్పుడు కూడా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లో కొత్తగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం గమనార్హం. ఒక్క గత వారమే దేశంలో 25 వేల పైగా కేసులు వచ్చాయి. నాలుగైదు నెలల విరామం తర్వాత ఇలా నిర్ణీత రాష్ట్రాల్లో కేసులు పెరుగుదల ఆలోచించాల్సిన విషయమే. మహారాష్ట్రలో ప్రధానంగా ముంబయ్‌లో, అలాగే థానే, నవీ ముంబయ్‌ల శివారు నగరాల్లోనే నూటికి 90 శాతానికి పైగా కేసులు వస్తున్నాయి.
కేరళ, కర్ణాటక, ఢిల్లీల్లోనూ కరోనా పైపైకి ఎగబాకుతోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలతో విమాన ప్రయాణాల్లో ఫేస్ మాస్కులు తప్పనిసరి చేస్తూ, బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. మారుతున్న ఈ పరిస్థితుల్లో చేతులు కాలాక ఆకులు పట్టుకొనే కన్నా, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి లాంటి అతి చౌకైన, అత్యంత సులభమైన ముందు జాగ్రత్తలను పాలకులు విధించడం మంచిది.
నిజానికి, కరోనా కట్టడిలో చైనా, హాంగ్‌కాంగ్ లాంటివి ఆలస్యంగా స్పందించడం, అనుసరిం చిన లోపభూయిష్ఠ విధానాలు మనతో సహా ప్రపంచం మొత్తానికీ పాఠాలు. ‘జీరో కోవిడ్’ విధాన మంటూ కేసులేవీ లేకుండా చూడాలని లాక్‌డౌన్‌లు పెట్టే కన్నా, జాగ్రత్తలతో ప్రగతి రథంలో పురోగ మించడమే సామాన్యుడి జీవనానికీ, దేశ ఆర్థికపురోగతికీ ఆరోగ్యశ్రీ. అలాగని అన్నీ గాలికొదిలేసి, విందులు, చిందులు చేస్తే కరోనా పులి పొంచి ఉందని హిందీ చిత్రసీమలో ఓ ప్రముఖుడు ఇటీవల ఇచ్చిన పార్టీ స్పష్టం చేసింది.
రెండున్నరేళ్ళలో దేశంలో కరోనా వ్యాప్తిని గమనిస్తే – 2020 ఆగస్టు 7న దేశంలో బాధితుల సంఖ్య 20 లక్షలు దాటింది. అదే ఏడాది డిసెంబర్ 19కి కోటి, నిరుడు మే 4న రెండు కోట్లు, సరిగ్గా ఏడాది క్రితం జూన్ 23న మూడు కోట్ల మార్కు దాటేశాం. ప్రస్తుతం 4.31 కోట్ల పైన ఉన్నాం. కేసులు పెరుగుతున్నా, కోలుకుంటున్నవారి రేటు 98.72 శాతం ఉండడం పెద్ద ఊరట.
ఈ జనవరిలో ముంబయ్ లాంటి చోట్ల రోజుకు 20 వేల కేసులొచ్చాయి. దానికి కారణమైన కరోనా వేరియంట్ ఒమిక్రానే ఇప్పటికీ దేశంలో విస్తరిస్తోందని నిపుణుల మాట. ఒకసారి వచ్చి పోయింది గనక రెండోసారి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఉందనీ, ఇది నాలుగో వేవ్‌కు దారి తీయకపోవచ్చనీ నిపుణుల మాట. తొలి రెండు వేవ్‌ల మాదిరిగా ప్రస్తుతం ప్రాణాంతక పరిస్థితులు లేవన్నది నిజం. తొలి రోజుల్లో కన్నా కరోనాపై పెరిగిన అవగాహన, పెద్దయెత్తున టీకాకరణ, కరోనాపై పోరులో ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తమైన తీరు లాంటివన్నీ జనం ఊపిరి పీల్చుకోగలిగేలా చేస్తున్నాయి. కానీ, ఇది సరిపోదు.
ప్రాణాంతక మహమ్మారి స్థాయి నుంచి జలుబు, జ్వరం లాంటి సామాన్య ఇన్‌ఫెక్షన్ స్థాయికి కరోనా మారే క్రమంలో చాలా దూరమే వచ్చాం. అయితే, గమ్యం ఇంకా రాలేదని గుర్తించాలి. అనేక రకాల ఇన్‌ఫెక్షన్ల లానే కరోనాతోనూ కలసి జీవించక తప్పదని గ్రహించాలి. భయపడనక్కర్లేదు కానీ, మాస్కులు, చేతుల పరిశుభ్రత లాంటి కనీస జాగ్రత్తలతో పాటు టీకా కవచాన్ని ధరించడమే తెలివైన పని అని గమనించాలి. వీటిని విస్మరించి, నిర్లక్ష్యం చేస్తేనే కష్టం.
నిదానంగా మొదలుపెట్టినా, చకచకా టీకాల ఆవిష్కరణతో, టీకాకరణతో రెండేళ్ళలో దేశంలో దాదాపు 90 శాతం వయోజనులకు టీకాలు పూర్తిచేశాం. మొన్న ఏప్రిల్ నుంచి వయోజనులందరూ ముందు జాగ్రత్త మూడో డోసు వేసుకోవచ్చన్నారు. కానీ ఆ డోసులు తీసుకుంటున్నవారు తక్కువే. కేవలం సీనియర్ సిటిజన్ల సంగతే చూసినా, ముందు జాగ్రత్త డోసులో మన జాతీయ సగటు 42 శాతమే. అంటే, 60 ఏళ్ళు పైబడ్డవారిలో నూటికి 42 మందే మూడో డోసు వేయించుకుంటున్నారన్న మాట.
పైపెచ్చు, 27 రాష్ట్రాల్లో పరిస్థితి ఈ జాతీయ సగటు కన్నా తక్కువే. వెరసి, కరోనా పట్ల నిర్లిప్తత, ముందు జాగ్రత్తల్లో నిర్లక్ష్యం నెలకొన్నదని అర్థమవుతోంది. కేంద్ర సర్కార్ సైతం ఉచిత మూడో డోస్‌ను ఫ్రంట్‌లైన్ వర్కర్లకే కాక మిగతా వారికీ విస్తరించే ఆలోచన చేయాలి. తొలి రెండు డోసుల లాగా మూడో డోసునూ రాష్ట్రాలకు అందించే బాధ్యత తీసుకోవాలి.
అరకొర ఆన్‌లైన్ చదువులతో రెండేళ్ళుగా సతమతమైన పిల్లలకు మళ్ళీ విద్యాసంస్థలు తెరిచే వేళయింది. ఇప్పటికే ప్రపంచంలో ఒమిక్రాన్‌కు వందకు పైగా వేరియంట్స్ వచ్చాయి. భారత్‌లో కొత్త ఉత్పరివర్తనాలతో కరోనా విరుచుకుపడితే, తగినన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ ఏర్పాట్లు లేవు. ప్రభుత్వ రంగంలో 28, ప్రైవేట్‌లో 5 ల్యాబ్‌లే గతి. కాబట్టి, కరోనాపై జోరు తగ్గించిన పాలకులు త్వరపడాలి. ఆర్థిక పురోగతికీ ప్రజారోగ్యమే కీలకమని పునశ్చరణ చేసుకోవాలి. ప్రపంచ పటం నుంచి కరోనా పోనందున జాగ్రత్తలు తప్పనిసరి చేస్తూనే, జనజీవితం సాఫీగా సాగేలా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment