గత నెల 5వ తేదీ మొదలుకొని రోజూ సగటున లక్షకుపైగా కేసులు నమోదవడంతో మొదలై గత పది రోజుల్లో దాదాపు 40 లక్షల కొత్త కేసులు(రోజుకు సగటున నాలుగు లక్షలు) వెల్లడైన నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలో రెండున్నర కోట్ల కేసులకు దగ్గరవుతోంది. గత గురువారం ఒకేరోజు 4.14 లక్షల కేసులు నమోదై రికార్డు సృష్టించగా ఆ తర్వాత ఆ సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పట్టడం మొదలైంది. ముఖ్యంగా కొత్తగా నమోదయ్యే కేసుల్లో 60 శాతం వాటాతో దేశాన్ని మొత్తం హడలెత్తించిన మహారాష్ట్ర మూడున్నర వారాలుగా శాంతిస్తోంది. ఢిల్లీ సైతం ఆ బాటలోనే వుంది. అయితే అదే సమయంలో కర్ణాటక, కేరళల్లో కేసుల సంఖ్య పెరిగాయి. అదృష్టవశాత్తూ ఆ రెండు రాష్ట్రాల్లో అనుకున్నంత ఉగ్రరూపం దాల్చలేదు. ఉత్తరప్రదేశ్ పరిస్థితి కూడా అంతే. అయితే నిరుడు ముసిరిన కరోనా సంగతలావుంచి, ఈసారి తిరిగి అది తలెత్తినప్పటినుంచీ ప్రభుత్వాలు ఏమేరకు స్పందించగలుగుతున్నాయని గమనిస్తే నిరాశే మిగులుతుంది. ఇంకా చాలాచోట్ల ఆక్సిజన్ కొరత రోగులను పీడిస్తూనే వుంది. వెంటిలేటర్ల సదుపాయం సాధారణ పౌరులకు అంత సులభంగా లభించడం లేదు. ఆసుపత్రుల్లో చాలినంతమంది సిబ్బంది వుండటం లేదు. ఉన్న సిబ్బందే తీవ్రంగా శ్రమించవలసి వస్తోంది.
ఇప్పుడు వెల్లడవుతున్న జాతీయ గణాంకాలు ఏమేరకు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయన్న సందేహాలు నిపుణుల్ని సైతం వేధిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఇప్పటికీ అంతంతమాత్రమే. నిరుడు తప్పో ఒప్పో కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఇచ్చి దేశమంతా లాక్‌డౌన్ విధించారు. ఎవరినీ ఎక్కడికీ కదలనీయబోమంటూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇలాగే వుంటే ఆకలితో దిక్కులేని చావు చస్తామన్న భయాందోళనలు ఏర్పడి, జనం నడకదారిన స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకునేసరికి పది పదిహేను రోజులు పట్టింది. తగిన ప్రణాళికలు రూపొందించుకోవడానికి, వాటి అమలుకు అవసరమైనవన్నీ తరలించడానికి చురుగ్గా కదిలే ప్రభుత్వాలకు ఆ వ్యవధి చాలు. కానీ లాక్‌డౌన్ పేరిట ఎవరూ ఇల్లు కదలకుండా కాపలా కాయడం తప్ప చేయాల్సింది మరేం లేదన్న అభిప్రాయంతో చాలా ప్రభుత్వాలు వుండిపోయాయి. ఆ తర్వాతైనా తీసుకున్న చర్యలు పెద్దగా ఏమీ లేవు. మొదటి దశలో కరోనా చాలామంది నిపుణులు ఊహించినంత తీవ్రంగా లేనందుకు కేంద్రం దాన్ని స్వీయ ఘనతగా భావించుకుంది. ఆ పని చేస్తే చేశారు... కనీసం దానికి సమాంతరంగా ప్రజారోగ్యరంగ ప్రక్షాళనకు ఏం చేయాలన్నదానిపై దృష్టి పెట్టాల్సింది. ఒక పెద్ద విపత్తు విరుచుకుపడినప్పుడు మన దగ్గరున్న ఆరోగ్య వ్యవస్థ ఎందుకూ పనికిరాదన్న నిజాన్ని సకాలంలో గ్రహించగలిగితే దేశానికెంతో మేలు జరిగేది. గోవా ఉదంతం మన దుస్థితిని కళ్లకు కట్టింది. అక్కడ గత వారం కేవలం మూడు రోజుల వ్యవధిలో ఆక్సిజన్ కొరత కారణంగా 75మంది రోగులు మరణించారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో అన్నీ ఆక్సిజన్ కొరతతో ముడిపడివున్నవి కాదని ప్రభుత్వం అంటున్నది.
నిజానికి మన దేశం మాత్రమే కాదు...అగ్రరాజ్యాలనుకున్న దేశాలు సైతం కరోనా మహమ్మారి తీవ్రతకు కళవళపడ్డాయి. ఎందుకంటే ఏ దేశంలోని వైద్య సిబ్బందికైనా ఈ పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. ఎన్నడో వందేళ్లక్రితం వచ్చిన మహమ్మారులు సృష్టించిన విలయం తాలూకు జ్ఞాపకాలు మానవాళి మస్తిష్కం నుంచి చెదరడం మొదలైంది. మధ్యలో అడపా దడపా వచ్చినవి ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యాయి తప్ప మహమ్మారుల రూపం తీసుకోలేదు. ఈ క్షణానికి సజావుగా ఊపిరి తీసుకుంటున్నట్టే కనబడిన రోగి, ఆ మరుక్షణంలోనే ఆక్సిజన్ కోసం తలకిందువలవడం వైద్య సిబ్బంది ఊహించని ఉత్పాతం. తెల్లకోట్లతో, ప్రశాంత చిత్తంతో కనబడే వైద్య సిబ్బంది పీపీఈ కిట్లలో వుండటం...వార్డులో ఏదో ఒక మూల రొప్పుతూ రోగులు కనబడటం, ఇంతలోనే ఆప్తుల్ని పోగొట్టుకున్నవారు అక్కడ చేసే రోదనలు ఇతర రోగుల్లో భయాందోళనలు కలిగిస్తూ వారిని సైతం ప్రమాదంలో పడేయటం నిత్యకృత్యమైంది. ఎంతో పకడ్బందీ ఆరోగ్య వ్యవస్థ వున్నదనుకునే అమెరికా సైతం అనేక నెలలపాటు దిక్కుతోచని స్థితిలో పడింది. ఇతర దేశాల మాటెలావున్నా నిరుటితో పోలిస్తే ఇప్పుడు మనం ఎంతో మెరుగ్గా వుండాలి. సమస్య తలెత్తిన వెంటనే ఏం చేయొచ్చు...ఏం చేయకూడదన్న అంశాల్లో అప్పటికన్నా మన అవగాహన పెరిగింది. రోగి పరిస్థితి ఎప్పుడెలా మారొచ్చునన్న విషయంలోనూ వైద్య సిబ్బంది తగిన అంచనాలతో వున్నారు. కానీ లేనిదల్లా పాలకులకే. గతంతో పోలిస్తే కరోనా పరీక్షల సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువైన మాట వాస్తవమే. ఇప్పుడు వ్యాక్సిన్‌లు కూడా అందుబాటులోకొచ్చాయి. అయినా ఈ వేగం చాలదు. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన జాడలు కనిపిస్తున్నా, అవి మళ్లీ పైపైకి పోవన్న గ్యారెంటీ ఏమీ లేదు. గ్రామీణ ప్రాంతాల పరిస్థితేమిటన్న విషయంలో ప్రభుత్వాలు మరింత కూలంకషంగా శోధించాల్సిన అవసరం వుంది. కరోనా మహమ్మారి గురించి సకాలంలో హెచ్చరించటంలో విఫలమై అది ఉగ్రరూపం దాల్చడానికి దోహదపడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా గుణపాఠాలు నేర్చిన దాఖలా లేదు. కరోనా తలెత్తి ఏడాదిన్నర దాటుతున్న ఈ తరుణంలో దీన్నుంచి సాధ్యమైనంత త్వరగా, కనిష్ట నష్టంతో బయటపడటానికి ఇంకేం చేయవచ్చునన్న విషయంపై కేంద్రం దృష్టి కేంద్రీకరించాలి.
క్షీణిస్తున్నట్టేనా!
Published Mon, May 17 2021 12:29 AM | Last Updated on Mon, May 17 2021 9:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment