దాదాపు నెల్లాళ్లనుంచి లాక్‌డౌన్‌లో వుంటున్న దేశం సోమవారం నుంచి కొన్ని సడలింపుల్ని చవిచూడటం మొదలుపెట్టింది. మే 3దాకా లాక్‌డౌన్ కొనసాగుతుందని... అయితే వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు సంబంధించి వెసులుబాట్లుంటాయని కేంద్ర ప్రభుత్వం ఇంతక్రితమే ప్రకటించింది. అదే సమయంలో రాష్ట్రాల్లో పరిస్థితుల్నిబట్టి అక్కడి ప్రభుత్వాలు దాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చునని చెప్పడంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటిచోట్ల పాత విధానమే అమల్లో వుంది. వెసులుబాట్లు అమల్లోకొచ్చిన రోజే ఒక్కసారిగా 1,553 కేసులు బయటపడటం ఆందోళన కలిగించే అంశమే అయినా... ఆ మహమ్మారి తీవ్రత తగ్గిందని మొత్తంగా గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ప్రతి 3.4 రోజులకు కరోనా కేసులు రెట్టింపవుతూ వస్తే, లాక్‌డౌన్ అనంతరం అలా రెట్టింపు అయ్యే వ్యవధి 7.5 రోజులకు పెరిగింది. ఇది జాతీయ సగటు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ వ్యవధి పరిమాణం ఇంకా ఎక్కువుంది.
అక్కడ ఆ వ్యవధి 10.6 రోజులు. లోతుకుపోయి చూస్తే రాష్ట్రాల్లో కూడా జిల్లాల మధ్య వ్యత్యాసం వుంది. ఇన్నాళ్లుగా బయటపడుతున్న కరోనా కేసుల్లో 46 శాతం కేవలం 18 జిల్లాలకు మాత్రమే పరిమితమై వున్నాయి. దేశంలోని 736 జిల్లాల్లో 325 జిల్లాలు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అధికమే. కారుచీకటిలో కాంతి రేఖలా ఇవన్నీ మనకు ఎంతో ఆశాజనకంగా అనిపిస్తాయి. అయితే కరోనా సోకినా, పరీక్ష చేస్తే తప్ప వెల్లడికాని వైనం మన దేశంలోనే ఎక్కువగా కనబడుతోంది. దాదాపు 80 శాతంమంది రోగుల్లో కరోనా లక్షణాలు పైకి కనబడటం లేదన్నది వైద్య నిపుణుల మాట. ఇది ఆందోళన కలిగించే అంశం. వ్యాధి వుందంటే వారిని వెంటనే చికిత్స కోసం తరలిస్తారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ క్వారంటైన్‌కు తరలిస్తారు.
కానీ వ్యాధిగ్రస్తుల్లో దాని లక్షణాలే కనబడని పరిస్థితి ఏర్పడితే ఎంత ప్రమాదమో వూహించడానికే భయం కలుగుతుంది. విస్తృతమైన పరీక్షలు నిర్వహిస్తే తప్ప పైకి లక్షణాలు కనబడని వారిని గుర్తించడం అసాధ్యం. నెలక్రితంనాటి పరిస్థితులతో పోలిస్తే మన దేశం కరోనా పరీక్షల విషయంలో ఎంతో మెరుగైంది. వివిధ రాష్ట్రాలు టెస్ట్ కిట్లు తెప్పిం చుకోవడం, పరీక్షలు నిర్వహించడం పెరిగింది. కనుక ఈ మాదిరి రోగుల్ని మరింత వేగంగా గుర్తించడం అసాధ్యమేమీ కాదు. ఏ లక్షణాలూ కనబడనివారిని ముందే గుర్తిస్తే, వారిలో లక్షణాలు బయటపడేలోగానే చికిత్స ప్రారంభించడం వీలవుతుంది. వారిద్వారా ఇతరులకు వ్యాపించకుండా చూడగలుగుతాం.
వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు సడలింపులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందిగానీ అదంత సులభం కాదు. వ్యవసాయానికి సంబంధించినంతవరకూ కొంత పర్వాలేదు. ఆ రంగంపై ఆధారపడేవారు గ్రామాల్లోనే వుంటారు గనుక ఒకచోటనుంచి మరోచోటకు వెళ్తారు. ప్రభుత్వాలు అనుమతిచ్చాయి గనుక, ఆ రంగానికి అవసరమైన హార్వెస్టర్లు దూరప్రాంతాల నుంచి రావడం కూడా అసాధ్యం కాదు. కానీ పారిశ్రామిక రంగం పరిస్థితి అలా కాదు. అందులో పనిచేసే కార్మికులు, ఇతర సిబ్బంది ఎక్కడెక్కడినుంచో వచ్చి పనిచేస్తుంటారు. ఒక్కసారిగా పరిశ్రమ మూతబడి, జీతాలు రాక, ఎలా బతకాలో తెలియక, కనీసం అద్దె చెల్లించే పరిస్థితి కూడా లేక అటువంటివారిలో చాలామంది స్వస్థలాలకు వెళ్లివుంటారు.
ఉన్నవారు కూడా తమ నివాసాల నుంచి ఫ్యాక్టరీలకు వెళ్లే అవకాశాలు లేవు. కేంద్రప్రభుత్వ సూచనతో లాక్‌డౌన్ కాలంలో జీతాలు చెల్లిద్దామనుకున్న సంస్థలు కూడా ఈ కారణంతోనే చాలామందికి ఇవ్వలేకపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థలు అన్నిచోట్లా నిలి చిపోయాయి. మహారాష్ట్ర ఇప్పుడు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటోంది. దేశంలోని చాలా నగరాల్లో ఎంతో కొంత నయం. కానీ ముంబైలో కార్మికులు పనిచేసే చోటుకు దగ్గరగా నివాసం వుండటం అసాధ్యం. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను యధాప్రకారం కఠినంగా కొనసాగిం చాలని కోరుకుంటూనే, పని ప్రారంభించడానికి అర్హత పొందిన కొన్ని పరిశ్రమల విషయంలో ఏం చేయాలో తెలియని స్థితిలో వుంది. కార్మికులు, ఇతరత్రా పనులు చేసుకునేవారు అధికంగా నివసించే ముంబైలోని ధారవిలో కరోనా తీవ్రత ఇంకా అధికంగానే వుంది.
లాక్‌డౌన్ స్థితి నుంచి మళ్లీ సాధారణ స్థితికి వెళ్లడం సాధారణ పౌరులకెంత కష్టమో, ప్రభుత్వాలకు కూడా అంతే కష్టం. ఈ–కామర్స్ సంస్థల వ్యాపారం విషయంలో లోగడ ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్రం సవరించిన తీరు దీన్నే తెలియజేస్తుంది. నిత్యావసరాలు కానివి ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వడం, తెప్పించుకోవడం కుదరదని సవరించిన మార్గదర్శకాలు చెబుతున్నాయి. నిత్యావస రాల దుకాణాలు, ఔషధ దుకాణాలు తప్ప మరేమీ తెరవడం కుదరదని ఒకపక్క చెబుతూ, ఆన్‌లైన్ వ్యాపారస్తులకు మినహాయింపు ఇవ్వడమేమిటన్న విమర్శలు రావడంతో ఈ సవరణ తప్పలేదు. అయిదురోజులక్రితం కేంద్రం అనుమతించాక ఆన్‌లైన్‌లో ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు తెప్పించుకోవడానికి వేలాదిమంది ఆర్డర్లిచ్చారు. ఈ–కామర్స్ సంస్థలు కూడా పంపడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి.
ఇదంతా ఇప్పుడు అర్ధాంతరంగా నిలిచిపోయింది. వ్యవసాయరంగానికి ఇలాంటి గందరగోళం ఏర్పడకుండా చూడాలి. చాన్నాళ్ల తర్వాత మన దేశంలో ఈసారి పంటలు బాగా పండాయి. కోతల సమయానికి లాక్‌డౌన్ వచ్చిపడింది. ఇప్పుడు సడలింపులు వచ్చాయి గనుక దిగుబడులు సాఫీగా కొనుగోలు కేంద్రాలకు తరలే ఏర్పాట్లు చేయాలి. ఆ కేంద్రాలను వికేంద్రీక రించడంతోపాటు, ఎవరు ఏ సమయంలో రావాలో సూచిస్తూ రైతులకు కూపన్లు ఇవ్వాలి. ఇందువల్ల ఎక్కువమంది గుమిగూడే ప్రమాదం తప్పుతుంది. భౌతిక దూరం పాటించడంలో సమస్యలు తలె త్తవు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే కరోనా మహమ్మారిని తరిమికొట్టడం సులభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment