ఇప్పటికైనా మేల్కొనాలి  | Sakshi Editorial On Corona Second Wave In India | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా మేల్కొనాలి 

Published Mon, Apr 19 2021 12:56 AM | Last Updated on Mon, Apr 19 2021 12:57 AM

Sakshi Editorial On Corona Second Wave In India

సంక్షోభ సమయాలు నాయకత్వ పటిమకు పరీక్షలు. వాటి రాకను అంచనా వేయటంలో... నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవటంలో... ఎదుర్కొనక తప్పని స్థితి ఏర్పడే పక్షంలో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటంలో చొరవ చూపినవారే నాయకులనిపించుకుంటారు. నిరుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడినప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజారోగ్య రంగం ఎన్ని వైఫల్యాలు చవిచూసిందో, జనం ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్లముందే వుంది. కానీ ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు కరోనా రెండో దశ విరుచుకుపడుతున్న వేళ మళ్లీ అవే వైఫల్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. కరోనా మరణాల్లో 86 శాతం కేవలం పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. తొలి అయిదుస్థానాలూ మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లవే. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితరచోట్ల ఆసుపత్రులు దాదాపు చేతులెత్తేశాయి. రోగులకు అవసరమైన బెడ్‌లు, ఇతర సదుపాయాలు సమకూర్చలేక అవస్థలు పడుతున్నాయి. ఢిల్లీలో ప్రముఖ ఆసుపత్రుల్లో బెడ్‌లు ఖాళీ లేవు. సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి, లోక్‌నాయక్‌ ఆసుపత్రి, జీటీబీ, రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ, దీన్‌దయాళ్‌ వగైరాలన్నీ పూర్తిగా నిండిపోగా, ఎయిమ్స్‌లో కేవలం నాలుగంటే నాలుగే మిగిలాయి. ఇవన్నీ ఆదివారం ఉదయం లెక్కలు. మహారాష్ట్ర తర్వాత 1,50.676 కరోనా కేసులతో దేశంలోనే రెండో స్థానంలో వున్న ఉత్తరప్రదేశ్‌ ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలింది. మౌలిక వైద్య సదుపాయాలు లేక లక్నోలోని ఆసుపత్రులు విలవిల్లాడుతున్నాయి. ఆ నగరంలో ఎక్కడా ఐసీయూ సదుపాయం, వెంటిలేటర్‌లు లేవని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రతి బెడ్‌కూ 50మంది రోగులు వెయిటింగ్‌లో వున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీన్ని గమనించి సోమవారంనాటికల్లా దాదాపు 3,000 బెడ్లు సిద్ధం చేస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. కానీ రోజుకు 5,000 కొత్త కేసులు నమోదవుతున్న వర్తమానంలో ఇవి ఏమూలకు? కరోనా రోగులను చేర్చుకోవటానికి నిరాకరించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు గానీ, అదెంతవరకూ ఫలితమిస్తుందో చెప్పలేం. కాస్త హెచ్చుతగ్గులతో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి వుంది. ఆసుపత్రులను పెంచుకోవటంలో, తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించుకోవటంలో, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవటంలో ఎక్కడ చూసినా వైఫల్యాలే దర్శనమిస్తున్నాయి. కనీసం కరోనా పరీక్ష కేంద్రాల సంఖ్య పెంచటంలోనూ ఇదే నిర్లక్ష్యం కనబడుతోంది.

ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు పెరగటానికి కారణమని గత కొన్ని రోజులుగా విమర్శలొస్తున్న కుంభమేళా ఇక లాంఛనప్రాయం చేయమని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రధాన అఖాడాలు అంగీకరించటం ఉన్నంతలో మెరుగనే చెప్పాలి. ఇదింకా ముందు జరిగివుంటే బాగుండేది. ఈ నెల 1న ప్రారంభమైన కుంభమేళా 27న షాహీ స్నాన్‌తో ముగుస్తుంది. వాస్తవానికి ఈ నెల మొదటికల్లా దేశంలో కరోనా ఉగ్రరూపందాల్చటం మొదలైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని ఆ సమయంలోనే అప్రమత్తం చేసింది. కుంభమేళాలో వైరస్‌ వ్యాపించే ప్రమాదం వున్నదని తెలిపింది. కోవిడ్‌ నిబంధనలు కఠినంగా పాటిస్తున్నామని, కరోనా నెగెటివ్‌ రిపోర్టు వున్నవారినే అనుమతిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. అది ఎంతవరకూ అమలైందో అనుమానమే. కొత్తగా బయటపడుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ముందే సాధుసంతులకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసివుంటే, ప్రస్తుత పరిస్థితి చెప్పివుంటే తగిన పరిమితులు విధించుకునేవారు. కుంభమేళాకు వెళ్లొచ్చినవారికి కోవిడ్‌ పరీక్షలు చేయడం ఇప్పుడు అన్ని రాష్ట్రాల కర్తవ్యం. నిజానికి కుంభమేళా ఒక్కటే కాదు...దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కూడా కరోనా వ్యాప్తికి కారణమే. ఒకపక్క పాశ్చాత్య దేశాల్లో రెండో దశ కరోనా విరుచుకుపడుతున్న వైనం చూస్తూ కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనలేదు. పౌరులను తగినవిధంగా అప్రమత్తం చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ దశలో పెట్టకపోవటం ఉత్తమమని ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) మొదలుకొని ఎవరూ వినిపించుకోలేదు. ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ ఏం చెబితే అదే ఆఖరి మాటని నిబంధనలు వల్లించారు. చివరికి ఈ కరోనావల్ల తలెత్తిన పరిస్థితిని దృష్టిలో వుంచుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ప్రచారానికి సైతం దూరంగా వున్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎందరు నాయకులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు?

ఏడెనిమిది నెలల వ్యవధి చిక్కినా వైద్య రంగ సదుపాయాలు మెరుగుపరుచుకోవటంలో  ప్రభుత్వాలు విఫలమయ్యాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కనీసం ఆక్సిజన్‌ ఉత్పత్తిని, దాని స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకోవటంలో శ్రద్ధ పెట్టలేదు. ఈ లోటు చాలాచోట్ల కనిపిస్తోంది.  ఆసుపత్రులు పెంచుకోవాలని, ఆక్సిజెన్‌ అందుబాటులో వుండేలా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్‌ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న పది రాష్ట్రాలకు ఇప్పుడు చెబుతున్నారు. కనీసం ముప్పు ముంచుకొచ్చిన ఈ సమయంలోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. తక్షణ కార్యాచరణకు దిగాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement