ఢిల్లీ/బెంగళూరు, సాక్షి: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికే 4 వేలు దాటేసింది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. కొత్త వేరియెంట్ జేఎన్.1 మూలంగానే అధిక కేసులు నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పంజా విసురుతోంది.
మరోవైపు కర్ణాటకలో కొత్త వేరియెంట్ కేసులు వెలుగు చూశాయి. మంగళవారం ఉదయం అక్కడి ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఒక్క బెంగళూరులోనే 20 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఈ వేరియెంట్ ధాటికి.. కర్ణాటక వ్యాప్తంగా ముగ్గురు మరణించారు. బెంగళూరులో ఇద్దరు, రామనగర జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడి మరణించారు. అయితే వాళ్ల వయసులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మరణాలకు కారణమా? అనేదానిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు కొత్త కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో.. కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది.
►వేగవంతమైన సాంక్రమణ సామర్థ్యమున్న కరోనా జేఎన్1 రకం వ్యాప్తి అధికమవుతోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం.. కేవలం జేఎన్.1 కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒక్క గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి.
►తమిళనాడులో నాలుగు, తెలంగాణలో రెండు కొత్త వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. అన్ని వేరియంట్లు కలుపుకుని గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా సోమవారం మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరినట్లు కేంద్రం తెలిపింది.
►తెలంగాణలో సోమవారంనాటికి 10 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒకరు వైరస్ బారిన నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 55కి చేరింది. మరోవైపు ఏపీలోనూ యాక్టివ్ కేసుల సంఖ్య 24కి చేరింది. కొత్త వేరియంట్‌గా వ్యాప్తి చెందుతున్న జేఎన్.1 ఉపరకం కేసుల భయం తెలుగు రాష్ట్రాలను పట్టుకుంది. ఇప్పటికే నమోదు అయిన కేసుల శాంపిల్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు.. ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశారు.
►జేఎన్.1 అంత ప్రమాదకరమైందేం కాదని మొదటి నుంచి వైద్య నిపుణులు, ఆఖరికి డబ్ల్యూహెచ్‌వో కూడా చెప్పింది. అయితే వైరస్ తేలికపాటిదే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జాగ్రత్తలు చెబుతూ వస్తోంది. తాజాగా కొత్త వేరియెంట్ కేసుల విజృంభణ నేపథ్యంలో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment