
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మరోసారి భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన రేకేత్తిస్తోంది.
గడిచిన 24 గంటల్లో 761 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క రోజులోనే 12 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది.
అత్యధికంగా కేరళలో 1,249 యాక్టివ్ కేసులు ఉండగా కర్ణాటక 1,240, మహారాష్ట్ర 914, తమిళనాడు 190, చత్తీస్‌గఢ్- ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్‌తో మరణించిన వారిలో కేరళలో అయిదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరు ఉన్నారు.
కాగా గతేడాది తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా డిసెంబర్ నుంచి పెరుగుతూ వస్తోంది. డిసెంబర్ 5 వరకు వందలోపు నమోదైన కేసులు.. తర్వాత కొత్త వేరియంట్ వెలుగుచూడంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020లో కరోనా తొలిసారి బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 5.3లక్షల మంది ప్రాణాలు కోల్పాయారు. 4.4 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇక 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment