ఫేక్ కాల్ సెంటర్ల ద్వారా ఆన్లైన్ చోరీలు..
ఇన్సూరెన్స్ ఏజెంట్లు, టెలికాలర్ల వద్దనుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే జర జాగ్రత్త! దొంగల ముఠాలు రోజురోజుకూ హైటెక్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. సిమ్ కార్డులనుంచి, బ్యాంకు ఖాతాల దాకా అంతా నకిలీ రాజ్యం ఏర్పాటు చేసుకుంటున్న ముఠాలు... ఇప్పుడు ఏకంగా నకిలీ డాక్యుమెంట్లతో ఫేక్ కాల్ సెంటర్లను, ఆన్ లైన్ బిజినెస్ హౌస్ లనే తెరిచేస్తున్నారు. తాజాగా భారత రాజధాని ఢిల్లీ కేంద్రంగా లెక్కల్లో నేర్పును ప్రదర్శిస్తూ కోట్లను కొల్లగొట్టేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నదొంగల ముఠాలు ఓ ప్రీమియం ధర వద్ద అక్రమ లాజిస్టిక్స్ అందిస్తూ వ్యాపారాన్ని హాయిగా కొనసాగించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు వంద వరకూ నకిలీ కాల్ సెంటర్లు, బిజినెస్ హౌస్ లు భారత దేశం అంతటా వ్యాపించి, ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది. మార్కెటింగ్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని, నకిలీ కంపెనీలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు చేసేందుకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ప్రీమియం కమిషన్ వసూలు చేస్తున్నారని UP STF అదనపు సూపరింటిండెంట్ త్రివేణి సింగ్ చెప్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులతోపాటు, UP STF బృదం స్థానిక కృష్ణానగర్, నోయిడాల్లో ఉన్న రెండు కార్యాలయాలపై దాడులు నిర్వహించి సుమారు వందమందిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ మొత్తం పదకొండు కంపెనీలను నిర్వహిస్తూ.. దేశంలో అనేకమంది ఏజెంట్ల ద్వారా జనానికి వారి ఇన్సూరెన్స్ పాలసీలపై అధిక బోనస్ ఆశ చూపి ఎరవేస్తున్నట్లు తెలిసింది.
నకిలీ ఇన్సూరెన్స్ కాల్ సెంటర్లలో వినియోగిస్తున్న సుమారు 50 సిమ్ కార్డులు, ఫేక్ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బిజినెస్ హౌస్ ల ద్వారా కస్టమర్ల డేటాను సేకరించి 35 పైసలు మొదలు, ఐదు రూపాయల వరకూ అమ్మకాలు కూడ జరుపుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అలాగే పోలీసులకు తెలియకుండా ఉండేట్టు నకిలీ గుర్తింపు కార్డులతో ఉన్న సిమ్ లను ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు. ఈ సిమ్ కార్డులను డూప్ కస్టమర్లకు కాల్ చేసేందుకు వినియోగిస్తున్నారని, టెలికాం కంపెనీ ఉద్యోగుల సహాయంతో వారం రోజుల వ్యవధిని తీసుకొని నకిలీ డాక్యుమెంట్లతో ఫోన్ కాల్స్ కూడ అందుబాటులోకి తెస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. అలాగే నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంక్ ఖాతాలను కూడ తెరిపించి 15 శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటువంటి ముఠాలు ఎవరికీ అనుమానం రాకుండా అందమైన ఖరీదైన ఇళ్ళలో తమ కార్యాలయాలను స్థాపించి జోరుగా దందా కొనిసాగిస్తున్నారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా కేవలం మూడు నాలుగు నెలల లోపే అక్కడినుంచి దుకాణం ఎత్తేస్తున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా వేలమందిని మోసగించి పదికోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మనీకేర్ వ్యాల్యూ ప్రైవేట్ లిమిటిడె పేరున జనకపురిలో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఈ ముఠా.. కాల్ సెంటర్ ను మాత్రం హరినగర్ లో కొనసాగిస్తున్నారని, ఈ సంస్థలో సుమారు 70 నుంచి 80 మంది ఉద్యోగులు టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. సో ప్రస్తుత తరుణంలో డబ్బు ఎరవేసే ఏజెంట్లకు లొంగిపోకుండా జర జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.