దివ్యమైన రికార్డు | Sakshi Editorial On Paralympics Record Of Indians | Sakshi
Sakshi News home page

దివ్యమైన రికార్డు

Published Tue, Sep 10 2024 12:09 AM | Last Updated on Tue, Sep 10 2024 12:09 AM

Sakshi Editorial On Paralympics Record Of Indians

పది రోజుల క్రీడా సంరంభానికి తెర పడింది. ప్యారిస్‌లో వేసవి ఒలింపిక్స్‌ ముగిసిన వెంటనే కొద్ది రోజులకే ఆరంభమైన పారాలింపిక్స్‌ ఆదివారం పూర్తయ్యేసరికి భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సాధించి సత్తా చాటింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన పతకాలను కూడా సాధించి ఉంటే, ఈ స్కోర్‌ 30 దాటిపోయేది. సాధారణ ఒలింపిక్స్‌లో ఇప్పటికీ రెండంకెల స్కోరును సాధించలేకపోయిన మన దేశం, దివ్యాంగులైన క్రీడాకారులతో సాగే పారాలింపిక్స్‌లో మాత్రం వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించడం విశేషం. 

త్రుటిలో తప్పిన పతకాలతో ఈ ఏటి ప్యారిస్‌ సాధారణ ఒలింపిక్స్‌ మిశ్రమ ఫలితాలు అందిస్తే, ఈ పారాలింపిక్స్‌ మాత్రం మరిన్ని పతకాలతో ఉత్సాహం పెంచాయి. పైగా, ఆ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ క్రీడా మహోత్సవంలో అయిదు రెట్లు ఎక్కువ పతకాలు సాధించడం గమనార్హం. మొత్తం 549 పతకాలకు జరిగే ఈ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 అంశాల్లోనే పాల్గొన్న మన బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్‌ 20లో నిలవడం చిరస్మరణీయం.

మూడేళ్ళ క్రితం 2021 టోక్యో పారాలింపిక్స్‌లో మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు అంతకన్నా మరో 10 ఎక్కువ సాధించి, సంచలనం రేపాం. నిజానికి, 1972లో మురళీకాంత్‌ పేట్కర్‌ భారత్‌ పక్షాన తొట్టతొలి పారాలింపిక్‌ పతక విజేత. 1984లో మాలతీ కృష్ణమూర్తి హొల్లా భారత్‌ పక్షాన తొలి మహిళా పారాలింపియన్‌. అయితే, 2016 వరకు మన మహిళలెవ్వరూ పతకాలు సాధించలేదు. 

అప్పటి నుంచి పారాలింపిక్స్‌లో భారత్‌ పక్షాన కేవలం ముగ్గురంటే ముగ్గురు మహిళలే (దీపా మాలిక్‌ – 2016లో రజతం, అవనీ లేఖరా – 2020లో స్వర్ణం – కాంస్యం, భావినా పటేల్‌ – 2020లో రజతం) విజేతలుగా నిలిచారు. అలాంటిది ఈసారి భారత్‌ పక్షాన పతకాలు సాధించినవారిలో 10 మంది మహిళలే. తాజాగా 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్‌ స్వర్ణాలు గెలిచిన అవని మినహా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్‌లో ఇది అసాధారణ విజయం. 

ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారి కథ మనసుకు హత్తుకుంటుంది. దివ్యాంగురాలైన ఆమె ఆటల్లో పైకి వచ్చి, పతకాల కల నెరవేర్చేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వరంగల్‌లోని తమ భూమి కూడా అమ్మేశారు. 

దీప్తి తాజా పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. ఇలాంటి కథలు ఇంకా అనేకం. ఇక, పేరున్న క్రీడా తారలైన జావలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ ఆంటిల్, హైజంపర్‌ మారియప్పన్‌ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. పతకాలు సాధించడమే కాక, పలువురు భారతీయ అథ్లెట్లు సరికొత్త మైలురాళ్ళను చేరుకొని, చరిత్ర సృష్టించడం గమనార్హం. 

క్రీడాసంఘాలను రాజకీయ పునారావాస కేంద్రాలుగా మార్చి, వాటిని అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు నెలవుగా మారిస్తే జరిగే అనర్థాలు అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. రెజ్లింగ్‌ సంఘం లాంటి చోట్ల గత రెండేళ్ళలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటివాటి వల్ల ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు పోగొట్టుకున్నాం. పారాలింపిక్స్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చూపగలిగామంటే ఆ జాడ్యాలు ఇక్కడ దాకా పాకలేదని సంతోషించాలి. 

కేంద్రం, కార్పొరేట్‌ సంస్థలు అందించిన తోడ్పాటు ఈ దివ్యాంగ క్రీడాకారులకు ఊతమైందని విశ్లేషకుల మాట. గడచిన టోక్యో గేమ్స్‌కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్‌లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్‌లతో తీర్చిదిద్దడం ఫలితాలిచ్చింది. 

వివిధ దేశాల నుంచి దాదాపు 4400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం, రోజూ ఈ జీవన విజేతల విన్యాసాలు చూసేందుకు స్టేడియమ్‌ నిండుగా జనం తరలిరావడం చెప్పుకోదగ్గ విషయం. 

మరి, చెదరని పోరాటపటిమతో శారీరక, సామాజిక అవరోధాలన్నిటినీ అధిగమిస్తున్న దివ్యాంగులకు మన దేశంలో పాలకులు చేయవలసినంత చేస్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ‘దివ్యాంగుల హక్కుల చట్టం– 2016’ లాంటివి ఉన్నా, ఇవాళ్టికీ మనదేశంలో మహానగరాల్లో సైతం పాఠశాలల్లో, ప్రయాణ సాధనాల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వారికి కావాల్సిన కనీస వసతులు మృగ్యం. 

అయిదేళ్ళలో ఆ పని చేయాలని చట్టపరమైన సంకల్పం చెప్పుకున్నా, ఆచరణలో జరిగింది అతి తక్కువన్నది నిష్ఠురసత్యం. చివరకు చట్టం కింద చేపట్టాల్సిన పథకాలకూ కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెట్టడం విషాదం. ఈ పరిస్థితి మారాలి. సమాజంలోనూ, సర్కార్‌పరంగానూ ఆలోచన తీరూ మారాలి. ఆ రకమైన ప్రోత్సాహంతో దివ్యాంగులు మరింత పురోగమించ గలరు. 

తాజా విజయాల రీత్యా మనవాళ్ళకు మరింత అండగా నిలిస్తే, విశ్వవేదికపై వారు భారత ఖ్యాతిని ఇనుమడింపజేయగలరు. అలా చూసినప్పుడు ప్యారిస్‌ పారాలింపిక్స్‌ విజయాలు ఆరంభం మాత్రమే. వచ్చే 2028 నాటి లాస్‌ ఏంజెల్స్‌ గేమ్స్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పారా అథ్లెట్స్‌ ప్రతిభ తోడై ఇదే దూకుడు కొనసాగిస్తే అద్భుతాలూ జరుగుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement