ప్రజాభీష్టానికి పాతర | Sakshi Editorial On France Politics | Sakshi
Sakshi News home page

ప్రజాభీష్టానికి పాతర

Published Wed, Sep 11 2024 12:00 AM | Last Updated on Wed, Sep 11 2024 7:49 AM

Sakshi Editorial On France Politics

వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్‌లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్‌ రిపబ్లికన్స్‌ పార్టీ నేత మిషెల్‌ బార్నియెర్‌ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్‌ 9న పార్లమెంట్‌ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్‌ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. 

ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్‌లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. 

నిజానికి, ఫ్రాన్స్‌లో జూలైలో రెండో విడత పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్‌ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్‌కు చెందిన ‘రినైజెన్స్‌ బ్లాక్‌’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్‌ ఫ్రంట్‌’ (ఎన్‌ఎఫ్‌పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్‌ఎఫ్‌పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్‌ కథ నడిపారు. 

పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్‌కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. 

ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్‌ మెక్రాన్‌ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. 

ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్‌ సహా యూరప్‌ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్‌ కింగ్‌ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. 

అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్‌ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్‌ యూనియన్‌ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్‌ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్‌ సమర్థిస్తున్నారు. 

అది కన్జర్వేటివ్‌లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్‌ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్‌ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్‌లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్‌ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. 

వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్‌ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్‌ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్‌ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్‌ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్‌ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. 

ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్‌ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement