అంతర్జాతీయ వ్యవహారాల్లో సొంత గొంతు వినిపించటంలో సారూప్యత కలిగివుండే భారత్–ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక చెలిమి ఏర్పడి ఇరవై అయిదు వసంతాలు పూర్తయిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ గడ్డపై అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో శుక్రవారం ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించే బాస్టిల్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నావికా దళ అవసరాల కోసం ఉద్దేశించిన 26 రాఫెల్ జెట్ ఫైటర్లు, మూడు స్కార్పీన్ రకం జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలవుతున్నాయి. రక్షణ రంగంలో సహకరిస్తున్న ఫ్రాన్స్ ఈ ఒప్పందాలతో రష్యా తర్వాత మనకు ఆయుధాలు విక్రయించే రెండో పెద్ద సరఫరాదారు కాబోతోంది. ఇప్పటికే మనం ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ జెట్ విమానాలు, ఆరు స్కార్పీన్ రకం జలాంతర్గాములు కొనుగోలు చేశాం.
ఇరు దేశాలమధ్యా సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్‌ను చేజిక్కించుకొనేందుకు నాటి జర్మనీ చేసిన ప్రయత్నాలను డన్‌కిర్క్ పట్టణంలో వమ్ము చేసింది మన దేశానికి చెందిన పంజాబ్ రెజిమెంట్ జవాన్లే. ఆ విజయానికి గుర్తుగా అప్పట్లో పారిస్ వీధుల్లో మన జవాన్లు కవాతు కూడా జరిపారు. దాన్ని గుర్తుచేసుకుంటూ శుక్రవారం బాస్టిల్ డే సందర్భంగా అదే రెజిమెంట్‌కు చెందిన మన సైనికులు 107 ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం కవాతు చేశారు.
మనకు స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సైతం ఫ్రాన్స్‌తో సాన్నిహిత్యాన్ని కోరుకున్నారు. 1950 తర్వాతనుంచీ రెండు దేశాల మధ్యా అణు, అంతరిక్ష రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిన గత 25 సంవత్సరాలుగా భారత్–ఫ్రాన్స్ చెలిమి ఎన్నో సంక్లిష్ట సందర్భాలను తట్టుకుని నిలబడింది. 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో మన దేశం పోఖ్రాన్‌లో అణ్వస్త్ర పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికాతో సహా అగ్ర రాజ్యాలు తీవ్ర విమర్శలకు దిగాయి. కానీ ఆ సమయంలో ఫ్రాన్స్ అన్నివిధాలా అండగా నిలబడింది. యూరోప్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సులో భారత్‌ను అభిశంసిస్తూ, దానిపై ఆంక్షలకు పిలుపునిస్తూ బ్రిటన్ తీర్మానం ప్రతిపాదించబోయినప్పుడు వీటో చేస్తానని హెచ్చరించి ఆ ప్రయత్నాన్ని నిలువరించింది ఫ్రాన్సే.
చదవండి: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు
రెండు దేశాల విదేశాంగ విధానంలో ఎన్నో పోలికలు కూడా ఉన్నాయి. అమెరికాతో సఖ్యంగా మెలగుతూనే ఏదోమేరకు స్వతంత్రతను పాటించటం భారత్, ఫ్రాన్స్‌లు మొదటినుంచీ అనుసరిస్తున్న విధానం. అమెరికా బద్ధశత్రువులైన ఇరాన్, రష్యాలతో సాన్నిహిత్యం నెరపడంలోనూ ఇద్దరిదీ ఒకే ఆలోచన. ఏకధ్రువ ప్రపంచం ఏర్పడాలని, అది కూడా తన నాయకత్వంలోనే ఉండాలని తహతహలాడే అమెరికా వైఖరికి భిన్నంగా ఏ ఒక్కరి ఆధిపత్యమో ఉండటం చేటు తెస్తుందని భావించటంలోనూ భారత్, ఫ్రాన్స్‌లమధ్య పోలిక ఉంది. ఎవరిపైనా సంపూర్ణంగా ఆధారపడే ధోరణి సరికాదని, ఏ దేశానికైనా స్వాలంబన సాధించటం అవసరమని గుర్తించటంలోనూ ఇద్దరూ ఇద్దరే.
బహుశా అందువల్లే కావొచ్చు... పరస్పరం సహకరించుకోవటం ద్వారా భిన్న రంగాల్లో ఎదగటానికి రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. వ్యూహాత్మక చెలిమిలో ముందడుగు వేస్తున్నాయి. అమెరికా మనతో సఖ్యంగా ఉంటున్నా ఆ చెలిమికి ఎప్పుడూ పరిమితులుంటున్నాయి. ఆ దేశంతో మనం కుదుర్చుకునే రక్షణ ఒప్పందాలకు ఎన్నో అవరోధాలుంటాయి. అక్కడి కాంగ్రెస్ వాటిని ఆమోదించాలి. రక్షణ పరికరాలకు సంబంధించి అమల్లోవుండే ఎగుమతుల నియంత్రణ వ్యవస్థలను దాటాలి. ఈ క్రమంలో ఎక్కడైనా ఆగిపోవచ్చు. లేదా జాప్యం చోటుచేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్షణ కొనుగోళ్లకు అంగీకరించినా, సాంకేతికత బదిలీ సాధ్యపడదు.
ఉదాహరణకు మన తేలిక రకం యుద్ధ విమానం తేజస్‌కు జీఈ ఎఫ్ 414 ఇంజిన్ అమర్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాని సాంకేతికత బదిలీకి మాత్రం అంగీకరించలేదు. ఫ్రాన్స్‌తో ఈ పేచీ లేదు. దానితో కుదుర్చుకునే ఒప్పందాలకు అవాంతరాలుండవు. సాంకేతికత బదిలీకి అభ్యంతరాలుండవు. జీఈ ఎఫ్ 414 ఇంజిన్ మాదిరే పనిచేసే ఫ్రాన్స్ సఫ్రాన్ ఇంజిన్‌ను ఇక్కడే ఉత్పత్తి చేయడానికి ఆ దేశం అంగీకరించింది. సాంకేతికత బదిలీ చేయటం వల్ల కేవలం రక్షణ ఉత్పత్తులు విక్రయించే దేశమే కాక, కొనుగోలు చేస్తున్న దేశం కూడా లబ్ధిపొందటానికి అవకాశముంటుంది.
రెండు దేశాలూ పర్యావరణ రంగంలో కూడా పరస్పరం సహకరించుకోవటానికి ఇప్పటికే నిర్ణయించాయి. నిరుడు అక్టోబర్‌లో గ్రీన్ హైడ్రోజన్‌పై ఒప్పందం కుదుర్చుకుని, పరస్పర భాగస్వామ్యంతో ప్రపంచానికి విశ్వసనీయమైన, స్థిరమైన హరిత ఇంధనాన్ని అందించే దిశగా ఇరు దేశాలూ అడుగులు వేస్తున్నాయి. ఇంకా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీ, 6జీ తదితర అంశాల్లో సమష్టిగా పనిచేస్తున్నాయి. క్వాడ్, జీ 20 తదితర వేదికల్లో ఒకే గళం వినిపిస్తున్నాయి.
అలాగని విభేదాలు లేకపోలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఉక్రెయిన్‌కు గట్టి మద్దతుదారుగా నిలబడింది. ఆయుధాలు సరఫరా చేస్తోంది. మన దేశం మాత్రం దురాక్రమణ ఆపాలని రష్యాను కోరడం మినహా అమెరికా, ఈయూ దేశాల తరహాలో రష్యా వైఖరిని ఖండించటంలేదు. అలాగే చైనా విషయంలోనూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ భిన్న వైఖరితో ఉన్నారు. విభేదించుకునే అంశాల్లో అవతలి పక్షం అవగాహన తెలుసుకోవటం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయటంలోనే దౌత్య నైపుణ్యం వెల్లడవుతుంది. చిరకాల మిత్ర దేశమైన ఫ్రాన్స్ మోదీ పర్యటన తర్వాత మనకు మరింత సన్నిహితమవుతుందని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment