అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆదివారం రెండో రౌండ్ ఎన్నికల్లో వోటర్లు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ఫ్రాన్స్‌లో సందిగ్ధత నెలకొంది. తొలి రౌండులో స్పష్టంగా మితవాదం వైపు మొగ్గినట్టు కనిపించిన వోటర్లు హఠాత్తుగా దారి మార్చి ఇతర పక్షాలను తలకెత్తుకున్న వైనం బహుశా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. 577 మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు రావాలి. కానీ తాజా ఫలితాల తర్వాత వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ 182 (తొలి రౌండ్‌లో రెండో స్థానం) సీట్లతో అగ్రభాగాన ఉండగా అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్‌కు చెందిన ఎన్‌సెంబుల్‌కు 168 (తొలి రౌండ్‌లో మూడోస్థానం) వచ్చాయి.
తొలి రౌండ్‌లో 32 శాతం వోట్లు సాధించుకుని అధికార పీఠానికి చేరువగా వెళ్లినట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్‌ఎన్) రెండో రౌండ్‌లో సీట్లపరంగా 143తో మూడో స్థానానికి పరిమితమైంది. ఆర్‌ఎన్ పార్టీ తొలి రౌండ్‌లో అగ్రభాగాన ఉండటంతో ఇతర పక్షాల వోటర్లు అప్రమత్తమయ్యారు. మితవాద పక్షానికి పాలనాపగ్గాలు దక్కనీయరాదన్న కృతనిశ్చయంతో అటు మధ్యేవాద పక్షానికీ, ఇటు వామపక్షానికీ వోటేశారు. తొలి దశలో 65 శాతం, రెండో దశలో 63 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
1981 తర్వాత ఈ స్థాయి వోటింగ్ ఎప్పుడూ లేదు. ఆర్‌ఎన్ గెలుపు ఖాయమని తేలినచోట్ల వామపక్ష కూటమి, మధ్యేవాద కూటమి అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి ముఖాముఖి పోటీకి మార్గం సుగమం చేశారు. కనీసం 200 స్థానాల్లో బహుముఖ పోటీ బెడద తప్పింది. దీని ప్రభావం ఎంతగా ఉందంటే... ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతం లా సార్ద్‌లోని అయిదు స్థానాల్లో ఆర్‌ఎన్ తొలి రౌండ్‌లో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. తీరా ముఖాముఖి పోటీలో ఆ పార్టీకి ఒక్కటీ దక్కలేదు.
రాజకీయ అస్థిరత ఫ్రాన్స్‌కు కొత్తగాదు. 1946–’58 మధ్య పన్నెండేళ్లలో ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. అయితే అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ప్రచ్ఛన్న యుద్ధ దశ మొదలైన తొలినాళ్ల కాలం. భవిష్యత్తులో మరెప్పుడూ దేశం సంకీర్ణాల జోలికి పోకుండా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పటికీ అదే అమల్లోవుంది. ఎన్నికల్లో భిన్నపక్షాలు కూటమిగా పోటీ చేయటం, నెగ్గితే కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయటం ఫ్రాన్స్‌లో సాధారణమే. కానీ కూటమిలో అధిక స్థానాలొచ్చిన పార్టీయే తన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి భిన్నమైనది.
ఒక పార్టీగా అత్యధిక స్థానాలు గెల్చుకున్నది ఆర్‌ఎన్ ఒక్కటే. చిత్రమేమంటే అటు ఆర్‌ఎన్‌లోనూ, ఇటు న్యూ పాపులర్ ఫ్రంట్‌లోనూ మేక్రాన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయలేని స్థితిలో పాలనలో పాలుపంచుకోవటం వృథా అని ఇరుపక్షాల నేతలూ భావిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రజల్లో మేక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పార్టీతో కలిస్తే ఆ చీడ తమకూ అంటుతుందన్న భయాందోళనలు ఇరుపక్షాల్లోనూ ఉన్నాయి. అందుకే విస్తృత మధ్యేవాద కూటమిని ఏర్పాటు చేయాలన్న మేక్రాన్ ప్రయత్నం ఫలించకపోవచ్చన్నది విశ్లేషకుల మాట.
ఈనెల 26న ప్యారిస్ ప్రధాన వేదికగా ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ ఘట్టం ప్రారంభం కాబోతోంది. 16 నగరాల్లో ఆగస్టు 11 వరకూ వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. ఈ దశలో దేశంలో రాజకీయ అస్థిరత అలుముకుంటే ఎలాగన్న ఆందోళన అన్ని పక్షాల్లోనూ ఉంది. తమ కూటమికి అత్యధిక స్థానాలొచ్చాయి గనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వామపక్ష అన్‌బౌడ్ నేత జీన్ లక్ మెలింకోన్ కోరుతున్నారు. మితవాద ఆర్‌ఎన్ పార్టీని రానీయకూడదన్న పట్టుదలతో సోషలిస్టులు, వివిధ వామపక్షాలూ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి తప్ప వాటి మధ్య లుకలుకలు తక్కువేమీ కాదు.
అన్‌బౌడ్ పార్టీ భావసారూప్య పక్షాలన్నిటినీ ఒక గొడుగు కిందకు తెచ్చిందన్న మాటేగానీ ఆ పార్టీకి తలొగ్గి ఇతర పక్షాలు పనిచేస్తాయా అన్నది సందేహమే. సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లకతప్పదు. అదే జరిగితే వామపక్ష కూటమికి ఇప్పుడు దక్కిన ఆదరణ ఆవిరయ్యే ప్రమాదం, ఆర్‌ఎన్ మరింత పుంజుకునే అవకాశం ఉంటాయి. మెలింకోన్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయన దుందుడుకు విధానాలు ఇంటా బయటా సమస్యాత్మకం కావొచ్చని, ముఖ్యంగా యూరప్ యూనియన్ (ఈయూ)తో పేచీలు తేవచ్చునని భయాందోళనలున్నాయి. ఈయూలో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌దే.
నాజీల దురాక్రమణతో సంక్షోభాన్నెదుర్కొన్న ఫ్రాన్స్‌లో మితవాదపక్షానికి ఆది నుంచీ ఆదరణ లేదు. కానీ ఆర్‌ఎన్ అధినేత మెరిన్ లీ పెన్ తెలివిగా జాత్యహంకారం, యూదు వ్యతిరేకత వంటి అంశాల్లో పార్టీ విధానాలను సవరించుకున్నారు. విద్వేష ప్రసంగాలతో తరచు జైలుపాలైన తన తండ్రి మెరీ లీపెన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని కూడా వెనకేసుకొచ్చారు. ఫ్రాన్స్ రాజ్యాంగంలోని 12వ అధికరణం కింద కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నిర్దిష్ట వ్యవధంటూ లేదు.
అలాగని దీర్ఘకాలం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే అది మేక్రాన్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తుంది. మొత్తానికి మూడు పక్షాల్లోనూ ఎవరూ మరొకరితో కలవడానికి ఇష్టపడని వర్తమాన పరిస్థితుల్లో మేక్రాన్ ఏం చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా అవిశ్వాస తీర్మాన గండం తప్పదు. మెడపై మితవాద బెడద వేలాడుతున్న తరుణంలో చివరకు ఫ్రాన్స్ గమ్యం ఏమిటన్నది మిలియన్ యూరోల ప్రశ్న!
ఫ్రాన్స్ గమ్యం ఎటు?
Published Tue, Jul 9 2024 12:27 AM | Last Updated on Tue, Jul 9 2024 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment