యూరప్ దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణిస్తున్నది. దేశాన్ని చుట్టుముట్టిన అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్ ఆర్నెలల క్రితం భావించి పార్లమెంటు రద్దుచేశారు. కానీ మొన్న జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో సమస్య మొదటికొచ్చింది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైకేల్ బార్నియర్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు.
కానీ అది మూడునెలల ముచ్చటైంది. ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన తొలి ప్రభుత్వం బార్నియర్ దే. అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రదిష్ట కూడా ఆయనదే. ఫ్రాన్స్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగాల కోత, పరిశ్రమల మూత రివాజుగా మారాయి. అసలే పడిపోయిన నిజ వేతనాలతో, నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటంతో రెస్టరెంట్లు, చిన్నా పెద్దా దుకాణాలు మూసేస్తున్నారు. ఈ దశలో పులి మీద పుట్రలా ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసే పేరిట బార్నియర్ భారీ కోతలకు దిగారు. ఇది ప్రతిఘటనకు దారితీసింది. పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు.
కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు యూరప్ దేశాల్లో అగ్రగాములుగా వెలిగిన జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ 2021నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్థిక స్వస్థతకు తీసుకున్న చర్యలు ఫలించ బోతున్నాయన్న సంకేతాలున్న తరుణంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడి ఆర్థిక వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. జర్మనీ కొంతవరకూ దీన్ని తట్టుకోగలిగినా ఇంధన సంక్షోభంతో, భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ కుదేలవుతోంది. ఒకపక్క ఊపిరాడనీయని రుణ భారం, మరోపక్క ద్రవ్యలోటు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి.
లాక్‌డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకూ పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పంచిన 15,000 కోట్ల యూరోలు ఆవిరైపోయాయి. సరిగదా... ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాదిమందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి. నెక్సిటీ వంటి భారీ నిర్మాణరంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లటం లేదని తెలిపింది. పర్యవసానంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోక తప్పని స్థితి ఏర్పడింది.
ప్రభుత్వ రుణాలు కనీవినీ ఎరుగని రీతిలో 3 లక్షల 20 వేల కోట్ల యూరోలకు చేరాయి. ఇది దేశ జీడీపీ కన్నా 112 శాతం అధికం. గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలను మించి ప్రభుత్వ లోటు 6.1 శాతం చేరుకుంది. సంపన్నులకూ, కార్పొరేట్ సంస్థలకూ ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తయినా ప్రయోజనం లేకపోగా, వచ్చే ఏడాది కనీసం 6,000 కోట్ల యూరోలు పొదుపు చేయటానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని మొన్న అక్టోబర్‌లో ప్రతిపాదించగానే అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మోతేమిటని ప్రశ్నించాయి.
ఫ్రెంచి పౌరులు గర్వపడే పారిస్‌లోని 860 యేళ్లనాటి పురాతన భవంతి నోటర్‌డామ్ కేథడ్రిల్‌కు 2019లో నిప్పంటుకుని చాలా భాగం ధ్వంసమైనప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పడుతోందని అనేకులు వ్యాఖ్యానించారు. అయిదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మేక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తిచేయగలిగారు.
కానీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది. మామూలుగా అయితే శనివారం 50మంది ప్రపంచాధినేతలు, కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మేక్రాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనటం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
577మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు కావాలి. కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్‌కు 182, మేక్రాన్‌కు చెందిన ఎన్‌సెంబుల్‌కు 168 ఉన్నాయి. తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్‌ఎన్)కి 143 సీట్లున్నాయి. వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచటం ద్వారా ఆర్‌ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. తన బడ్జెట్ పార్లమెంటులో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు.
పర్యవసానంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక తప్పదని అర్థమైనా ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప... అంటే వచ్చే ఏడాది జూలై వరకూ మళ్లీ ఎన్నికలు జరపకూడదు. కనుక అప్పటివరకూ ఫ్రాన్స్‌కు ఆపద్ధర్మ ప్రభుత్వమే గతి. ఈలోగా తన వైఫల్యాలను అంగీకరించి మేక్రాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిరావొచ్చు. ఫలితంగా దేశానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు.
అంతంతమాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్‌ఎన్ నిర్ణయంవల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్‌ఎన్ అధినాయకురాలు మెరిన్ లీ పెన్ ఆశలు అడుగంటినట్టే. ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను అనిశ్చితిలో పడేస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోసహా అన్ని సంక్షోభాలూ ఆగితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం యూరప్‌కు సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment