
ఉన్నత విద్యలో చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం వగైరా మానవ విజ్ఞాన శాస్త్రాల ప్రాధాన్యత అడుగంటి రెండున్నర దశాబ్దాలు దాటుతుండగా చరిత్రను ఆధారం చేసుకుని నిర్మించినట్టు చెబుతున్న సినిమాలు వివాదాస్పదం కావటం, ఉద్రిక్తతలు ఏర్పడటం ఇటీవలి ధోరణి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాజుకున్న హింసాకాండ మూలాలు కూడా అక్కడే ఉండటం యాదృచ్ఛికం కాదు. సోమవారమంతా నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసలో 33మంది పోలీసులు, అయిదుగురు పౌరులు గాయపడగా రెండు బుల్‌డోజర్లతోసహా అనేక వాహనాలకు దుండగులు నిప్పంటించారు.
ఆరో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పవిత్ర గ్రంథంలోని వాక్యాలున్న చద్దర్‌ను దగ్ధం చేశారన్న వదంతి ఈ హింసకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల మొదటివారం నుంచే మహారాష్ట్రలో ఉద్రిక్తతలు అలుముకున్నాయి.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత ఘట్టాలతో రాసిన ఒక చరిత్రాత్మక నవల ఆధారంగా నిర్మించిన ‘ఛావా’ సినిమా చుట్టూ తొలుత వివాదం రాజుకుంది. అందులోని ఉదంతాలకు చారిత్రక ఆధారాలు లేవని సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పీ) ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ అనడంతోపాటు ఔరంగజేబు క్రూరుడు కాడన్నారు. ఆపై మరిన్ని మలుపులు తిరిగింది. మరాఠా వారసత్వాన్ని అవమానించిన ‘ద్రోహి’ అజ్మీని వెంటనే అసెంబ్లీనుంచి బహిష్కరించాలని అధికార మహాయుతి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఈ ఘటనల వెనక ముందస్తు పథకం ఉన్నదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అంటున్న మాటలు వాస్తవం. కానీ ఈనెల మొదటివారంలో సమస్య రాజుకున్నప్పటి నుంచి ఇంటె లిజెన్స్ వర్గాలు, పోలీసులు ఏం చేశారు? దుండగుల కదలికలను అంచనా వేయటంలో ఎందుకు విఫలమయ్యారు? పెట్టుబడుల కోసం, అభివృద్ధి సాధించామని చూపటం కోసం ప్రభుత్వాలన్నీ పోటీపడుతున్న కాలంలో శాంతిభద్రతలను దెబ్బతీసే ఇలాంటి ఘటనల వల్ల అప్రదిష్టపాలవుతా మన్న స్పృహ కూడా లేదా? హింసకు ఆద్యులెవరన్నది తేలడం తర్వాత సంగతి.
ముందు పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన స్థితి. నాగ్‌పూర్ ఆ రాష్ట్రానికి రెండో రాజధాని. జనాభారీత్యా ముంబై, పుణేల తర్వాత మూడో స్థానంలో ఉంటుంది. 300 ఏళ్ల చరిత్రగల ఈ నగరంలో దేశంలోనే తొలి బట్టలమిల్లును టాటాలు స్థాపించారు. 1920 నాటి నాగ్‌పూర్ కాంగ్రెస్ జాతీయ సదస్సులోనే సహాయ నిరాకరణ ఉద్యమం పురుడు పోసుకుంది.
ఇక్కడే హెడ్గేవార్ ఆరెస్సెస్‌ను స్థాపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న బౌద్ధమతాన్ని స్వీకరించి దళిత బుద్ధిస్ట్ ఉద్యమానికి అంకురార్పణ చేసింది ఇక్కడే. ఇది చదువుల తల్లి నిలయం. 1923లో మొదలైన నాగ్‌పూర్ యూనివర్సిటీ సహా ఇక్కడ అయిదు విశ్వ విద్యాలయాలున్నాయి. అయిదు వైద్య కళాశాలలున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమతోపాటు ఇక్కడ ఎన్నో తయారీరంగ పరిశ్రమలున్నాయి. పుణే తర్వాత ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఎక్కువ.
చరిత్రను మలుపుతిప్పిన అనేకులు ఆనాటి అవగాహన, పరిమితుల మేరకు తమ పాత్ర నిర్వహించి నిష్క్రమించారు. వారి చర్యల వెనకున్న ఆంతర్యమేమిటో, అందువల్ల వివిధ వర్గాలకు కలి గిన ఖేదం లేదా మోదం ఏమిటో...వాటి పర్యవసానాలేమిటో విశ్లేషించి చెప్పటం చరిత్రకారులు చేసే పని. అయితే అలా వెలువడే చరిత్రలు నూరు శాతం వాస్తవమని భావించటానికి వీలుండదు.
ఎందుకంటే చరిత్రను వక్రీకరించటం మొదలెట్టి చాన్నాళ్లయింది. ఇక సృజనాత్మకత జోడించి రాసే కాల్పనిక రచనల గురించి చెప్పేదేముంది? శంభాజీ తీరుతెన్నులను నిశితంగా విమర్శించేవీ ఉన్నాయి. ఆయన్ను ఆకాశానికెత్తేవీ ఉన్నాయి. అయితే నేరుగా శంభాజీని కలిసి, సంభాషించిన నికొ లాయ్ మానుచ్చి అనే ఇటాలియన్ తన యాత్రా రచన ‘స్టోరియా దొ మొగర్’లో అనేక అంశాలు రాశాడు.
అవి కల్పితం అయ్యే చాన్సు తక్కువ. ఔరంగజేబు 49 ఏళ్లపాటు పాలించి తన 88వ యేట 1707లో మరణించాడు. అతని హయాంలో దాదాపు 25 యేళ్లపాటు యుద్ధాలే సాగాయి. ముఖ్యంగా మరాఠాలకూ, మొగల్ సైన్యానికీ మధ్య తీవ్ర వైరం ఉండేది. ఆ క్రమంలో శంభాజీని హత మార్చి, అతని ఏడేళ్ల కుమారుడు సాహూను ఖైదు చేయటం చరిత్రలో చోటుచేసుకున్న వాస్తవిక అంశాలు.
పద్దెనిమిదేళ్ల కారాగారవాసం తర్వాత ఔరంగజేబు మరణానంతరం సాహూ విడుదల కావటం, ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టడం, మరాఠాల ప్రాభవం మరింత పెరిగి, ఉపఖండంలో వారు తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకోవటం చరిత్ర. క్రూరత్వమే వీరత్వంగా చలామణి అయిన మధ్యయుగాల్లో ఔరంగజేబు వంటి పాలకుల్లో మంచిని వెదకటంవల్ల కలిగే ప్రయోజనమేమిటో అజ్మీ వంటివారు చెప్పాలి.
మహారాష్ట్ర ప్రజలకూ, ముఖ్యంగా మరాఠాలకూ శివాజీతో, ఆయన వారసత్వంతో భావోద్వేగాలతో ముడిపడిన అనుబంధం ఉంటుంది. దాన్ని గాయపరిచి, వివాదాన్ని సృష్టించి ఆయన సాధించదల్చుకున్నదేమిటో అర్థంకాని విషయం. రాజకీయంగా అజ్మీ ఏ పార్టీతో ఉన్నా, ఎంతగా వివాదాస్పదుడైనా బీజేపీ, శివసేనలతోసహా అన్ని పార్టీలతోనూ ఆయనకు సాన్నిహిత్యం వుంది.
హత్య కేసు వివాదంలో ఇరుక్కుని మంత్రి పదవి కోల్పోయిన ధనంజయ్ ముండా ఉదంతం నుంచి అధికార కూటమిని కాపాడటానికే ఉద్దేశపూర్వకంగా అజ్మీ ఈ వివాదం రెచ్చగొట్టారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణ. ఆ మాటెలావున్నా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు నోరు అదుపులో ఉంచుకోవటం అవసరం. నాగ్‌పూర్ హింస ఈ సంగతినే తెలియజెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment