అంకితభావంతో ఎదిగిన ఫడ్నవీస్
ముంబై: ఏబీవీపీ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం ఆరంభించిన దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పట్ల విధేయత, అంకితభావం, పట్టుదలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన 1970 జూలై 22న మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించారు. తండ్రి దివంగత గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. దేవేంద్ర 1989లో ఏబీవీపీలో చేరారు. 22 ఏళ్ల వయసులో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు. 1997లో 27 ఏళ్ల పిన్న వయసులోనే నాగపూర్ మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు.
అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్ట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం విశేషం. మహారాష్ట్రలో మనోహర్ జోషీ తర్వాత రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఫడ్నవీస్ నిరుత్సాహపడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని విజయపథంలో నడిపించారు.
సున్నిత మనస్కుడు
ఫడ్నవీస్ పాఠశాలలో చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచర్ అని ఆయన గురువు సావిత్రి సుబ్రమణియం చెప్పారు. ఫడ్నవీస్ ఎనిమిది నుంచి పదో తరగతి దాకా సరస్వతి విద్యాలయలో చదువుకున్నారు. తన విద్యార్థి అయిన ఫడ్నవీస్ చిన్నప్పుడు సున్నిత మనస్కుడిగా ఉండేవాడని, అందరినీ చక్కగా గౌరవించేవాడని, ఇతరులకు చేతనైన సహాయం చేసేవాడని, చాలా మర్యాదస్తుడని సావిత్రి సుబ్రమణియం తెలిపారు. చదువులో సగటు విద్యారి్థగానే ఉండేవాడని అన్నారు. అసాధారణమైన విద్యార్థి కానప్పటికీ బాగానే చదివేవాడనని వెల్లడించారు. బాగా పొడగరి కావడంతో తరగతిలో చివర వరుసలో కూర్చొనేవాడని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment