ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల్లో మహావికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమి మద్దతు అభ్యర్థి సుధాకర్ అద్బాలే ఘన విజయం సాధించారు.
వివరాల ప్రకారం.. నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నాగో గనార్‌పై మహావికాస్ అగాడీ కూటమి అభ్యర్థి సుధాకర్ అద్బాలే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 34,360 ఓట్ల పోల్ అవగా.. సుధాకర్ అద్బాలే 16,700 ఓట్లు సాధించగా, నాగో గనార్‌కు 8,211 ఓట్లు మాత్రమే పడ్డాయి. కాగా, నాగపూర్ బీజేపీ కీలక నేతలైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సొంత ప్రాంతం కావడం గమనార్హం. అంతేకాకుండా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం కూడా నాగ్‌పుర్‌లోనే ఉండటం విశేషం. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది.
మరోవైపు.. ప్రస్తుతం నాగపూర్ ఎంపీగా గడ్కరీ ఉండగా, నాగపూర్ (సౌత్ వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ గత 3 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నాగ్‌పుర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిలో బీజేపీ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. కాగా, జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇక, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment