
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్ నుంచి 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను నాగ్‌పూర్‌ను ఎప్పుడూ మరచిపోలేదని, ఇకపైనా ఎప్పుడూ మరచిపోనని పేర్కొన్నారు.
‘ఈ ఎన్నికల్లో నేను 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. మీరందరూ నన్ను ఎంతో ప్రేమించారు. నేను ఏ పని చేసినా అది మీ ప్రేమ, ఆదరణ వల్లే చేయగలిగాను. ఆ ఘనత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకే చెందుతుంది. నేను నాగ్‌పూర్‌ను ఎప్పుడూ మరచిపోలేదు. ఇకపైనా ఎప్పుడూ మరచిపోను’ అని నితిన్ గడ్కరీ వివరించారు.
రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా తాను ఏ పని చేసినా ఆ ఘనత తనను అధికారంలోకి తెచ్చిన ఓటర్లకే దక్కుతుందన్నారు. గత పదేళ్లలో నాగ్‌పూర్‌లో రూ. లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశానని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.
తన రాజకీయ వారసత్వంపై బీజేపీ కార్యకర్తలకే హక్కు ఉందని నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకులు ఎవరూ రాజకీయాల్లో లేరన, రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా గోడలపై పోస్టర్లు అతికించి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని వారికి చెప్పినట్లుగా తెలిపారు.
కాగా నాగ్‌పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.