ఇండో–ఫ్రెంచ్‌ సంబంధాల్లో నవశకం | Sakshi Guest Column On India French relations | Sakshi
Sakshi News home page

ఇండో–ఫ్రెంచ్‌ సంబంధాల్లో నవశకం

Published Wed, Jan 31 2024 3:09 AM | Last Updated on Wed, Jan 31 2024 10:56 AM

Sakshi Guest Column On India French relations

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్, భారత ప్రధాని మోదీ

భౌగోళిక–వ్యూహాత్మక అస్థిరతను ఎదుర్కోవాలంటే, సంబంధాల్లో వైవిధ్యం పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో భారత గణతంత్ర దినోత్సవాలకు అతిథిగా వచ్చిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ పర్యటన ఇరుదేశాల సంబంధాలను మరింత దృఢతరం చేస్తుంది. గాజాలో యుద్ధం కారణంగా చాలామంది అసాధ్యం అని భావిస్తున్న ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరోప్‌ కారిడార్‌ గురించి ఇరుపక్షాలు ప్రస్తావించాయి. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను స్వీకరించేందుకు ఫ్రాన్స్‌ అంగీకరించింది. ఇక ‘ఇండో–ఫ్రెంచ్‌ రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య రోడ్‌మ్యాప్‌’ ఇరుదేశాలనూ కొనుగోలుదారు–విక్రేత సంబంధాన్ని దాటి చూస్తోంది. మోదీ, మెక్రాన్ ల మధ్య ఉన్న వ్యక్తిగత బంధం వల్ల కూడా ఈ పర్యటన ప్రత్యేకంగా మారింది.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్  తన భారత పర్యటనను ఇటీవలే ముగించారు. ఇది ఇరుదేశాల మధ్య నిర్మాణాత్మకమైన పర్యటనగా మార వచ్చని భావిస్తున్నారు. ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన గౌరవ అతిథి కావడం వల్ల ఈ పర్యటన సందర్భమే... ఆడంబరం, సంకేతాలతో కూడుకుని ఉన్నది. అయితే, ఆయన పర్యటనలో స్పష్టంగా కనిపించని అంశాన్ని చూడటం, భౌగోళిక–వ్యూహాత్మక చిక్కులను పరిశీలించడం చాలా ముఖ్యం.

భారత్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్  పరస్పరం చక్కగా కలిసిపోతారు. ఎమ్‌–ఎమ్‌ (మోదీ, మెక్రాన్‌)అంశం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి పలు విషయాలను జోడించింది: నిర్ణయం తీసుకోవడాన్ని వేగవంతం చేసింది, పైగా ఒక దార్శనికతను అందించింది. ఈ క్రమంలో, ఇది బ్యూరోక్రాటిక్‌ జడ త్వాన్ని, అతి భారమైన ఆలోచనలను అధిగమించడంలో సహాయ పడింది. 

ప్రపంచ వ్యూహాత్మక రాజకీయాల్లో తీవ్రమైన అల్లకల్లోలం నేపథ్యంలో మెక్రాన్‌ తాజా పర్యటనను చూడాల్సి ఉంటుంది. రెండు ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి ఉక్రెయిన్ లో, మరొకటి గాజాలో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కష్టంగా కనిపిస్తోంది. బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ప్రపంచ వాణిజ్య సంస్థ అవసాన దశలో ఉండటం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం చిందరవందరగా ఉంది. ప్రబల శక్తి అయిన అమెరికా దేశీయ రాజ కీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది.

కనీవినీ ఎరుగని ఈ భౌగోళిక–వ్యూహాత్మక అస్థిరతను భారత దేశం ఎదుర్కోవాలంటే... నష్ట భయం తగ్గించుకోవాలి, దేశాలతో సంబంధాల్లో వైవిధ్యం పెంచుకోవాలి, బహుళ ఒడంబడికల ఆధారంగా విదేశాంగ విధానాన్ని కొనసాగించాలి. అమెరికా ఎల్లప్పుడూ భారతదేశానికి కీలకమైన వ్యూహాత్మక రక్షణ భాగస్వామిగా ఉంటుంది. అయితే, అది ఎప్పటికప్పుడు, కొన్ని దేశీయ ఒత్తిళ్లకు, చైనా–అమెరికా సంబంధాల స్థితి వంటి బాహ్య కారకాలకు కూడా లోబడి ఉంటుంది.

జపాన్‌తో సంబంధాలను చూస్తే, భారతీయ వస్తూత్పత్తిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నాయి. కానీ రక్షణ, భద్రతా సహ కారం జరిగే అవకాశం కాస్త పరిమితంగా ఉంది. రష్యా విషయానికి వస్తే, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారతదేశ వైఖరి గురించి సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఇతర శక్తులతో తన రక్షణ సంబంధాలను విస్తరించుకోవాలని భారత్‌ కోరు కోవడాన్ని రష్యా అర్థం చేసుకోగలదని ఆయన చెప్పడం గమనార్హం.

పై దృష్టాంతం ప్రకారం చూస్తే, ఫ్రాన్స్‌తో భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం విపరీతమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండో –ఫ్రెంచ్‌ సంబంధాలు... వ్యూహాత్మక ఏకీభావం, స్వయంప్రతిపత్తి, ఇరు దేశాలలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటాయి. అయితే మోదీ, మెక్రాన్ ల మధ్య ఉన్న అసాధారణమైన వ్యక్తిగత స్నేహసంబంధాలు... ఇండో–ఫ్రెంచ్‌ వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని నిజంగా ప్రత్యేకమైనదిగా మార్చింది.

‘బాసిల్‌ డే’(ఫ్రెంచ్‌ జాతీయ దినోత్సవం) ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ గత ఏడాది జూలైలోనే పారిస్‌కు వెళ్లారనీ, అప్పుడే ఇరు నేతలూ వివరణాత్మక పత్రం ‘హొరైజన్‌ 2047’కు అంగీకరించారనీ పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుత పర్యటన నుండి కూడా నాటకీయ ప్రకటనలను ఆశించడం అవాస్తవికంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ పర్యటన నుండి బయటపడిన అత్యంత ముఖ్యమైన ఫలితం ‘ఇండో –ఫ్రెంచ్‌ రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యం కోసం రోడ్‌మ్యాప్‌’.

ఇది క్లాసిఫైడ్‌ అయినప్పటికీ, ఇందులోని ఆంశాలేమిటో చూచాయగా తెలుస్తున్నాయి. ఈ రోడ్‌మ్యాప్‌ ఇరుదేశాలనూ కేవలం కొనుగోలు దారు–విక్రేత సంబంధంలో చూడటం లేదు. భారత సాయుధ దళాల రక్షణ అవసరాలు తీర్చడమే గాక, సహ డిజైన్, సహ అభివృద్ధి, సహ ఉత్పత్తికి వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా ఇతర స్నేహపూర్వక దేశా లకు నమ్మకమైన రక్షణ సామగ్రిని అందించేందుకూ అంగీకరిస్తోంది.

ఇది ప్రతిష్ఠాత్మకమైన ప్రణాళిక. ఇది ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు మాత్రమే కాకుండా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమానికి కూడా గణ నీయంగా దోహదపడుతుంది. ఫ్రెంచ్‌ సంస్థ సాఫ్రెన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ల గురించి మాత్రమే కాకుండా రాఫెల్‌ ఇంజిన్‌ల నిర్వహణ, మరమ్మతులు, కార్యకలాపాల స్థాపనలో పురోగతి గురించి ఉమ్మడి ప్రకటనలో సూచనలు ఉన్నాయి.

సాఫ్రెన్, హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ సంస్థల మధ్య సమగ్ర భాగస్వామ్యం అనేది 100 శాతం సాంకేతికత బదిలీతో బహుళ–పాత్ర పోషించే హెలికాప్టర్‌ ఇంజిన్ ల అభి వృద్ధికి ఉద్దేశించబడింది. అదనంగా, స్కార్పెన్‌ జలాంతర్గాములు భారత్‌లో గణనీయమైన స్వదేశీకరణతో నిర్మించడాన్ని కొనసాగిస్తాయి. 

టాటా అడ్వాన్్సడ్‌ సిస్టమ్స్‌ భాగస్వామ్యంతో ఎయిర్‌బస్‌ భారత దేశంలో పౌర హెలికాప్టర్ల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది. ఇది రెండు దేశాల ప్రైవేట్‌ రంగానికీ మొట్టమొదటిది. ఇరుపక్షాలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఉమ్మడి ట్రైసర్వీసెస్‌ కార్యక్రమాన్ని పరిశీలి స్తున్నాయి. ఇరుదేశాల సంబంధాల్లో అంతరిక్ష రంగం కూడా ముఖ్య స్థానంలో ఉంది.

రెండు దేశాలు ఆరు దశాబ్దాలకు పైగా అంతరిక్ష రంగంలో సహకరించుకున్నాయి. 2023 జూన్‌లో ప్రారంభించిన సంస్థాగత వ్యూహాత్మక అంతరిక్ష సంభాషణ మరింత ముందుకు సాగుతోంది. వాస్తవానికి, రక్షణ అంతరిక్ష భాగస్వామ్యంపై రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అంగీకార లేఖ ఈ ఫలితాలలో ఒకటి. రక్షణ, అంతరిక్షం కలిసి ఈ భాగస్వామ్యాన్ని నడిపిస్తున్నాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, గాజాలో యుద్ధం కారణంగా చాలామంది అసాధ్యం అని భావిస్తున్న ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌– యూరోప్‌ కారిడార్‌ గురించి ఇరుపక్షాలు ప్రస్తావించాయి. రెండు వైపులా ఈ కార్యక్రమం గురించిన వ్యూహాత్మక ప్రాముఖ్యతను పున రుద్ఘాటించడమే కాకుండా, ప్రాజెక్ట్‌ కోసం ప్రత్యేక ప్రతినిధిని మెక్రాన్‌ నియమించడాన్ని మోదీ స్వాగతించారు. బహుశా, ఈ కీలకమైన ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి భారతదేశం కూడా అదే పని చేయాలి.

వ్యూహాత్మక భాగస్వామ్య కొనసాగింపు... స్పష్టంగా ఆవిష్కరణ, సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మేధ, అడ్వాన్్సడ్‌ కంప్యూటింగ్, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌లో సహకారాన్ని తీవ్ర తరం చేయాలని ఇరుపక్షాలూ నిర్ణయించాయి. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఫ్రాన్స్‌ స్వీకరించడం గురించి ఫ్రెంచ్‌ అధ్యక్షుడు అంగీకరించారు. ఇది చాలావరకు సాధ్యమే. భారతదేశం – యూరోపియన్‌ యూనియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఇద్దరు నాయకులు తమ దృఢమైన మద్దతును పునరుద్ఘాటిస్తుండటం స్వాగతించదగినది. సాధారణ ఎన్నికల తర్వాత భారతదేశానికి ఈ ఒప్పందం ప్రధాన వాణిజ్య విధాన లక్ష్యా లలో ఒకటిగా ఉండాలి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో భారతదేశం 30పైగా వ్యూహా త్మక భాగస్వామ్యాలను కలిగి ఉంది. వాటిలో కొన్ని పరస్పర అవస రాలపై, రాజకీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. కానీ ఇండో –ఫ్రెంచ్‌ భాగస్వామ్యం మాత్రం పరస్పర ఎంపికపై ఆధారపడి ఉంది. అంతేకాకుండా ఇది ప్రపంచ భౌగోళిక వ్యూహాత్మక సంబంధాలను పునర్నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మోహన్‌ కుమార్‌ 
వ్యాసకర్త ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి; ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ డీన్‌ (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement