Conservatives party
-
ప్రజాభీష్టానికి పాతర
వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్‌లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ నేత మిషెల్ బార్నియెర్ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్ 9న పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్‌లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. నిజానికి, ఫ్రాన్స్‌లో జూలైలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్‌కు చెందిన ‘రినైజెన్స్ బ్లాక్’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ (ఎన్‌ఎఫ్‌పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్ఎఫ్పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్ కథ నడిపారు. పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్ మెక్రాన్ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్ సహా యూరప్ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్ కింగ్ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్ సమర్థిస్తున్నారు. అది కన్జర్వేటివ్‌లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్‌ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
మళ్లీ కామెరానే బ్రిటిష్ ప్రధాని
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీగా సాగిన పోరులో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరోసారి ప్రధాని పీఠాన్నిఅధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ ఇప్పటికి 326 సీట్లను గెల్చుకుంటే, ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ 230 సీట్లు సాధించింది. 643 స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. మరో 7 సీట్లకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉండగానే కన్సర్వేటివ్స్ విజయం ఖాయమైపోయింది. సాధారణ మెజారిటీకి కావల్సిన 326 మ్యాజిక్ మార్కును సాధించారు. ఎగ్జిట్ పోల్స్‌కు అంచనాలకు కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డేవిడ్ కామెరాన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకోసం ఆయన బ్రిటిష్ రాణిని అనుమతి కోరారు. స్కాటిష్ నేషనల్ పార్టీ సంచలన విజయాలను నమోదు చేసింది. 56 సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఒక విధంగా వీరి ఫలితం ప్రధాన ప్రతిపక్షాన్ని బాగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. మొత్తం కాగా మొత్తం 650 స్థానాలకు ఇప్పటివరకు ఫలితాలు ఇలా ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 326 లేబర్ పార్టీ 230 స్కాటిష్ నేషనల్ పార్టీ 56 లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 8 డియూపి 8 ఇతరులు 15 రాణి ఎలిజబెత్ అధికారిక ప్రకటన అనంతరం ఈ నెల 27న కొత్త పార్లమెంటు కొలువుదీరనుంది. కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీ, ప్రతిపక్షం లేబర్ పార్టీ 239 స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. విపక్షనేత రాజీనామా బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత ఎడ్ మిలిబాండ్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఇక ఓటమిని అంగీకరించక తప్పలేదు. మోదీ అభినందనలు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను అభినందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయనకు అభినందనలు తెలిపారు. 'ఫిర్ ఏక్ బార్.. కామెరాన్ సర్కార్' (మరోసారి కామెరాన్ ప్రభుత్వమే) అంటూ తన ఎన్నికల సమయం నాటి నినాదాన్ని గుర్తుచేశారు. అప్పట్లో 'అబ్ కీ బార్ మోదీ సర్కార్' అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. Congratulations @David_Cameron. As you rightly pointed out- its "Phir Ek Baar, Cameron Sarkar!" My best wishes. pic.twitter.com/xf5tJfW0SE — Narendra Modi (@narendramodi) May 8, 2015 -
అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ గట్టిగా ఉంది. నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తన స్థానాలను నిలబెట్టుకుంటోంది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. అధికార పార్టీ 218 సీట్లను గెల్చుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం 200 సీట్లు సాధించింది. అయితే తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఫలితాలపై కామెరాన్ ట్విట్ చేశారు. 'ఒకే జాతి.. ఒకే రాజ్యం...మరోసారి దేశప్రధానిగా ఎన్నికయితే.. ప్రజలకు సేవచేసే అవకాశం దొరకడం నా అదృష్టం' అంటూ ఆయన ట్విట్ చేశారు. ముందుంది మంచి కాలం అన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత, లేబర్ పార్టీ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎడ్ మిలిబాండ్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత నిక్‌క్లెగ్, యునైటెడ్ కింగ్డమ్ ఇండిపెండెన్స్ పార్టీ నికెల్ ఫరాగ్, స్కాటిష్ నేషనల్ పార్టీ అధిపతి నికోలా స్టర్జన్ తదితరులు విజయాన్ని సాధించినవారిలో ఉన్నారు. ఆరు లక్షలకు పైగా భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో నిర్ణాయశ శక్తిగా మిగలడం విశేషం. ఫలితాలను రాణి ఎలిజబెత్ అధికారికంగా ప్రకటించిన అనంతరం ఈ నెల 27న ఆమె ప్రసంగంతో కొత్త పార్లమెంటు కొలువుదీరనుందని సమాచారం. -
ఆసక్తికరంగా బ్రిటన్ ఎన్నికల ఫలితాలు
లండన్: నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు నమోదయ్యాయి. తరువాత క్రమంగా కన్సర్వేటివ్ పుంజుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ 200, లేబర్ పార్టీ188, ఎస్ఎన్పీ 55 స్థానాలను గెలుచుకున్నాయి. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు స్కాటిష్ నేషనల్ పార్టీ 55 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 20ఏళ్ల ఎస్ఎన్పీ అభ్యర్థి మైరి బ్లాక్ అనే విద్యార్థి విజయాన్ని సాధించారు. పార్లమెంటుకు ఎన్నికైన అతి చిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 239 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే అని తెలిపింది. -
బ్రిటన్ ప్రధానిగా మళ్లీ కామెరాన్?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుంటారా ? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. వచ్చే ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్ పార్లమెంట్‌లోని మొత్తం 650 స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వాటిలో 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 239 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే అని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌పై డేవిడ్ కామెరాన్ ప్రభుత్వంలోని మంత్రి మైఖల్ గోవ్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పింది అక్షరాల నిజం అని అన్నారు.