ఆసక్తికరంగా బ్రిటన్ ఎన్నికల ఫలితాలు
లండన్: నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు నమోదయ్యాయి. తరువాత క్రమంగా కన్సర్వేటివ్ పుంజుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ 200, లేబర్ పార్టీ188, ఎస్ఎన్పీ 55 స్థానాలను గెలుచుకున్నాయి. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు.
మరోవైపు స్కాటిష్ నేషనల్ పార్టీ 55 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 20ఏళ్ల ఎస్ఎన్పీ అభ్యర్థి మైరి బ్లాక్ అనే విద్యార్థి విజయాన్ని సాధించారు. పార్లమెంటుకు ఎన్నికైన అతి చిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించారు.
కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 239 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే అని తెలిపింది.