విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ముఖ్యమంత్రి లేఖను గౌరవించాల్సిందే
సీఎం లేఖ రాస్తే స్పందించకపోవడం సరికాదు
స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది
సీఎం లేఖను పక్కనపెట్టి నిద్రపోవడానికి వీల్లేదు
మీ కౌంటర్‌లో ఎక్కడా సీఎం లేఖ ప్రస్తావన లేదేం?
ఆ లేఖ విషయంలో ఏం చేశారో స్పష్టంగా చెప్పండి
భూముల విక్రయంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయండి
అసలు ఏ చట్టం కింద ప్రైవేటీకరణ చేస్తున్నారు?
ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించారా?
అసలు విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా? అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం
మా సొంత డబ్బుతో కొన్న 25 ఎకరాలనే విక్రయిస్తామన్న ‘ఆర్‌ఐఎన్‌ఎల్’
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంత మాత్రం సరికాదంది. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదని, సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది.
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌లో ఎక్కడా ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి, దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రైవేటీకరణకు అనుమతించే చట్టం ఏదైనా ఉందా? ప్రైవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర లబ్దిదారులను సంప్రదించారా? ఈ విషయాలన్నింటిపై మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం కొనసాగేందుకు అవసరమైన నిధులను విదేశాల నుంచి తెస్తానని, ఇందుకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతించాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రైవేటీకరణపై పలు వ్యాజ్యాలు...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు తదితరులు వేర్వేరుగా ‘పిల్స్’ దాఖలు చేశారు. రేషన్‌కార్డుదారులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కూడా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ శేషసాయి ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.
సీఎం లేఖ గురించి కేంద్రం ఏమీ చెప్పడం లేదు...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేశానని తొలుత కేఏ పాల్ వాదనలు వినిపించారు. కేంద్ర మంత్రి విశాఖకు వచ్చి తనను కలిశారన్నారు. కేంద్రం అనుమతిస్తే తాను ఇక్కడే కూర్చొని రూ.8 వేల కోట్ల నిధులను రప్పించి ఏ ఖాతాలో కావాలంటే అందులో జమ చేయిస్తానని చెప్పారు. లేని పక్షంలో ఏ శిక్షకైనా తాను సిద్ధమేనన్నారు. 45 ఏళ్లలో ఉక్కు కర్మాగారం పన్నుల కింద రూ.54 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు.
మరో పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను సూచించిందా? అని ప్రశ్నించగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, ఆ లేఖ సంగతి ఏమిటో కేంద్రం చెప్పడం లేదని నివేదించారు.
మేం కొన్న 25 ఎకరాలనే అమ్ముతున్నాం
ధర్మాసనం ఈ సమయంలో జోక్యం చేసుకుని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) తరఫు న్యాయవాదిని వివరణ కోరింది. ప్రైవేటీకరణ నిజమేనా? భూములు అమ్ముతున్న మాట వాస్తవమేనా? అని ప్రశ్నించింది. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని ఆర్‌ఐఎన్‌ఎల్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ నివేదించారు.
ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో వేటినీ అమ్మడం లేదన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. దీంతో ధర్మాసనం వివేక్ చెప్పిన వివరాలను రికార్డ్ చేసింది. మరో న్యాయవాది వై.కోటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, యథాతథస్థితి కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు.
విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా..?
ఆ 25 ఎకరాలు కాకుండా సేకరించిన మిగిలిన భూముల సంగతి ఏమిటి? ఆ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? అసలు విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర తెలుసా? ఎన్ని ఉక్కు కర్మాగారాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నారు? ఎన్ని ఆచరణలోకి వచ్చాయి? అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ స్పందిస్తూ భూముల అమ్మకం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు.
పిటిషనర్లది ఆందోళన మాత్రమేనన్నారు. ఏం చేసినా పారదర్శకంగా చేస్తామని, పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పారు. దీంతో అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించగా మూడు వారాల్లో అందచేస్తామని రుద్ర నివేదించారు. నిధులు తెచ్చే విషయంలో ఏమైనా వినపతిత్రం ఇచ్చారా? అని ధర్మాసనం ప్రశ్నించగా మార్చిలో అందచేసినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆ వినతిపై ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment