visakha ukku
-
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, నూఢిల్లీ: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వ పెత్తనమేదీ ఉండదని తెలిపారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉండదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. బుధవారం కిషన్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదు. అది ఎన్నికల వేళ మాజీ సీఎం మదిలో పుట్టిన విష ప్రచారం. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుంది. 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానిది ఏమీ ఉండదు. దేశంలో 12 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) ఉన్నాయి. దేనినైనా ప్రైవేట్ పరం చేశామా? అలాంటిది సింగరేణిని ఎలా చేస్తాం? ఎలాంటి పక్షపాతం వహించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ మేరకే నడుచుకుంటాం. సింగరేణిలో జరిగే అవినీతిని బోర్డు మీటింగుల్లో లేవనెత్తుతాం. దేశంలో బొగ్గు మాఫియా చాలా పెద్దది. ప్రధాని మోదీ వచ్చాక మాఫియా ఆగడాలు, అవినీతి తగ్గాయి. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబులిటీ కాదు. అక్కడ లభించే ఇనుప ఖనిజంలో పరిశ్రమలకు సరిపడే నాణ్యత లేదు. ఫీజిబులిటీ లేకే ప్రాగా టూల్స్, ఐడీపీఎల్, ఆలి్వన్, హెచ్ఎంటీ బేరింగ్స్ వంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూతపడ్డాయి. తెలిసి కూడా మరో ఫ్యాక్టరీ ఎలా పెడతాం? ఇది కోపంతోనో, రాజకీయ ప్రయోజనాల కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం లేదంటూ అప్పటి సీఎం కేసీఆర్ ఆరోపించారు. బయ్యారంలో దొరికే ఖనిజాన్ని ఇంకే అవసరాలకు ఉపయోగించుకోవచ్చనే దానిపై అధికారులతో చర్చిస్తా. గనుల వేలంలో పాల్గొనక రాష్ట్రానికి నష్టం గనులు జాతీయ సంపద. అవి ప్రజలకే చెందాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పార్లమెంటులో చట్టం చేశారు. ఈ క్రమంలో గనుల వేలం పారదర్శకంగా జరుగుతోంది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనలేదు. దాంతో రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరిగింది. అది ఎంతనే వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి కొందరు రాష్ట్ర పోలీసులు తప్పు చేశారు. జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలు కూడా తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారు. వారి మీద రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తే ఎలా? న్యాయం జరగదు. సీబీఐ లేదా హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి. ఇలాంటి అంశాలపై సమాజంలోని వ్యక్తులు పిటిషన్లు వేయాలి. పార్టీపరంగా మేం వేయం. నయీం ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి? ఏమున్నాయి? చట్టపరంగా ఎంత వసూలు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలి. ఇక మేడిగడ్డ, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఈ రెండు అంశాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలి. కాళేశ్వరంపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వెంటనే జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిదేమీ జరగదు. ఈ విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉందని, రాద్ధాంతం చేయవద్దని గతంలోనే చెప్పాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభ్యర్థన మేరకు మరో రూ.3 వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలన్న డిమాండ్‌పై ఇంకా అధికారికంగా రివ్యూ చేయలేదు. దీనిపై అధికారులతో చర్చిస్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని బొగ్గు గనులు కొనుక్కోవచ్చు. పోలవరం మాది. అంటే కేంద్రానిది. దానిని పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటాం. అధ్యక్ష పదవిపై పార్టీ నిర్ణయిస్తుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ నిర్ణయం. మంత్రి పదవి కంటే పార్టీ అధ్యక్ష పదవికే ఎక్కువ ప్రాధాన్యం. మంత్రివర్గంలో ఉన్న వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని రూల్ ఏమీ లేదు. యోగ్యత ఉన్నవారు ఎవరైనా మంత్రివర్గంలో ఉంటే.. రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారు. శివరాజ్ సింగ్‌కు ఇవ్వాలనుకుంటే రాజీనామా చేయిస్తారు. అందులో ఇష్యూ ఏమీ లేదు. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా తాత్కాలికంగానే ఇచ్చారు. చాలా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులయ్యారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న వేళ నేను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నాను. ఆర్టికల్ 370 రద్దుకు ముందు అక్కడి పరిస్థితులపై పనిచేశా. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారని అనుకుంటున్నా. -
సీఎం జగన్ లేఖపై ఏం చేశారు?: హైకోర్టు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంత మాత్రం సరికాదంది. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదని, సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి, దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రైవేటీకరణకు అనుమతించే చట్టం ఏదైనా ఉందా? ప్రైవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర లబ్దిదారులను సంప్రదించారా? ఈ విషయాలన్నింటిపై మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం కొనసాగేందుకు అవసరమైన నిధులను విదేశాల నుంచి తెస్తానని, ఇందుకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతించాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటీకరణపై పలు వ్యాజ్యాలు... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు తదితరులు వేర్వేరుగా ‘పిల్స్’ దాఖలు చేశారు. రేషన్‌కార్డుదారులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కూడా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ శేషసాయి ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. సీఎం లేఖ గురించి కేంద్రం ఏమీ చెప్పడం లేదు... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేశానని తొలుత కేఏ పాల్ వాదనలు వినిపించారు. కేంద్ర మంత్రి విశాఖకు వచ్చి తనను కలిశారన్నారు. కేంద్రం అనుమతిస్తే తాను ఇక్కడే కూర్చొని రూ.8 వేల కోట్ల నిధులను రప్పించి ఏ ఖాతాలో కావాలంటే అందులో జమ చేయిస్తానని చెప్పారు. లేని పక్షంలో ఏ శిక్షకైనా తాను సిద్ధమేనన్నారు. 45 ఏళ్లలో ఉక్కు కర్మాగారం పన్నుల కింద రూ.54 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. మరో పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను సూచించిందా? అని ప్రశ్నించగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, ఆ లేఖ సంగతి ఏమిటో కేంద్రం చెప్పడం లేదని నివేదించారు. మేం కొన్న 25 ఎకరాలనే అమ్ముతున్నాం ధర్మాసనం ఈ సమయంలో జోక్యం చేసుకుని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తరఫు న్యాయవాదిని వివరణ కోరింది. ప్రైవేటీకరణ నిజమేనా? భూములు అమ్ముతున్న మాట వాస్తవమేనా? అని ప్రశ్నించింది. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని ఆర్ఐఎన్ఎల్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ నివేదించారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో వేటినీ అమ్మడం లేదన్నారు. ఆర్ఐఎన్ఎల్ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. దీంతో ధర్మాసనం వివేక్ చెప్పిన వివరాలను రికార్డ్ చేసింది. మరో న్యాయవాది వై.కోటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, యథాతథస్థితి కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా..? ఆ 25 ఎకరాలు కాకుండా సేకరించిన మిగిలిన భూముల సంగతి ఏమిటి? ఆ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? అసలు విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర తెలుసా? ఎన్ని ఉక్కు కర్మాగారాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నారు? ఎన్ని ఆచరణలోకి వచ్చాయి? అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ స్పందిస్తూ భూముల అమ్మకం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. పిటిషనర్లది ఆందోళన మాత్రమేనన్నారు. ఏం చేసినా పారదర్శకంగా చేస్తామని, పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పారు. దీంతో అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించగా మూడు వారాల్లో అందచేస్తామని రుద్ర నివేదించారు. నిధులు తెచ్చే విషయంలో ఏమైనా వినపతిత్రం ఇచ్చారా? అని ధర్మాసనం ప్రశ్నించగా మార్చిలో అందచేసినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆ వినతిపై ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
విశాఖ ఉక్కుపై పునరాలోచన లేదు
లోక్‌సభలో సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సమీక్షించే ప్రతిపాదన ఏదీ లేదని సోమవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఏడాది జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్వహించిన సమావేశంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు పరిశ్రమ) ప్రైవేటీకరణలో భాగంగా వందశాతం పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయ అనుమతి తెలిపిందని పేర్కొన్నారు. దీన్లో కేంద్ర ప్రభుత్వ వాటాతోపాటు అనుబంధంగా ఉన్న సంస్థలు, సంయుక్త భాగస్వామ్యసంస్థల వాటాలను 100 శాతం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. షేర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఉద్యోగులు, భాగస్వాముల సమస్యల పరిష్కార విధివిధానాలు చేరుస్తామని పేర్కొన్నారు. హనుమ జన్మస్థలంపై పరిశోధన ప్రతిపాదన లేదు హనుమంతుడి జన్మస్థలంపై పరిశోధనచేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. హనుమంతుడి జన్మస్థలం ఏడుకొండల మీద అని టీటీడీ, కొప్పల్ జిల్లాలో అని కర్ణాటక చెబుతున్న అంశాలపై కేంద్రానికి అవగాహన ఉందా అని బీజేపీ సభ్యుడు సంగన్న అమరప్ప అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో భాగంగా రాష్ట్రాలు, పాఠశాలల ఉత్తమ పద్ధతులు, నూతన ఆవిష్కరణలు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలికవసతుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పథకంపై వైఎస్సార్సీపీ సభ్యుడు బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జాతీయ విద్యావిధానం–2020లో సెకండరీ విద్యకు సంబంధించి లాంగ్ టర్మ్ డిజిటల్ ఎడ్యుకేషనల్ స్ట్రాటజీ కూడా చేర్చినట్లు వైఎస్సార్సీపీ సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ముస్లింలలో 6.96 శాతమే గ్రాడ్యుయేట్లు రాజ్యసభలో ముస్లింలలో గ్రాడ్యుయేషన్, ఆపైన చదువుతున్న వారి సంఖ్య 6.96 శాతం మాత్రమేనని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 43 శాతం ముస్లిం జనాభాలో 2.75 శాతం మాత్రమే గ్రాడ్యుయేట్లున్న విషయం వాస్తవమేనా అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ముస్లిం జనాభాలో అక్షరాస్యత 68.5 శాతం ఉన్నట్లుగా 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయన్నారు. విద్యాపరంగా మైనారిటీ సాధికారికత నిమిత్తం ప్రవేశపెట్టిన మూడు ఉపకారవేతన పథకాలకు బడ్జెట్ కేటాయింపును రూ.287 కోట్లకు పెంచిన దృష్ట్యా 2018–19 నుంచి హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా రద్దుచేసినట్లు పేర్కొన్నారు. ఏపీలో 112 తాగునీటి పరీక్ష, పరిశోధన కేంద్రాలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు జవాబుగా కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. -
Vizag Steel Plant: ‘ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’
-
Vizag Steel Plant: ‘ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’
సాక్షి,ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది. శనివారం ఉక్కు పరిరక్షణ సమితి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం కొత్త పరిశ్రమలు ఇవ్వకుండా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మణిహారంలాంటి విశాఖ స్టీల్‌ను కాపాడుకోవాలని పేర్కొన్నారు. రూ.వేలకోట్ల విలువైన విశాఖ స్టీల్‌ను చౌకగా అమ్మేస్తున్నారని, స్టీల్‌ప్లాంట్ అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని విపక్షాలను కోరతామని చెప్పారు. తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, పార్లమెంటరీ పార్టీ నాయకులు స్టీల్ ప్లాంట్ సమస్యకు మద్దతు పలికారని వెల్లడించారు. -
'విశాఖ ఉక్కును కాపాడుకుందాం'
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సంరక్షిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె విశాఖ స్టీల్‌ప్లాంట్ గేటు వద్ద ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ఏ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయబోమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను విస్తరణ చేస్తామని, విశాఖపట్నానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏమి చేయాలనుకున్నారో అన్నీ చేస్తామన్నారు. ఉక్కు గనుల కొరతను తీర్చటంతో పాటు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్రంతో పోరాడైనా స్టీల్‌ప్లాంట్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామన్నారు.