ఆ సంస్థపై కేంద్రం పెత్తనం ఏమీ లేదు, ఉండదు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
బొగ్గు బ్లాకుల వేలంలో కేసీఆర్ ప్రభుత్వం పాల్గొనకపోవడం వల్ల నష్టం జరిగింది
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే..
ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలి
పోలీసులు చేసిన తప్పును పోలీసులే విచారిస్తే ఎలా?
కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న కేంద్ర మంత్రి
సాక్షి, నూఢిల్లీ: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వ పెత్తనమేదీ ఉండదని తెలిపారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉండదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. బుధవారం కిషన్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదు. అది ఎన్నికల వేళ మాజీ సీఎం మదిలో పుట్టిన విష ప్రచారం.
సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుంది. 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానిది ఏమీ ఉండదు. దేశంలో 12 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) ఉన్నాయి. దేనినైనా ప్రైవేట్ పరం చేశామా? అలాంటిది సింగరేణిని ఎలా చేస్తాం? ఎలాంటి పక్షపాతం వహించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ మేరకే నడుచుకుంటాం. సింగరేణిలో జరిగే అవినీతిని బోర్డు మీటింగుల్లో లేవనెత్తుతాం. దేశంలో బొగ్గు మాఫియా చాలా పెద్దది. ప్రధాని మోదీ వచ్చాక మాఫియా ఆగడాలు, అవినీతి తగ్గాయి.
అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబులిటీ కాదు. అక్కడ లభించే ఇనుప ఖనిజంలో పరిశ్రమలకు సరిపడే నాణ్యత లేదు. ఫీజిబులిటీ లేకే ప్రాగా టూల్స్, ఐడీపీఎల్, ఆలి్వన్, హెచ్‌ఎంటీ బేరింగ్స్ వంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూతపడ్డాయి. తెలిసి కూడా మరో ఫ్యాక్టరీ ఎలా పెడతాం? ఇది కోపంతోనో, రాజకీయ ప్రయోజనాల కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం లేదంటూ అప్పటి సీఎం కేసీఆర్ ఆరోపించారు. బయ్యారంలో దొరికే ఖనిజాన్ని ఇంకే అవసరాలకు ఉపయోగించుకోవచ్చనే దానిపై అధికారులతో చర్చిస్తా.
గనుల వేలంలో పాల్గొనక రాష్ట్రానికి నష్టం
గనులు జాతీయ సంపద. అవి ప్రజలకే చెందాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పార్లమెంటులో చట్టం చేశారు. ఈ క్రమంలో గనుల వేలం పారదర్శకంగా జరుగుతోంది. గత పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనలేదు. దాంతో రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరిగింది. అది ఎంతనే వివరాలు త్వరలో వెల్లడిస్తాం.
ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి
కొందరు రాష్ట్ర పోలీసులు తప్పు చేశారు. జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలు కూడా తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారు. వారి మీద రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తే ఎలా? న్యాయం జరగదు. సీబీఐ లేదా హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి. ఇలాంటి అంశాలపై సమాజంలోని వ్యక్తులు పిటిషన్లు వేయాలి. పార్టీపరంగా మేం వేయం. నయీం ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి? ఏమున్నాయి? చట్టపరంగా ఎంత వసూలు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలి. ఇక మేడిగడ్డ, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఈ రెండు అంశాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలి. కాళేశ్వరంపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వెంటనే జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిదేమీ జరగదు. ఈ విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉందని, రాద్ధాంతం చేయవద్దని గతంలోనే చెప్పాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభ్యర్థన మేరకు మరో రూ.3 వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలన్న డిమాండ్‌పై ఇంకా అధికారికంగా రివ్యూ చేయలేదు. దీనిపై అధికారులతో చర్చిస్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని బొగ్గు గనులు కొనుక్కోవచ్చు. పోలవరం మాది. అంటే కేంద్రానిది. దానిని పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటాం.
అధ్యక్ష పదవిపై పార్టీ నిర్ణయిస్తుంది
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ నిర్ణయం. మంత్రి పదవి కంటే పార్టీ అధ్యక్ష పదవికే ఎక్కువ ప్రాధాన్యం. మంత్రివర్గంలో ఉన్న వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని రూల్ ఏమీ లేదు. యోగ్యత ఉన్నవారు ఎవరైనా మంత్రివర్గంలో ఉంటే.. రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారు. శివరాజ్ సింగ్‌కు ఇవ్వాలనుకుంటే రాజీనామా చేయిస్తారు. అందులో ఇష్యూ ఏమీ లేదు. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా తాత్కాలికంగానే ఇచ్చారు.
చాలా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులయ్యారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న వేళ నేను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నాను. ఆర్టికల్ 370 రద్దుకు ముందు అక్కడి పరిస్థితులపై పనిచేశా. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారని అనుకుంటున్నా.
Comments
Please login to add a commentAdd a comment