గనుల మూతతో 15 ఏళ్లలో సంస్థ మూతబడే స్థాయికి పడిపోతుంది
ఇప్పటికే ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిన రెండు గనులను తిరిగి సింగరేణికి ఇవ్వాలి
సింగరేణి ప్రాంతంలోని అన్ని గనులను సంస్థకే కేటాయించేందుకు ప్రధానిని ఒప్పించండి
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు, ఖనిజాల చట్టం (ఎంఎండీఏ)లోని సెక్షన్ 17ఏ(2) కింద సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బొగ్గు గనులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రైవేటు కంపెనీలకు గనులను కేటాయించడం సింగరేణిని కుదేలు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని 2015లో కేంద్రం సవరించడంతో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై అంతకుముందున్న లీజు హక్కులు, అధికారాలను సంస్థ కోల్పోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనతో మాట్లాడారు.
ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోండి...
సింగరేణి ప్రాంతంలోని గనులను సంస్థకే కేటాయించేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి, తాను, ఇతర పారీ్టల నేతలతో కలిసి అఖిలపక్షంగా ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.
గత సర్కారు వేలంలో పాల్గొననివ్వలేదు
చట్టంలోని సెక్షన్ 17ఏ(2) కింద తమకు అతిముఖ్యమైన సత్తుపల్లి–3, శ్రావణపల్లి, పీకే ఓసీ డీప్‌సైడ్, కోయగూడెం బ్లాక్–3 బొగ్గు బ్లాకులను కేటాయించాలని గతంలో సింగరేణి కోరగా వాటిని కూడా కేంద్రం వేలం వేయాలని నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. వేలంలో పాల్గొనైనా ఈ గనులను దక్కించుకోవాల్సిన అవసరముండగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందని విమర్శించారు.
దీంతో సత్తుపల్లి–3 బ్లాక్ అవంతిక మైనింగ్ పరమైందని.. కోయగూడెం బ్లాక్–3 ఆరో మైనింగ్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులను వేలంలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. సత్తుపల్లి–3, కోయగూడెం–3 బ్లాకుల్లో ఇంకా ప్రైవేటు కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేదని, చట్టప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని భట్టి కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా కింద 0.5 శాతాన్ని అదనంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణిని కాపాడేందుకు అవసరమైతే చట్టంలో సవరణలు చేపట్టాలని కోరారు.
మిగిలిన గనులను సింగరేణికే ఇవ్వాలి..
సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి–ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 388 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలిసితీసే అవకాశం ఇవ్వగా సింగరేణి 1,585 మిలియన్ టన్నుల బొగ్గునే వెలికితీసిందన్నారు. ఇంకా 1,422 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను చట్టప్రకారం రిజర్వేషన్ కోటాలో సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి అందజేశారు.
సింగరేణి మూతబడే ప్రమాదం
సింగరేణికి ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులు ఉన్నారని భట్టి చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్‌కాస్ట్ గను లు, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో 5 భూ గర్భ గనులు, 6 ఓపెన్‌కాస్ట్ గనులు మూతపడతాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. 2037–38 నాటికి మరో 5 గనులు మూతబడతాయన్నారు. మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి సంస్థ పడిపోయి చివరకు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నా రు. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, నాయకులుగా ఈ పరిణామాలను ఊహించలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment