రిజర్వేషన్ పద్ధతిలో గనులను కేటాయించాలంటూ కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న భట్టి
సింగరేణిపై డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తులను ఆయన దృష్టికి తీసుకెళతా
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
బొగ్గు గనుల వేలంతో సింగరేణి సంస్థకు నష్టం చేయాలనే ఆలోచన
కేంద్రానికి లేదని స్పష్టికరణ వేలంతోనే ఇతర ప్రభుత్వ బొగ్గు గనుల సంస్థలకు
అధిక లాభాలని వ్యాఖ్య 10వ దఫా బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో కిషన్‌రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.
అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.
ఓపెన్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్ కొరత లేదు..’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు
‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు.
గుదిబండగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు
‘గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.
సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్‌లాల్ మీనా, సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్‌చార్జి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి
భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment