
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవిత నివాసంలో గురువారం దళిత బంధు సాధన సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయి. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలి. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దు... ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు. వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారు.
వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా ఉంది. రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంగా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారు. దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలకు బదులు 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు
ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలి. ధైర్యం ఉంటే 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను డిమాండ్ చేయాలి. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలి. ఎస్సీలకు బడ్జెట్ లో 33 వేల కోట్లు కేటాయించి... కేవలం 9800 కోట్లే ఖర్చు చేశారు. ముందుచూపుతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు కేసీఆర్ చట్టబద్ధత కల్పించాలి. రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదు.. మానవత్వం లేదు. రేవంత్ రెడ్డి ఆలోచన చిన్నది ... చూపు పెద్దవాళ్లపైనే ఉంది. అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదు. అంబేద్కర్ ఆయన వారసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు.
అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలి. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి మేమే అంబేద్కర్ ను గౌరవించుకుంటాం. అంబేద్కర్ ని గౌరవించని ముఖ్యమంత్రి... మన ఆకలిని అర్థం చేసుకుంటారా ? , అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచన. పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటున్నారు. దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్ధేశంతో దళిత బంధును ప్రవేశపెట్టారు. ఎన్నికల కోసం... రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది’ అని కవిత స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment