బొగ్గు తవ్వకాలపై సాధ్యాసాధ్యాలనుపరిశీలించాలన్నడిప్యూటీ సీఎం
లాస్‌వేగాస్‌లోయంత్ర పనితీరును పరిశీలించిన భట్టి
సాక్షి, హైదరాబాద్: కార్మికుల రక్షణ దృష్ట్యా సింగరేణి ప్రస్తుత, భవిష్యత్ గనుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో బొగ్గు తవ్వకాలు జరిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ గనుల ప్రదర్శన (మైనెక్స్)–2024లో భాగంగా ఏర్పాటైన స్టాల్స్‌ను గురువారం ఆయన సందర్శించారు.
శాండ్విక్ కంపెనీ స్టాల్‌లో అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రంతోపాటు వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని వెలుపలి నుంచి ప్రత్యక్షంగా చూస్తూ యంత్రాలను నడపొచ్చని కంపెనీ నిర్వాహకులు వివరించారు. యంత్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు.
గని లోపలికి యంత్రాన్ని పంపించి వెలుపల నుంచే వాటిని ఆపరేట్ చేస్తూ బొగ్గు తవ్వొచ్చని చెప్పారు. భట్టి విక్రమార్క స్వయంగా వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో పనిచేసే యంత్రానికి సంబంధించిన హెడ్‌గేర్‌ను ధరించి దాని పనితీరును పరిశీలించారు. ఈ పరిజ్ఞానం అద్భుతంగా పనిచేస్తోందని, కారి్మకులకు చిన్న ప్రమాదం జరగకుండా బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని అభిప్రాయపడ్డారు.
హూవర్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవాలి
అమెరికాలోని నేవడ, అరిజోన రాష్ట్రాల మధ్య ఉన్న హూవర్ డ్యామ్ జలవిద్యుత్ కేంద్రాన్ని భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడి నీటి వినియోగం, రక్షణ చర్యలు ఆచరించదగినవని ప్రశంసించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికా రులు ఆయనకు ప్రాజెక్టు గురించి వివరించారు. 17 జనరేటర్ యూనిట్ల ద్వారా 2,080 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలతోపాటు సాగునీటి అవసరాలను కూడా హూవర్ డ్యామ్ తీరుస్తుందన్నారు. ఏటా 80 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు.
హువర్ డ్యామ్ జలవిద్యుత్ ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణ మెరుగుదలకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఉపముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ భట్టి వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment