Virtual Reality
-
సింగరేణిలో ‘వర్చువల్ రియాలిటీ’!
సాక్షి, హైదరాబాద్: కార్మికుల రక్షణ దృష్ట్యా సింగరేణి ప్రస్తుత, భవిష్యత్ గనుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో బొగ్గు తవ్వకాలు జరిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అమెరికాలోని లాస్వేగాస్లో జరుగుతున్న అంతర్జాతీయ గనుల ప్రదర్శన (మైనెక్స్)–2024లో భాగంగా ఏర్పాటైన స్టాల్స్‌ను గురువారం ఆయన సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్లో అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రంతోపాటు వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని వెలుపలి నుంచి ప్రత్యక్షంగా చూస్తూ యంత్రాలను నడపొచ్చని కంపెనీ నిర్వాహకులు వివరించారు. యంత్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు. గని లోపలికి యంత్రాన్ని పంపించి వెలుపల నుంచే వాటిని ఆపరేట్ చేస్తూ బొగ్గు తవ్వొచ్చని చెప్పారు. భట్టి విక్రమార్క స్వయంగా వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో పనిచేసే యంత్రానికి సంబంధించిన హెడ్గేర్ను ధరించి దాని పనితీరును పరిశీలించారు. ఈ పరిజ్ఞానం అద్భుతంగా పనిచేస్తోందని, కారి్మకులకు చిన్న ప్రమాదం జరగకుండా బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. హూవర్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవాలి అమెరికాలోని నేవడ, అరిజోన రాష్ట్రాల మధ్య ఉన్న హూవర్ డ్యామ్ జలవిద్యుత్ కేంద్రాన్ని భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడి నీటి వినియోగం, రక్షణ చర్యలు ఆచరించదగినవని ప్రశంసించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికా రులు ఆయనకు ప్రాజెక్టు గురించి వివరించారు. 17 జనరేటర్ యూనిట్ల ద్వారా 2,080 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలతోపాటు సాగునీటి అవసరాలను కూడా హూవర్ డ్యామ్ తీరుస్తుందన్నారు. ఏటా 80 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. హువర్ డ్యామ్ జలవిద్యుత్ ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణ మెరుగుదలకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఉపముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ భట్టి వెంట ఉన్నారు. -
వర్చువల్ రియాల్టీలో దాడి.. తప్పని బాధ!
కాలం మారింది. టెక్నాలజీ మారుతోంది. దాంతో నేరాల తీరు కూడా మారుతోంది. ఈరోజు మనం ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని ఒక నేరం గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ లో 16 సంవత్సరాల వయసున్న ఒక బాలిక అవతార్ పై మెటావర్స్ లో గ్యాంగ్ రేప్ చేశారు. అంటే ఆమెపై భౌతికంగా ఎలాంటి దాడీ జరగలేదు, వర్చువల్ రియాలిటీలో జరిగింది. కానీ ఆమె నిజ జీవితంలో అత్యాచార బాధితులు అనుభవించే మానసిక, భావోద్వేగ వేదననే అనుభవిస్తోంది. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్చువల్ రియాలిటీ గురించి, దాని లాభనష్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? వర్చువల్ రియాలిటీ (VR) అంటే... నిజజీవితంలో లభించే అనుభవాన్ని కంప్యూటర్ వాతావరణంలో అందించే సాంకేతికత. ఫేస్బుక్ సంస్థ మెటా ఇప్పుడు మెటావర్స్ పేరుతో అలాంటి టెక్నాలజీని అందరికీ అందించే ప్రయత్నంలో ఉంది. దీనివల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. అందువల్ల దీన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించడం ముఖ్యం. నిజంగా దాడి జరగకపోయినా మానసిక క్షోభ ఎందుకు? అది సరే.. ఆ అమ్మాయిపై ఎలాంటి దాడి జరగకపోయినా మానసిక వేదన కలగడానికి కారణమేమిటనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా. మీరో చిన్న పనిచేయండి. కళ్లు మూసుకుని, చేతిలో నిమ్మకాయ ఉన్నట్లు ఊహించండి. దాని వాసన చూస్తున్నట్లుగా, టేస్ట్ చేస్తున్నట్లుగా ఊహించండి. మీ నోటిలో లాలాజలం ఊరిందా? మీరు నిమ్మకాయ తినకుండానే లాలాజలం ఎలా ఊరింది? వర్చువల్ రియాలిటీ అనుభవం కూడా అలాంటిదే. ► నిజానుభవం లాంటి అనుభవాన్ని కంప్యూటర్ ప్రపంచంలో అందించడమే వర్చువల్ రియాలిటీ లక్ష్యం. వినియోగదారులు తాము నిజమైన వాతావరణంలో ఉన్నట్లు భావించేలా చేయడం. అందువల్ల మెదడు వర్చువల్ అనుభవాలను వాస్తవంగా భావిస్తుంది. ► భౌతిక ప్రపంచంలో లేదా వర్చువల్ రియాలిటీలో మనం సంఘటనలను అనుభవించినప్పుడు, మన మెదడు వివిధ నాడీ మార్గాల ద్వారా సమాచారాన్ని ఒకేలా ప్రాసెస్ చేస్తుంది. అందువల్ల నిజమైన లేదా వర్చువల్ అనుభవాలకు సమానంగా ప్రతిస్పందిస్తుంది. ► ఒక సంఘటన వల్ల జరిగే నష్టాన్నికేవలం శారీరక హాని ద్వారా మాత్రమే నిర్ణయించరు. దానికి మించిన ఎమోషనల్ పెయిన్ ఉండవచ్చు, ముఖ్యంగా అత్యాచారం లాంటి దుర్ఘటనల్లో. వర్చువల్ రియాలిటీలో జరిగిన అత్యాచారాన్ని వాస్తవమైనట్లుగా మెదడు ప్రాసెస్ చేసిందా కాబట్టే ఆ అమ్మాయి నిజమైన మానసిక క్షోభకు గురయ్యింది. అత్యాచారం జరగకపోయినా, ఎమోషనల్ పెయిన్ మాత్రం నిజం. ► అలాగని అందరూ అలాగే స్పందించాలని లేదు. వ్యక్తిత్వం, గత అనుభవాలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలు వ్యక్తి వర్చువల్ పరిస్థితులను ఎలా గ్రహించి ప్రతిస్పందిస్తారో ప్రభావితం చేయవచ్చు. కాపాడుకోవడం ఎలా? ► మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఇకపై నిజ జీవితంలోనే కాదు వర్చువల్ రియాలిటీలో కూడా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ► హానికరమైన సాఫ్ట్వేర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అధికారిక స్టోర్లు నుండి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేయండి. ► సాఫ్ట్వేర్ హార్డ్‌వేర్‌ను, అప్డేట్ చేస్తూ ఉండండం వల్ల బగ్స్ నుంచి తప్పించుకోవచ్చు. ► వర్చువల్ రియాలిటీలో మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి. మీ అసలు పేరు, చిరునామా లేదా ఆర్థిక సమాచారం వంటి సున్నితమైన డేటాను షేర్ చేసుకోవద్దు. ► మీ VR ఖాతాల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి. ► వాస్తవ ప్రపంచంలో లానే VRలో కూడా అపరిచితులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ► వర్చువల్ ప్రపంచంలో ఎదురైన వ్యక్తులను నిజ జీవితంలో కలవకుండా ఉండండి. ► మీ పిల్లలు VRని ఉపయోగిస్తుంటే, వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించండి. వయస్సుకి తగిన కంటెంట్ పరిమితులను సెట్ చేయండి. ► VR ప్లాట్‌ఫారమ్ అందించిన పేరంటల్ కంట్రోల్స్ ను ఉపయోగించండి. ► VR ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా అనుమానాస్పదంగా, అనుచితంగా కనిపిస్తే వెంటనే బ్లాక్ చేయండి, ప్లాట్ ఫారమ్ కు రిపోర్ట్ చేయండి. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066 psy.vishesh@gmail.com -
‘నెట్’స్పీడైతే.. బోధన ‘వీఆర్’అవుద్ది!
సాక్షి, హైదరాబాద్: మనుషులుగానీ, వస్తువులుగానీ మనం దగ్గరుండి చూసినట్టుగా.. అంతా మన కళ్ల ముందే ఉన్నట్టుగా అనిపించే సాంకేతికతే ‘వర్చువల్ రియాలిటీ (వీఆర్)’. ప్రత్యేకమైన వీఆర్ హెడ్‌సెట్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేసి, వీడియోలను ప్లే చేయడం ద్వారా అనుభూతిని పొందొచ్చు. ఈ సాంకేతికతతో విద్యా రంగంలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఉదాహరణకు ఒక విత్తనం మొలకెత్తడం నుంచి పెద్ద చెట్టుగా ఎదిగేదాకా కీలకమైన దశలన్నింటినీ కొన్ని నిమిషాల్లోనే స్పష్టంగా అవగాహన కలిగేలా ‘వీఆర్’వీడియోలను విద్యార్థులకు చూపించవచ్చు. ఇందుకోసమే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వీఆర్’బోధన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ స్కూళ్లలో సరైన కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ లేకపోవడం సమస్యగా మారింది. పరిశోధనలపై ఆసక్తి కలిగేలా.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాఠశాలల్లో ‘వర్చువల్ రియాలిటీ, త్రీడీ’పద్ధతుల్లో బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు వెచ్చించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థుల్లో ఆలోచనను రేకెత్తించేలా, క్లిష్టమైన అంశాలు కూడా అత్యంత సులభంగా అర్థమయ్యేలా బోధన కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా రూపొందించింది. విద్యార్థి స్థాయిలోనే పరిశోధనల వైపు ఆసక్తి కలిగించేలా, పూర్తి అవగాహన వచ్చేలా అంశాలను ఎంపిక చేసింది. ఈ మేరకు 2023–24 నుంచే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో ‘వీఆర్’ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించి ఇటీవల స్కూళ్లలో అధ్యయనం చేసింది. పాతకంప్యూటర్లు.. స్లో ఇంటర్నెట్.. ‘వీఆర్–త్రీడీ’వంటి ఆసక్తికర బోధన పద్ధతులను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా మౌలిక వసతుల కొరత ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం అరకొరగా ఉందని.. వాడే కంప్యూటర్లు కూడా పాతవని, వాటితో వీఆర్ త్రీడీ పాఠాలు చెప్పడం కష్టమని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఒక్కో పాఠశాలకు 20 హెడ్సెట్ల చొప్పున ఐదు బడుల్లో దీన్ని తొలుత ప్రారంభించాలని అనుకున్నారు. కానీ బోధనకు సంబంధించిన వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలంటే సమస్య ఏర్పడుతోందని గుర్తించారు. చాలా స్కూళ్లలో ఇప్పటికీ కనీసం 4జీ నెట్ కూడా లేదు. పాత కంప్యూటర్లు ఎక్కువ పరిమాణంలో ఉండే వీఆర్–త్రీడీ వీడియోలను సరిగా ప్లే చేయలేకపోతున్నాయి. ఇది పిల్లల్లో విసుగు కలిగిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలినట్టు వివరిస్తున్నారు. ఎక్కువ సామర్థ్యమున్న, వేగంగా పనిచేసే కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ ఉంటే తప్ప ‘వీఆర్’బోధన అంశంలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని.. సానుకూల స్పందన వస్తే విద్యార్థులకు అద్భుతమైన బోధన అందుతుందని అధికారులు చెప్తున్నారు. -
ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే హెడ్సెట్..
ఐపీఎల్ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే జియో డైవ్ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్ జియో సినిమా (JioCinema) యాప్‌లో ఐపీల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్ హెడ్‌సెట్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్‌సెట్‌ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జియోడైవ్ హెడ్సెట్ ధర రూ. 1,299. జియో మార్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్ హెడ్‌సెట్‌ను రిటర్న్ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది. జియోడైవ్ వీఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్, iOS ఫోన్లకు సపోర్ట్ లెన్స్ ఫోకస్, ఫైన్ ట్యూన్ అడ్జెస్ట్మెంట్ కోసం ఏర్పాటు. హెడ్‌సెట్‌ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్ Android 9+, iOS 15+కి సపోర్ట్ ఉపయోగించడం ఎలా? బాక్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్ (JioImmerse) యాప్‌ను ఇన్స్టాల్ చేయండి సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్వర్క్కి కనెక్ట్ అయిఉండాలి. జియోడైవ్ (JioDive) ఆప్షన్‌ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్ చేయండి హెడ్సెట్లో ఫ్రంట్ కవర్ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య ఫోన్‌ను పెట్టిన తర్వాత ఫ్రంట్ కవర్‌ను మూసివేయండి హెడ్‌సెట్‌ను పెట్టకుని స్ట్రాప్స్‌ను సరిచేసుకోండి ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్మెంట్ వీల్స్‌ను సరిచేయండి ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. Bringing you a stadium-like experience at home with #JioDive. - Watch cricket in 360 immersive view - Enjoy #TATAIPLonJioCinema on a 100-inch virtual screen - Experience #360cricket from multiple camera angles Buy now https://t.co/1azFVIwqfR#EnterANewReality #IPL2023 pic.twitter.com/PxplF0SAz9 — JioDive (@jiodiveofficial) April 30, 2023 -
ప్రాణం లేని ఉద్యోగి .. జీతం రూ. 11లక్షల ప్యాకేజీ
ఆశ్చర్యపోకండి.. ఆటోమేషన్, ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగంగా పుణికి పుచ్చుకుంటున్న లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా రోబోలు హ్యూమన్ వర్క్‌ర్ల స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్ సపోర్ట్, ఎంటర్టైన్మెంట్ సెక్టార్‌తో సహా వివిధ రంగాలలో 'వర్చువల్ వర్కర్ల' కోసం వ్యాపార వేత్తలు , కంపెనీలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసే ధోరణి చైనాలో ఎక్కుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పలు కంపెనీలు యానిమేషన్, సౌండ్ టెక్, మెషిన్ లెర్నింగ్ కలయికతో లైవ్ స్ట్రీమ్‌లో పాడటం, ఇంటరాక్ట్ అయ్యేలా వర్చువల్ పీపుల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడీ ఈ ప్రాణం లేని ఉద్యోగులకు చైనాలో యమ డిమాండ్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. బైదు కోసం చైనా ఇంటర్నెట్ సెర్చింగ్ దిగ్గజం బైదు క్లయింట్ల కోసం పని చేస్తున్న వర్చువల్ పీపుల్ ఉద్యోగుల సంఖ్య గత సంవత్సరం కంటే రెట్టింపు అయ్యింది. బైదు వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫర్మార్లతో కూడిన ప్రాజెక్ట్‌లపై పని చేస్తోంది. ఆ ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఈ వర్చువల్ వర్కర్లకు సంవత్సరానికి మినిమమ్ $2,800 (రూ. 2,32,045) నుండి అత్యధికంగా $14,300 (రూ. 11,84,845) వరకు చెల్లిస్తుంది. ఈ సందర్భంగా బైదు వర్చువల్ పీపుల్, రోబోటిక్స్ విభాగం అధిపతి లి షియాన్ మాట్లాడుతూ.. వర్చువల్ పీపుల్ నిర్వహించే ప్రాజెక్ట్‌లలో స్టేట్ మీడియా, లోకల్ టూరిజం బోర్డ్‌లు, ఆర్థిక సేవల వ్యాపారాలు ఉన్నాయి. సాంకేతికత అభివృద్ధి చెంది ఈ వర్చువల్ ఉద్యోగుల్ని ఉపయోగించడంతో గతేడాదితో పోలిస్తే ఖర్చులు దాదాపు 80 శాతం తగ్గాయని అన్నారు. 2025 నాటికి వర్చువల్ పర్సన్ ఇండస్ట్రీ మొత్తం ఏటా 50శాతం వృద్ధి చెందుతుందని షియాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్చువల్ ఉద్యోగుల కోసం చైనా ఆరాటం వర్చువల్ వ్యక్తులను తయారు చేసేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 2025 నాటికి మునిసిపల్ వర్చువల్ పర్సన్స్ మార్కెట్ విలువను 50 బిలియన్ యువాన్లకు పెంచడానికి బీజింగ్ ప్రభుత్వం వ్యూహాన్ని ఆవిష్కరించింది. చైనాలోని 45 శాతం మంది ప్రకటనదారులు తాము వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ పనితీరును స్పాన్సర్ చేస్తామని, 2023లో బ్రాండ్ ఈవెంట్లు కోసం వర్చువల్ పీపుల్స్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు. చదవండి👉 ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’ చదవండి👉 ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది! -
నవతరం నయా ట్రెండ్ ‘వీ’ ట్యూబింగ్.. ఇంతకి ఏంటది?
మన దేశంలో టాప్ యూట్యూబర్స్ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. జపాన్‌లో మంచి ఆదరణ ఉన్న వీట్యూబింగ్ (వర్చువల్ యూట్యూబ్ స్టార్స్) మన దేశంలోకి ప్రవేశించింది. పాపులర్ కావడానికి రెడీగా ఉంది... వెండిరంగు జుట్టు, వెరైటీ కళ్లద్దాలతో ఆకట్టుకునే జాక్నిఎక్స్ తన యూట్యూబ్ చానల్లో పాపులర్ వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. జాక్నిఎక్స్కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతడి ఆటను, మాటను అమితంగా ఇష్టపడుతుంటారు. నిజానికి జాక్నిఎక్స్ నిజం కాదు. దక్షిణాదికి చెందిక ఒక స్టూడెంట్ సృష్టించిన డిజిటల్ అవతార్! మన దేశంలో 90కి పైగా వీట్యూబ్ అవతార్స్ ఉన్నాయి. సాధారణంగా వీట్యూబ్ అవతార్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ ఫీచర్స్‌తో కనిపిస్తుంటాయి. ‘వీట్యూబింగ్’ అనేది 2016లో జపాన్‌కు పరిచయమైంది. స్ట్రీమ్గేమ్స్, ఇంటర్నెట్ ట్రెండ్స్, మ్యూజిక్, ఆర్ట్...ఇలా రకరకాల విభాగాల్లో వీట్యూబ్ అవతార్స్ వీక్షకులను వినోదపరుస్తున్నాయి. ‘వీట్యూబర్స్’ అనే పదం జపాన్‌లోనే పుట్టింది. రికు తజుమితో జపాన్‌లో ‘వీట్యూబర్స్’ ట్రెండ్ అగ్రస్థాయికి చేరుకుంది. 26 సంవత్సరాల రికు తజుమి జపాన్‌లోని యంగెస్ట్ బిలియనీర్లలో ఒకరు కావడానికి కారణం ‘ఎనీ కలర్’ అనే స్టార్టప్. యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే 21 సంవత్సరాల వయసులో ఇచికర (శూన్యం నుంచి) అనే ఎంటర్టైన్మెంట్ స్టార్టప్‌ను మొదలు పెట్టాడు రికు. ఆ తరువాత దీని పేరును ‘ఎనీ కలర్’గా మార్చాడు. వీట్యూబర్స్ ప్రపంచంలో ‘ఎనీ కలర్’ అగ్రస్థానంలోకి దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘ఏ న్యూ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్’ అనే నినాదంతో నిజజీవితానికి చెందిన వందమంది వర్చువల్ క్యారెక్టర్స్‌ను ఇది సృష్టించింది. యూజర్స్, క్రియేటర్స్‌కు మధ్య సరిహద్దులు లేకుండా చేయడమే తన విధానం అని చెబుతోంది. ఎన్నో వీట్యూబర్స్ ఏజెన్సీలకు ‘ఎనీ కలర్’ మాతృసంస్థగా ఉంది. ‘కోవిడ్ సమయంలో మన దేశంలో ఊపందుకున్న వర్చువల్ యూట్యూబర్ ధోరణి మెయిన్‌స్ట్రీమ్ పాపులారిటీకి దగ్గరలో ఉంది’ అంటున్నాడు వీట్యూబర్ టాలెంట్ ఏజెన్సీ ‘ప్రాజెక్ట్ స్టార్‌స్కేప్’ ఫౌండర్ వేణు జీ జోషి. ‘వీట్యూబింగ్ అనేది ప్రైవసీని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. మీ ముఖం బాగాలేదు, మీ గొంతు బాగలేదు... వంటి విషపూరితమైన ట్రోలింగ్ నుంచి బయటపడవచ్చు. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఏమో అనే సంశయం లేకుండా ధైర్యంగా కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు’ అంటుంది అసలు పేరే ఏమిటో తెలియని దిల్లీకి చెందిన వర్చువల్ అవతార్ సకుర. వర్చువల్ అవతార్స్ పరిచయం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అవతార్ పరిచయం ఇలా ఉంటుంది: ‘రెండు వందల సంవత్సరాల వయసు ఉన్న ఈ బాలికకు అపారమైన మాంత్రిక శక్తులు ఉన్నాయి’ చాలామంది మోడల్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తుండగా కొందరు మాత్రం పురాణాలలోని చిత్ర విచిత్ర పాత్రలను ఎంచుకుంటున్నారు. 19 సంవత్సరాల వీట్యూబర్ ‘మియో’ సగం మనిషి, సగం భూతంతో కూడిన అవతార్‌ను సృష్టించుకుంది. కొందరు తమ అవతార్లకు తామే గొంతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం గొంతులో వైవిధ్యం కోసం వాయిస్ మాడ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇండియన్ వీట్యూబ్ కమ్యూనిటీస్ కోసం రెడిట్‌లో ప్రత్యేకమైన పేజీ నిర్వహిస్తున్న హర్ష్ ‘వీట్యూబర్స్’కు వీరాభిమాని. ‘వీట్యూబర్ను చూస్తే స్నేహితుడిని చూసినట్లుగానే ఉంటుంది. వారి షోలో భాగమైతే రియాలిటీ షోలో భాగమైనట్లు అనిపిస్తుంది’ అంటున్నాడు హర్ష్. అభిమానం, విశ్లేషణ సంగతి ఎలా ఉన్నా అప్‌కమింగ్ వీట్యూబర్స్ కోసం ‘వర్చువలిజం’లాంటి కంపెనీలు వచ్చాయి. వీట్యూబర్గా మారాలని, తమను తాము నిరూపించుకోవాలనే ఆసక్తి యూత్‌లో పెరిగింది. ఇదీ చదవండి: చైతన్యపథం: గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’ -
వామ్మో.. అణుబాంబు పేలితే ఇట్లా ఉంటదా?
వైరల్: అణు యుద్ధం రాకూడదనేది ప్రతీ ఒక్కరి ప్రార్థన. ఎందుకంటే ఆ పేలుడు తీవ్రత అంత దుష్పరిణామాలకు దారి తీస్తుంది కాబట్టి. అణు బాంబు పడితే ఆ ప్రభావం ఎలా ఉంటదో మనకు తెలియంది కాదు. జపాన్ నగరాలు హీరోషిమా, నాగసాకిలు రెండో ప్రపంచ యుద్ధసమయంలో న్యూక్లియర్ బాంబులు పడి.. ఎంతో దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయో ప్రపంచం కళ్లారా వీక్షించింది. అయితే ఆ పేలుడు తీవ్రతను ప్రత్యక్షంగా చూడాలని ఉందా? ప్రాక్టికల్‌గా సాధ్యంకానీ ఈ అంశాన్ని వర్చువల్‌గా చూసేందుకు వీలయ్యింది. ఆహ్లాదంగా ఉన్న ఓ బీచ్‌లో హఠాత్తుగా అణు బాంబు పేలితే ఎలా ఉంటుంది? ఆ అనుభవమే అందిస్తోంది ఈ వీడియో.. అదేదో సినిమాలో వర్ణించినట్లు.. అణు బాంబు పడితే చెట్టు-చేమ బుగ్గిపాలయ్యాయి. నింగి మధ్యలో భారీ పొగ, ధూళి అలుముకున్నాయి. ఆ దెబ్బకు ఆకాశం రంగు మారిపోయింది. వర్చువల్‌గా న్యూక్లియర్ పేలుడుకు సంబంధించిన ఈ వీడియో పాతదే అయినా.. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ, అణు యుద్ధ బెదిరింపుల నేపథ్యంలో మళ్లీ రెడ్డిట్ వెబ్సైట్ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. -
వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా
మీకు వ్లాగులు అంటే ఏమిటో తెలిసే ఉంటుంది.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్షర్ల గురించి కూడా వినే ఉంటారు. కానీ...వీట్యూబర్లు ఎవరో తెలుసా. దేశంలో వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏమిటో విన్నారా. వెరైటీ పేరుతో పిచ్చి ప్రాంకుల కంటే బోలెడంత ఉపయోగకరమైన ఈ కొత్త ట్రెండ్ ఏమిటో చూసేయండి మరి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్చువల్ యూట్యూబర్లే ఈ వీట్యూబర్లు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ కోసం విపరీతమైన కరువు ఏర్పడింది. ఏదైనా విషయాన్ని కొత్తగా ఎలా చెప్పాలన్న ప్రయత్నంలో ఈ వీట్యూబర్ల వ్యవహారం బాగా ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి ప్రపంచంలో మొట్టమొదట వర్చువల్ యూట్యూబర్ పదాన్ని వాడింది 2016లోనే. జపాన్‌కు చెందిన ‘కైజునా ఏఐ’ మొదలు పెట్టిన ఈ ట్రెండ్ అక్కడ బాగా ప్రజాదరణ చూరగొంది. స్థానికంగా అనేక కంపెనీల మార్కెటింగ్ కూ ఈ వీట్యూబర్లు ఉపయోగపడుతున్నారు. లైవ్ రికార్డింగ్ విషయంలో జపాన్ వీట్యూబర్లు ఇప్పటికే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. ఆరేళ్ల క్రితం జపాన్‌లో మొదలైన ఈ వీట్యూబర్ల వ్యవహారం గత రెండేళ్లలో మరింత జోరందుకుంది. భారత్‌లోనూ యాపిల్ మెమోజీ సాయంతో వర్చువల్ అవతార్లను సృష్టించుకొని వాటి సాయంతోనే రకరకాల అంశాలపై ఈ వీట్యూబర్లు వీడియోలు చేస్తున్నారు. యాపిల్ ఐఓఎస్ 12, ఆ తరువాత వచ్చిన యాపిల్ ఫోన్లు లేదా ఐప్యాడ్ ఓఎస్‌లతో ఈ మెమోజీలను సృష్టించడం చాలా సులువు. మన పర్సనాలిటీ, మూడ్‌లకు అనుగుణంగా వర్చువల్ అవతార్లను తయారు చేసుకొని ఫేస్‌టైమ్‌లో మెసేజ్‌లు పంపుకోవచ్చు. తగిన ఐఫోన్, ఐప్యాడ్లు ఉంటే మెమోజీల్లో యానిమేషన్ కూడా చేయవచ్చు. చదవండి: బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు ఫన్, ఫిల్మీమోజీల క్రేజ్... భారత వీట్యూబర్లలో ప్రస్తుతం బాగా క్రేజ్ ఉన్న వీట్యూబ్ చానళ్లలో ఫన్‌మోజీ, ఫిల్మీ మోజీలు రెండు. చిర్రా కార్తీక్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ రెండు చానళ్లలో ఒకటి పేరులో ఉన్నట్లే సినిమాల గురించి మాట్లాడితే... రెండోది చాలా సరదా అంశాలపై వీడియోలు తయారు చేస్తుంది. యాపిల్ కంపెనీ అని మోజీ మెమోజీలను మార్కెట్లో విడుదల చేసినప్పుడు కార్తీక్‌రెడ్డి తన యానిమేషన్ ఇన్స్టిట్యూట్లోని కొందరు విద్యార్థుల సాయంతో ఈ చానళ్లను మొదలుపెట్టారు. పోటుగాడు, ఈమోజీ మామ, ఫిల్మీ ఫన్ అనిమోజీ, సూపర్ మోజీ పేర్లతో మరికొందరు వీట్యూబర్లు తాజాగా రంగంలోకి దిగారు. -
నియో మిలీనియల్స్
బ్యాంకుల గురించి సామాజిక మాధ్యమాల్లో బోలెడు జోక్స్, మీమ్స్ కనిపిస్తుంటాయి. మచ్చుకు కొన్ని... ‘ఈరోజు మీకు బ్యాంకులో పని ఉందా? అయితే ఇవి మీతో పాటు తెచ్చుకోవడం అనివార్యం... 1. ఐడీ ప్రూఫ్, 2. లంచ్ బాక్స్, 3.ప్లేయింగ్ కార్డ్స్ 4. డిన్నర్ సరంజామా, 5.బెడ్‌షీట్, 6. మెత్తని దిండు, 7. బ్లాంకెట్ 8.ఫోన్ చార్జర్... వీటన్నికంటే ముఖ్యమైనది బోలెడు ఓపిక’ ‘ఈ అమ్మాయి పేరు సువర్ణముఖి. బ్యాంకుకు వెళ్లే ముందు ఎంత ఫ్రెష్‌గా ఉందో చూడండి. బ్యాంకుకు వెళ్లి వచ్చిన తరువాత చంద్రముఖిగా మారిన సువర్ణముఖి రూపం ఇది’ ‘ఒక బ్యాంకు ఉద్యోగి వాచ్‌లో టైమ్ స్థానంలో లంచ్, లంచ్, లంచ్... అని ఉంటుంది. గడియారం ముళ్లు వాటి మీదే తిరుగుతుంటాయి’ ఇవి అతిశయోక్తితో కూడిన జోక్స్ అయినప్పటికీ, సంప్రదాయ బ్యాంకులకు వెళ్లడానికి నవతరంలో ఎక్కువమంది అంతగా ఆసక్తి చూపడం లేదు. దీని కారణాలలో క్యూ, దూరభారంలాంటివి ఉన్నాయి. బ్యాంకులకు వెళ్లడానికి ఇష్టపడని మిలీనియల్స్ నియో బ్యాంకులపై ఆసక్తి చూపుతున్నారు. ఏమిటీ నియో బ్యాంకులు? నియో బ్యాంకులు అనేవి వర్చువల్ బ్యాంక్స్. వీటికి ఫిజికల్ బ్రాంచ్‌లు ఉండవు. అయితే ఫిజికల్ బ్రాంచ్‌లు ఉన్న ప్రముఖ బ్యాంకులతో వీటికి భాగస్వామ్యం ఉంటుంది. ‘క్యూ’ కంటే ‘క్విక్’ విధానానికి ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఈ బ్యాంకులను అమితంగా ఇష్టపడుతుంది. సంప్రదాయ బ్యాంకులకు ‘విశ్వసనీయత’ అనేది గట్టి పునాది అయినప్పటికీ, వీటితో పోల్చితే నియో బ్యాంకులు రకరకాల ప్రత్యా మ్నాయ అవకాశాలు కల్పిస్తున్నాయి. మనీ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి మరో ప్లస్ పాయింట్‌గా మారింది. వీటి ద్వారా తమ ఖర్చులు, పొదుపు నకు సంబంధించి స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశం యూజర్‌కు కలుగుతుంది. బడ్జెటింగ్, సేవింగ్, ఇన్వెస్టింగ్, రుణ నిర్వహణకు సంబంధించి సులభంగా గ్రహించగలిగే ఆర్థిక సలహాలను బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కోరుకుంటున్నారు మిలీనియల్స్. వారి అంచనాలు సంప్రదాయ బ్యాంకులు అందుకోలేక పోవడం కూడా నియో బ్యాంకుల వైపు ఆకర్షితులు కావడానికి ఒక కారణం. రోబోటిక్స్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ సమయంలో సేవలు అందిస్తున్నాయి నియో బ్యాంకులు. తక్కువ ఛార్జీలు, సులభంగా ఖాతా ప్రారంభించే అవకాశం ఉండడం, రుణాలు, బిల్లులు... మొదలైన చెల్లింపులను గుర్తు చేయడానికి రిమైండర్ సదుపాయం... ఇలాంటివి నియో విజయానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. రకరకాల ఫైనాన్షియల్ సర్వీస్‌లను నియో బ్యాంకులు ఒకే గొడుగు కిందికి తీసుకురావడం టెక్–సావి మిలీనియల్స్‌ను ఆకట్టుకునే అంశం. రేజర్ పే ఎక్స్, జూపిటర్, ఓపెన్... మొదలైనవి మన దేశంలోని కొన్ని నియో బ్యాంకులు. గూగుల్ పే క్రియేటర్స్ సుజిత్ నారాయణ్, సుమిత్‌లు మిలీనియల్స్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ‘ఫై’ అనే నియోబ్యాంకును ప్రారంభించారు. ఇది ఫెడరల్ బ్యాంక్ భాగస్వామ్యంతో పనిచేస్తుంది. మన దేశంలో నియో బ్యాంక్ స్టార్టప్‌ల సంఖ్య పెరగడానికి కారణం మిలీనియల్స్ ఆదరణ. స్థూలంగా చెప్పాలంటే... నియో బ్యాంకింగ్ సెగ్మెంట్లో మిలీనియల్స్ అతి ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకున్నారు. అయితే నియో బ్యాంకుల మధ్య కూడా గట్టి పోటీ ఉంది. వాటి పనితీరు ఆధారంగా రేటింగ్స్ ఉంటున్నాయి. డిజైన్ లాంగ్వేజ్ అనేది వాటి ఆదరణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. -
దేశంలో తొలిసారిగా.. కొత్త రకం టెస్ట్‌డ్రైవ్
ముంబై: ఆటో టెక్ స్టార్టప్ సంస్థ కార్జ్‌సోడాట్‌కామ్ తాజాగా హర్యానాలోని కర్నాల్‌లో వర్చువల్ రియాలిటీ (వీఆర్) ఆధారిత ఎక్స్పీరియన్స్ స్టోర్ ప్రారంభించింది. దేశీయంగా ఈ తరహా స్టోర్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. 25 కార్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మెట్రోయేతర నగరాల్లోకి మరింతగా విస్తరించేందుకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్లు మరిన్ని ప్రారంభించనున్నట్లు వివరించింది. సాధారణంగా ప్రీ–ఓన్డ్ కార్లను కస్టమర్లు స్వయంగా వెళ్లి చూసి, షార్ట్‌లిస్ట్ చేసి, కొనుక్కునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయని కంపెనీ వ్యవస్థాపక సీఈవో వైభవ్ శర్మ తెలిపారు. వీఆర్ సాంకేతికతతో తక్కువ సమయంలోనే మరిన్ని ఉత్పత్తులను చూసేందుకు కస్టమర్లకు వీలుంటుందని పేర్కొన్నారు. దేశీ ఆటోమొబైల్ పరిశ్రమలో వీఆర్ టెక్నాలజీని మరింత వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా ఆటోమోటివ్ పరిశ్రమలో వీఆర్ మార్కెట్ ప్రస్తుతం 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా 2027 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నట్లు శర్మ చెప్పారు. కార్జ్‌సోడాట్‌కామ్.. గుర్గావ్లో అత్యంత భారీ స్థాయిలో ప్రీ–ఓన్డ్ కార్ల తొలి సూపర్‌స్టోర్ నిర్మిస్తోంది. ఇందులో 300 పైగా కార్లకు పార్కింగ్ ఉంటుంది. -
పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని..’!!
Woman claims she was virtually groped in Meta VR metaverse: లైంగిక వేధింపులు-మీటూ ఉద్యమం ద్వారా విస్తృత చర్చ జరిగిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదనే విషయంపై స్పష్టత వచ్చింది కూడా మీటూ ద్వారానే!. అయితే వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఇలాంటి అనుభవాలు తప్పవని, పైగా అవి మరింత ఆందోళనకరంగా ఉంటాయనే విషయం తాజాగా ఓ ఘటన ద్వారా రుజువైంది. వర్చువల్రియాలిటీ (VR), అగుమెంటెడ్ రియాలిటీల(AR)ల సంకరణ కలయికగా రాబోతున్న టెక్నాలజీనే ‘మెటావర్స్’. ఇదొక ఒక 3డీ వర్చువల్ ప్రపంచం. వ్యక్తిగతంగా పక్కపక్కన లేకున్నా.. భౌతిక ప్రపంచంలో చేయలేని పనులను కలిసి చేయగలగడం మెటావర్స్ ప్రపంచ ప్రత్యేకత. వాస్తవానికి కార్పొరేట్ రంగం కోసం పుట్టుకొచ్చిన ఈ టెక్నాలజీని.. దాదాపు అన్నింటా అన్వయింపజేయాలని టెక్ దిగ్గజాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో మెటావర్స్ యాప్ బేటా వెర్షన్ టెస్టింగ్‌లో భాగంగా మెటా కంపెనీ(ఫేస్బుక్) హోరిజోన్ వరల్డ్స్ ఫీచర్‌ను పరిశీలిస్తోంది. ఇందులో పని చేస్తున్న ఓ టెస్టర్‌కు పాపం చేదు అనుభవం ఎదురైంది. మెటా కంపెనీలో పని చేస్తున్న ఆ టెస్టర్ అవతార్(కార్టూన్ తరహా రూపం)ను ఓ ఆగంతకుడు బలవంతంగా వాటేసుకున్నాడట. అక్కడితో ఆగకుండా అసభ్యంగా ప్రవర్తించాడట. అఘాయిత్యానికి పాల్పడే సమయంలో తాను భరించలేక.. వెంటనే హెడ్‌సెట్‌ను తొలగించినట్లు ఆమె వెల్లడించింది. పైగా ఈ ఘటనపై ఫేస్బుక్ గ్రూప్‌కి ఆమె రిపోర్ట్ చేయడంతో పాటు వర్జ్ వేదికగా ఆ చేదు అనుభవాన్ని పంచుకుంది. ‘సాధారణ ఇంటర్నెట్-సోషల్ మీడియాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడమే దారుణం. అలాంటిది వర్చువల్ రియాలిటీలో ఇలాంటి ఘటనలు మరింత ప్రమాదకరమని నా అనుభవంతో రుజువైంది. ఘటన జరగడం కంటే.. ఆ ఘటనకు చాలామంది మద్దతు ఇవ్వడం నన్ను ఇంకా బాధించింది. నన్ను ఒంటరిని చేశారనే భావనలోకి నెట్టేసింది ఈ అనుభవం’ అంటూ ఆమె వర్జ్ బ్లాగ్‌లో రాసుకొచ్చింది. దీనిపై టెక్ నిపుణులు స్పందిస్తున్నారు. మెటా ప్రపంచంలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఘటనే కిందటి నెల 26నే చోటు చేసుకుందట. అయితే విమర్శల నేపథ్యంలో ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించింది మెటా. టెస్టర్పై జరిగిన వర్చువల్ దాడిని ఖండిస్తూ.. అపరిచితులతో జాగ్రత్త ఉండాలంటూ యూజర్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి వేధింపులను తట్టుకునేందుకు ‘మెటా సేఫ్‌జోన్ ఫీచర్’ సరిపోదనే అభిప్రాయాన్ని తామూ అంగీకరిస్తున్నట్లు పేర్కొంది కంపెనీ. అయితే ఈ విషయంలో యూజర్లకు తగిన శిక్షణ అవసరమని, వేధింపులు ఎదురైనప్పుడు అవతలి వాళ్లను బ్లాక్ చేయగలిగేలా అవగాహన ఉండాలని, ఇందుకు సంబంధించి ప్రణాళికను తాము రూపొందిస్తామని హరిజోన్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ శర్మ వెల్లడించారు. 2020 ప్యూ రీసెర్చ్ పోల్ ప్రకారం.. ఆన్లైన్ వేధింపుల ఘటనలు(ఆడామగా తేడా లేకుండా బాధితులు) 25 శాతం పైగా పెరిగాయి. భౌతిక దాడుల బెదిరింపులు, వెంబడించడం, పదే పదే వేధింపులకు గురి చేయడం లాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ ఉదంతాలు మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇందులో వీఆర్ సంబంధిత వేధింపులు సైతం ఉండడం కొసమెరుపు. చదవండి: టెక్ దిగ్గజం మెటా(ఫేస్బుక్)కు భారీ జరిమానా! -
మీ పిచ్చి తగలెయ్యా..? డబ్బులుంటే చాలు..చార్మినార్‌ను ఈఫిల్ టవర్‌ను కొనేస్తారు
మీ పిచ్చి తగలెయ్యా..? ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే చేతిలో డబ్బులుంటే చాలు హైదరాబాద్‌లో చార్మినార్‌ను అంతెందుకు పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్‌ను ఈజీగా కొనేస్తారు. ఆ పిచ్చితోటే వర్చువల్ రియాల్టీ సంస్థ డిసెంట్రాల్యాండ్‌లో ఔత్సాహికులు 2.4 మిలియన్ల విలువైన క్రిప్టో కరెన్సీతో వర్చువల్ రియల్ ఎస్టేట్ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఏమిటీ డీసెంట్రాల్యాండ్? డిసెంట్రలైజ్డ్ 3డీ వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ ఇది.మ్యాప్‌బాక్స్ టెక్నాలజీతో సృష్టించిన వర్చువల్ ల్యాండ్ ఇది. భూగ్రహాన్ని డిజిటల్ గ్రిడ్ లేయర్స్, టైల్స్గా విభజిస్తారు. ఈ టైల్స్ విలువ యూఎస్‌లో ఒకరకంగా, ఆస్ట్రేలియాలో ఒక రకంగా, ఇండియాలో ఒకరకంగా ఉంటుంది. దీన్ని డిజిటల్ ఎస్టేట్ అని కూడా పిలుస్తున్నారు. ఈజీగా చెప్పాలంటే ఫేస్బుక్ అధినేత జుకర్ బెర్గ్ మెటా పేరుతో కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఈ టెక్నాలజీతో మీరు ఎక్కడ ఉన్నా అవతార్ రూపంలో ఎదురుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఇప్పటికే ఫేస్బుక్ ఇంటర్నల్‌గా జరిగే మీటింగ్‌లో ఉపయోగిస్తుంది. ఇక డిసెంట్రాల్యాండ్ కూడా అంతే ఇందులో మనకు కావాల్సిన ల్యాండ్స్‌ను, బిల్డింగ్స్‌ను నిర్మించొచ్చు. డిజిటల్ భూభాగంలో కొనవచ్చు. వాటిని డెవలప్ చేయవచ్చు.అమ్మవచ్చు. జుకర్ దెబ్బకు పెరిగిన డిమాండ్ డిసెంట్రాలాండ్లోని ల్యాండ్ ఇతర వస్తువులు నాన్-ఫంగబుల్ టోకెన్ల (NFTలు) రూపంలో విక్రయిస్తారు. ఇది ఒక రకమైన క్రిప్టోకరెన్సీ తరహాలో డిజిటల్ మనీగా చెప్పుకోవచ్చు. డిసెంట్రాల్యాండ్‌లో కరెన్సీ 'మన' రూపంలో కొనుగోలు చేయొచ్చు. సోమవారం 618,000 కరెన్నీతో రియల్ ఎస్టేట్ ప్లాట్ల అమ్మకాలు జరిగాయి. వాటి విలువ సుమారు $2,428,740 అని డీసెంట్రాల్యాండ్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ డిజిటల్ భూమిలో 6,090 వర్చువల్ చదరపు అడుగుల పరిమాణంలో ఒక్కొక్కటి 52.5 చదరపు అడుగులో 116 చిన్న చిన్న ప్లాట్లను తయారు చేశారు. అయితే వాటిని పలువురు ఔత్సాహికులు 2.4 మిలియన్ల తో కొనుగోలు చేశారు. కాగా మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నట్లు జుకర్ ప్రకటించారు. ఆ ప్రకటనతో డిసెంట్రాల్యాండ్‌లో డిజిటల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో డిసెంట్రాల్యాండ్కు చెందిన అధికారిక కరెన్సీ 'మన' వ్యాల్యూ 400శాతం పెరిగినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. -
మెటావర్స్‌పై బాంబ్ పేల్చిన ఫ్రాన్సెస్ హౌగెన్!
ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారిపోయి..ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫేస్బుక్ మాతృసంస్థ మెటావర్స్‌పై ఘాటుగా విమర్శలు చేసింది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పేర్కొన్న మెటావర్స్ వర్చువల్ రియాలిటీ ప్రపంచం వల్ల ప్రజలు వ్యసనపరులుగా మారే అవకాశం ఉంది అన్నారు. అలాగే, మెటావర్స్ ఆన్లైన్లో గుత్తాధిపత్యాన్ని చెలాయించడంతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటుందని హెచ్చరించింది. ది అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. ఫేస్బుక్ సంస్థలో హౌగెన్ లోపాలను ఎత్తి చూపిన తర్వాత ఆ సంస్థ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపింది. అందుకే మాతృసంస్థ పేరును మెటావర్స్‌గా మార్చినట్లు వివరించింది. ఈ మెటావర్స్ వర్చువల్ రియాలిటీ ప్రపంచం సహాయంతో ప్రపంచంపై పట్టు సాధించాలని మార్క్ జుకర్‌బర్గ్ చూస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు విమర్శల నుంచి తప్పించుకోవడానికి మెటావర్స్ పేరును పెట్టినట్లు ఆమె తెలిపింది. వర్చువల్ రియాలిటీ, వీడియో గేమ్స్ కోసం పని చేయడానికి 10,000 మంది ఇంజనీర్లను నియమించబోతున్నారు అని తెలిపింది. ఈ వర్చువల్ రియాలిటీ వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని హౌగెన్ పేర్కొంది. (చదవండి: ఇన్‌స్టా యూజర్లకు షాక్: ఉచితం లేదు..డబ్బులు చెల్లించాల్సిందే..!) -
అదిరిపోయే టెక్నాలజీని ఆవిష్కరించిన ఫేస్బుక్!
గతేడాది వచ్చిన కరోనా మహమ్మారి పుణ్యమా అని డిజిటల్ టెక్నాలజీ ఎన్నడూ లేనంతగా వేగంగా విస్తరిస్తుంది. గతంలో అతి కొద్ది మందికి మాత్రమే పరిమితం అయిన వర్క్ ఫ్రం హోమ్ విధానం నేడు ప్రతి ఐటీ కంపెనీ అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త డిజిటల్ టెక్నాలజీ వల్ల విద్యార్థులు ఇంట్లో నుంచే పాఠాలు వినడం, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం జరుగుతుంది. అయితే, ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతున్నప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం కాదు అని చెప్పుకోవాలి. ఇందులో ఉన్న సమస్యలను అధిగమిస్తూ ఫేస్బుక్ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ పేరు "హారిజాన్ వర్క్ రూమ్". ఇది వర్చువల్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఫేస్బుక్ హారిజాన్ వర్క్ రూమ్ వల్ల మనం ఇంట్లో ఉన్నప్పటికీ పాఠశాలలో, ఆఫీస్ లో, ఇతర సమావేశాలలో పాల్గొన్న అనుభూతిని కలిగిస్తుంది. భౌతిక దూరంతో సంబంధం లేకుండా ఒకే వర్చువల్ రూమ్ లో కలిసి పాల్గొనవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఒక గదిని ఊహించుకొని ఆ గదిలో మీరు, మీ సహోద్యోగులు కలిసి సమావేశంలో పాల్గొన్న అనుభూతి ఈ టెక్నాలజీ కల్పిస్తుంది. ఇది వర్చువల్ రియాలిటీ, వెబ్ రెండింటిలోనూ పనిచేస్తుంది. మీరు, మీ బృందంతో భౌతికంగా కమ్యూనికేట్ అవ్వకుండానే వర్చువల్ పద్దతిలో వీఆర్ టెక్నాలజీ సహాయంతో కనెక్ట్ కావచ్చు. అలాగే, విద్యార్థులు ఇంట్లో ఉన్నప్పటికీ ఒక తరగతి గదిలో మీ టీచర్ చెప్పే పాఠాలను వినవచ్చు.(చదవండి: భారత సైనికుల చేతికి అత్యాధునిక AK 200 రైఫిల్స్) -
వర్చువల్ రియాలిటీకి పెరుగుతున్న ఆదరణ
వీఆర్(వర్చువల్ రియాలిటీ) అనేది నిన్నటి వరకు గేమింగ్ ప్రియులకు ప్రియమైన మాట. ఇప్పుడు...వినోదానికి మాత్రమే కాదు విజ్ఞానానికి కూడా వీఆర్ కేరాఫ్ అడ్రస్ అయింది. క్లాస్‌రూమ్‌కు ప్రత్యామ్నాయంగా మారింది. సరికొత్త అవతారాలతో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. కోవిడ్ పుణ్యమా అని ‘క్లాస్రూమ్’ మాయమైపోయింది. ఆన్లైన్ క్లాస్ దగ్గరైంది. ‘ఎంత ఆన్లైన్ అయితే మాత్రం ఏమిటీ? క్లాస్రూమ్ క్లాస్రూమే’ అనేవాళ్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యం లో వీఆర్(వర్చువల్ రియాలిటీ)కి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. త్రీడి అవతార్లతో ‘నిజంగానే క్లాస్‌రూమ్‌లో ఉన్నాం’ అనే భావన కలిగిస్తుంది. వర్చువల్ రియాలిటీలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న పుష్పక్ గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించిన ‘నెక్ట్స్‌మీట్’కు మంచి స్పందన లభిస్తోంది. రియల్ టైమ్ ఇంటరాక్షన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ 3డి ప్లాట్‌ఫామ్‌కు రూపకల్పన చేశారు. ‘నెక్ట్స్‌మీట్’ తాజా వెర్షన్లో వర్చువల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ కాన్ఫరెన్స్, వర్చువల్ మీటింగ్స్, హెల్ప్‌డెస్క్, ప్రెజెంటేషన్ స్క్రీన్స్, వాకబుల్ త్రీడీ అవతార్... మొదలైన వెర్షన్లను ప్రవేశపెట్టారు. మనకు కరోనా వాసన సోక ముందుకే వర్చువల్ రియాలిటీ డ్రైవెన్ కంటెంట్‌తో చెన్నైలో మొదలైంది ‘డ్రీమ్ఎక్స్’ అనే టెక్-స్టార్టప్. ఇది ప్రధానంగా హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ రంగాలపై దృష్టి పెట్టింది. ఎడ్యుకేషన్ సెక్టర్లో వర్చువల్ ల్యాబ్స్, వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ టూల్స్‌ను ప్రవేశపెట్టింది. స్టూడెంట్స్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం సెల్ఫ్-లెర్నింగ్ పాకెట్ లైబ్రరీ, ఏఆర్ టెక్నాలజీ మ్యాగజైన్లను తీసుకువచ్చింది. వైద్యవిద్యార్థుల కోసం వీఆర్ హ్యూమన్ అనాటమీ అప్లికేషన్‌ను డెవలప్ చేసింది. విద్యార్థులు ప్రాక్టిస్ చేయడం కోసం ఏసీఎల్ఎస్ (అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్) లాంటి వీఆర్ సిమ్యులేటర్స్‌ను ప్రవేశపెట్టింది. ‘జూమ్’కు వీఆర్ వెర్షన్‌గా చెప్పే ‘స్పెషల్’కు అంతకంతకూ ఆదరణ పెరగుతోంది. ‘యువర్ రూమ్ ఈజ్ యువర్ మానిటర్-యువర్ హ్యాండ్స్ ఆర్ ది మౌస్’ అని నినదిస్తున్న ‘స్పెషల్’ వీఆర్, ఏఆర్‌ల సమ్మేళన వేదిక. మరోవైపు వీఆర్ బేస్డ్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీఆర్చాట్, ఆల్ట్స్పేస్వీఆర్, రెక్ రూమ్...మొదలైన వీఆర్ సోషల్ ప్లాట్‌ఫామ్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో స్నేహితులు లేదా అపరిచితులు చాట్ చేయడానికి, ఆటలు ఆడుకోవడానికి వేదికగా ఉన్నాయి. ఇక ‘ఫేస్బుక్ హరైజన్’ దగ్గరికి వద్దాం. ‘కేవలం వర్చువల్ ప్రపంచాన్ని శోధించడానికి మాత్రమే కాదు మీకు స్ఫూర్తిని ఇచ్చే, మీకు ఆసక్తికరమైన ఎన్నో కొత్త విషయాలతో మమేకం కావడానికి స్వాగతం పలుకుతున్నాం’ అంటోంది ఫేస్బుక్ హరైజన్. ఎక్స్ప్లోర్, ప్లే, క్రియేట్, టుగెదర్... అనే ట్యాగ్‌లైన్‌తో యువతరాన్ని ఆకట్టుకుంటున్న ‘ఫేస్బుక్ హరైజన్’ ప్రస్తుతం ఇన్విటీ వోన్లీ-బీటాగా ఉంది. కాలం మీద కాలనాగై నిలుచుంది కరోనా. అంతమాత్రాన భయంతో ఏదీ ఆగిపోదు. సాంకేతిక దన్నుతో కొత్త ప్రత్యామ్నాయాలు వస్తుంటాయి. దీనికి బలమైన ఉదాహణ వీఆర్ ట్రెండ్. పంచేంద్రియాలపై పట్టు! కోవిడ్ నేపథ్యంలో విద్యారంగలో వర్చువల్ రియాలిటీ(వీఆర్)కి ప్రాధాన్యత మరింత పెరిగిందని గణాంకాలు సూచిస్తున్నాయి. యూజర్ చూపు, వినికిడి...మొదలైన సెన్స్లపై తాజా వీఆర్ అప్లికేషన్లు కంట్రోల్ సాధించి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతున్నాయి. రాబోయే అయిదేళ్లలో ఏఆర్(ఆగ్మెంటెడ్ రియాలిటీ), వీఆర్లు ట్రాన్స్ఫర్మెషన్ టెక్ ట్రెండ్స్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Ducati: డుకాటీ నుంచి రెండు కొత్త బైకులు -
ఫిలడెల్ఫియా టూర్: 360 డిగ్రీల వర్చ్యువల్ అనుభవం
పలువురు టూర్ ఇష్టులు.. వర్చ్యువల్ రియాల్టీ టూర్స్‌కి ఓటేస్తున్నారు. కరోనా కారణంగా పుట్టుకొచ్చినా..కరోనా తర్వాత కూడా కొనసాగే అనేక ట్రెండ్స్‌లో ఇదీ ఒకటిగా స్థిరపడుతోంది. కరోనా తర్వాత కృంగిన పర్యాటక రంగానికి పునరుత్తేజం అందించేందుకు, పర్యాటకులకు దగ్గరగా ఉండేందుకు పలు దేశాలు, పర్యాటక శాఖలు వర్చువల్ టూర్స్‌ని ఎంచుకుంటున్న నేపధ్యంలో ఫిలడెల్ఫియా పర్యాటక శాఖ కూడా అదే బాట పట్టింది. తమ దేశంలోని సందర్శనీయ స్థలాలతో పాటు కళలపై అభిమానంతో తమ దేశానికి ప్రత్యేకంగా వచ్చే సందర్శకుల కోసం విభిన్న రకాల ఆర్ట్, హిస్టరీ విశేషాలను, అలాగే తమకే ప్రత్యేకమైన మ్యూరల్స్, వాల్ ఆర్ట్ తదితర చిత్ర ‘విచిత్రాల’తో వర్చువల్ టూర్స్ ను ఆఫర్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ పర్యాటక శాఖ ప్రతినిధులు తెలిపారు. తమ దేశంలోని మ్యూరల్ ఆర్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని, వీరి కోసం ఆన్లైన్ ద్వారా వర్చువల్ టూర్స్‌ని అందిస్తున్నామన్నారు. కరోనా కారణంగా తమ సైట్‌కి 50శాతం ట్రాఫిక్ పెరిగిందని పర్యాటక ప్రదేశాలకు సంబంధించి టూరిస్టలకు 360 డిగ్రీల వర్చ్యువల్ అనుభవాన్ని అందించే వెబ్సైట్ యజమాని వర్చువల్ రియాల్టీ ఫొటోగ్రాఫర్ లీన్ థోబియాస్ చెప్పారు. తమ సైట్స్ ద్వారా వాయనాడ్‌లోని ఎడక్కల్ గుహలు, ఈజిప్టియన్ పిరమిడ్స్ వంటి ప్రాంతాలను అత్యధికులు విజిట్ చేశారని అంటున్నారాయన.గత కొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్ సంప్రదాయ గిరిజన కధలను చిత్రాలు, సంబంధించిన పర్యాటక విశేషాలను నగరవాసులకు వర్చువల్లీ వివరిస్తున్నట్టు చెరిష్ ఎక్స్‌పెడిషన్స్‌కు చెందిన చెరిష్ మంజూర చెప్పారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో ఏటా నిర్వహించే బాస్కన్ ఫెస్టివల్‌ని కూడా అందించామన్నారు. అలాగే పర్యాటక నిపుణుల ఆధ్వర్యంలో బూట్ క్యాంప్స్ కూడా నిర్వహించామన్నారు. -
5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు వచ్చేస్తున్నాయి
హైదరాబాద్: ఇప్పటి వరకు మనం సాధారణంగా నగదు ఉపసంహరించుకోవడం కోసం లేదా బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం ఏటిఎమ్ దగ్గరికి వెళ్లి ఉంటాం. కానీ అదే వర్చువల్ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడటం లేదా మీ కెవైసిని పూర్తి చేయడం కోసం ఏటిఎమ్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ ని నిజం చేయబోతుంది హైదరాబాద్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ & రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడిఆర్‌బిటి) సంస్థ.(చదవండి: వాట్సాప్‌లో కొత్త రకం మాల్వేర్!) ఆసక్తికర విషయం ఏమిటంటే, కొద్దీ రోజుల క్రితం ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేట్ నెట్వర్క్ సహాయంతో 5జీ సేవలను పరీక్షించి చూసారు. 5జీ కనెక్షన్‌తో 1జీబీ ఫైల్ డౌన్లోడ్ చేయడానికి 30 సెకన్ల మాత్రమే పట్టింది. "రాబోయే సరికొత్త టెక్నాలజీ 5జీ సహాయంతో ఎటిఎంలు ఒక బ్యాంక్ బ్రాంచ్‌గా పనిచేస్తాయి.. అలాగే ఎటిఎంలు 5జీ నెట్‌వర్క్‌లకు రిలేయింగ్ పాయింట్లుగా మారవచ్చ" అని ఐడిఆర్‌బిటి మాజీ డైరెక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రి అన్నారు. ఇతని నాయకత్వంలోనే ఈ టెక్నాలజీపై ప్రయోగాలు మొదలయ్యాయి. 2022లో మాట్లాడే ఎటిఎంలు 2జీ, 3జీ లేదా 4జీ విషయానికి వస్తే భారతదేశం ఇతర దేశాలతో చాలా వెనుకబడి ఉండేది. కానీ ఇప్పుడు 5జీ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి ఇతరదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది అని ఎ.ఎస్.రామశాస్త్రి అన్నారు. ఆర్బిఐ బ్యాంకింగ్, ఆర్థిక సేవల కోసం దేశంలో 5జీ సాంకేతికతను ఉపయోగించడం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 2020లో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ సాంకేతికతకు ముందుగానే సిద్ధంగా ఉండాలని పరిశోధకులు, బ్యాంకర్లతో సహా 10 నుండి 12 మంది వ్యక్తుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందం 5జీ టెక్నాలజీ ద్వారా బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో రాబోయే మార్పులను ముందుగానే గ్రహించి దానికి తగ్గట్లుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఇందులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి దీనిని 2022 నాటికీ మార్కెట్ లో ప్రదర్శించాలని చూస్తున్నారు. ఈ 5జీ టెక్నాలజీ వల్ల ఆర్థిక రంగంలో చాలా మార్పులు సంభవిస్తాయని రామశాస్త్రి పేర్కొన్నారు. “గ్రామీణ ప్రాంతాల్లో, అధిక బ్యాండ్‌విడ్త్ లభించడం వల్ల వారు కూడా డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతారు. లావాదేవీల కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయబడతాయి. కానీ వారు 5జీ టెక్నాలజీ ఉన్న గాడ్జెట్లు కొనగలరా లేదా బ్యాంకింగ్ ఉద్యోగులు వారి దగ్గరికి చేరువ చెయ్యాలా అని ఆలోచిస్తున్నామని" రామశాస్త్రి అన్నారు.(చదవండి: జియోపై ఎయిర్టెల్ పైచేయి) 5జీతో అవకతవకలకు అడ్డుకట్ట కొత్త సాంకేతికతలో తక్కువ జాప్యం, అధిక వేగం కారణంగా మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని వీరు భావిస్తున్నారు. 5జీతో పోలిస్తే 4జీలో ఉన్న 50 మిల్లీసెకన్ల కనీస జాప్యాన్ని ఒక మిల్లీ సెకన్లకు తగ్గించవచ్చు. డేటా వేగం 4జీ కన్నా 10 నుంచి 20రేట్లు వేగంగా ఉంటుంది. లావాదేవీల సమయంలో అంతరాన్ని మెరుగుపరచడం ద్వారా బ్యాంకింగ్ రంగం ఆర్ధిక పరిధిని మెరుగుపరచడంతో పాటు 5జీ బ్యాంకింగ్ కార్యకలాపాలను మరింత సురక్షితంగా చేస్తుంది. ఎందుకంటే సమయం ప్రాతిపదికన అవకతవకలు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ మార్కెట్ విషయంలో ఈ అవకతవకలు తగ్గించవచ్చు. 5జి టెక్నాలజీపై ఐడిఆర్‌బిటి విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం.. 5జీ నెట్వర్క్ మిలియన్ల ఐవోటి పరికరాలను ఆపరేట్ చేయగలదు, అధిక డేటా వేగం కారణంగా మెషిన్-టు-మెషిన్(M2M) మధ్య కమ్యూనికేషన్ కూడా ప్రారంభించగలదు. ఇది ప్రస్తుత వ్యవస్థలను మరింత 'తెలివైనదిగా' చేయనుంది. కెపిఎంజి ఇండియా భాగస్వామి, డిజిటల్ కన్సల్టింగ్ హెడ్ అఖిలేష్ తుటేజా 5జీ టెక్నాలజీ సామర్థ్యాన్ని వివరించారు. ఐఒటి వాడకం, టచ్ లెస్ కారణంగా బ్యాంకింగ్‌లో చాలా మార్పులను చోటుచేసుకుంటాయి. 5జీ టెక్నాలజీ ఎటిఎంలు, బ్యాంక్ శాఖలు, పిఒఎస్లను ప్రభావితం చేయనున్నట్లు తెలిపారు. 2025 నాటికి 5జి టెక్నాలజీ ఆధారంగా పనిచేసే గాడ్జెట్లు ఎక్కువ సంఖ్యలో రాబోతున్నాయి అని ఆయన అన్నారు. కోవిడ్ -19, డీమోనిటైజేషన్ కారణంగా మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగినట్లు పేర్కొన్నారు. అన్నిటికంటే ముందు ఆర్థిక సేవ రంగంలో కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. -
గూగుల్ పాలీ సేవలు ఇక బంద్
ఏఆర్, వీఆర్ యానిమేషన్ డెవలపర్స్‌కి గూగుల్ షాకిచ్చింది. వర్చువల్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రాజెక్టులలో ఉపయోగించగల ఉచిత 3డీ యానిమేషన్ ఇమేజెస్ ను గూగుల్ పాలీ వెబ్సైట్ ద్వారా అందించేది. గూగుల్ గత మూడు సంవత్సరాలుగా 3డీ మోడల్ షేరింగ్ వెబ్సైట్ పాలీని నిర్వహిస్తుందని అనే విషయం ఎక్కువ శాతం మందికి తెలియకపోవచ్చు. వచ్చే ఏడాది పాలీ వెబ్సైట్ ని మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఏప్రిల్ 30, 2021 నుండి పాలీ మూసివేయబడుతుంది. అప్పటి నుండి సైట్ ఇకపై క్రొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేయడానికి వినియోగదారులను అనుమతించదు. జూన్ 30 నుండి పూర్తిగా నిలిపివేయబడుతుంది గూగుల్ తెలిపింది. 2021 జూన్ 30 తేదీలోపు పాలీ వెబ్సైట్లో ఉన్న తమ కంటెంట్ మొత్తాన్ని గూగుల్ టేక్అవుట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.(చదవండి: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్) ‘‘ఈ ప్రయాణంలో మాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీకు అవసరమైన సేవలను అందించేందుకు పాలీ సరైన వేదికని నమ్మి మాపై విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు. మీ సృజనాత్మకతను ఎంతో వినయంగా మాతో పంచుకున్నందుకు మేంఎంతో ఆనందిస్తున్నాం. ఇది మమ్మల్ని ఎంతో ఆశ్చార్యానికి, కొత్త అనుభూతికి గురిచేసింది ’’ అని గూగుల్ యూజర్స్‌కి పంపిన మెయిల్లో పేర్కొంది. కానీ, గూగుల్ ఎందుకు పాలీ సేవలను నిలిపివేస్తుందో తెలియజేయలేదు. -
ఎన్ఆర్ఐలు అదుర్స్, ఆన్లైన్లో బతుకమ్మ సంబరాలు
సిడ్నీ: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలను ఏకం చేసి సిడ్నీ బతుకమ్మ అండ్ దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్(ఎస్‌బీడీఎఫ్), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం(ఏటీఎఫ్)మొట్టమొదటిసారిగా వర్చువల్ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఎస్‌బీడీఎఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఆటపాటలతో శనివారం అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారై ప్రతినిధులు ఈ సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు అదేవిధంగా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, మలేషియా, దుబాయ్ వంటి పలుదేశాల నుంచి కూడా తెలంగాణ ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ప్రతి సంవత్సరం లాగ ఒకే చోట గుమికూడకుండా, అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ వినూత్నంగా ఆన్లైన్ ద్వారా ఎవరి ఇంట్లో వారు ఉండి సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ ఆట పాటలతో సిడ్నీ పరవశిచింది. సిడ్నీలోని అన్ని ప్రాంతాల నుంచి ఆన్లైన్ బతుకమ్మ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలను ఇలా ఆన్లైన్లో నిర్వహించారు. వర్క్ ఫ్రొం హోమ్ ఎలా అయితే అలవాటు చేస్తున్నామో అదేవిధంగా బతుకమ్మ ఆడే విధానాన్ని కూడా మార్చుకోవడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరమ్మను కరోనా నుంచి కాపాడమని కోరుకుంటూ మహిళలు పాటలు పాడి వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌బీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ మాట్లాడతూ, ఎస్‌బీడీఎఫ్ ప్రధాన ఆశయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటం అని తెలిపారు. ఇప్పటి తరం యువతీ యువకులకు, పిల్లలకు నేర్పించినట్లయితేనే మన సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్లగలమని ఆయన చెప్పారు. అందరూ ఆన్లైన్ ద్వారా ఒకచోట చేరి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని శ్రీనివాస్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 500 మంది వరకు ఈ బతుకమ్మ వేడుకలలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. చదవండి: అమెరికా బ్యాలెట్ పేపర్‌పై తెలుగు -
ట్రావెల్ ఫ్రం హోం!
సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం అంటే తెలుసు కానీ ఈ ట్రావెల్ ఫ్రం హోం ఏమిటి అనుకుంటున్నారా? విదేశాల్లోని ప్రముఖ పర్యాటక, ప్రసిద్ధ కేంద్రాలకు మనం స్వయంగా వెళ్లకుండానే అక్కడకు వెళ్లినట్లుగా, వ్యక్తిగతంగా అన్నింటినీ సొంతంగా వీక్షిస్తున్నట్లుగా అనుభూతి పొందేలా చేసేవే ‘వర్చువల్ ట్రావెల్’, ‘ట్రావెల్ ఫ్రం హోం’. ఇది ఇప్పటికే ‘నెట్టింట’అందుబాటులో ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం దీనికి ఇప్పటిదాకా అంత ప్రాచుర్యం లభించలేదు. అయితే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కమ్మేసిన నేపథ్యంలో వర్చువల్ ట్రావెల్‌పై దేశంలోని పర్యాటక ప్రేమికులు సైతం అధిక ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సమేతంగా చేపట్టే విదేశీ టూర్లకు అయ్యే ఖర్చు, శ్రమతో పోలిస్తే ‘ట్రావెల్ ఫ్రం హోం’ఖర్చు చాలా తక్కువే కావడంతో వాటిపట్ల మక్కువ ప్రదర్శిస్తున్నారు. దీంతో వారిని ఆకర్షించేందుకు వర్చువల్ టూర్లు ఆఫర్ చేసే సంస్థలు కొత్త ప్లాన్లతో ముందుకొస్తున్నాయి. 360 డిగ్రీల కోణంలో... విదేశీ పర్యాటకం అధికంగా సాగే వేసవిలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టేయడం, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశాలన్నీ సరిహద్దులను మూసేసి లాక్డౌన్ ప్రకటించడంతో జనజీవనం స్తంభించింది. ఫలితంగా విదేశాల్లోనే కాకుండా దేశీయంగానూ పర్యాటక, రవాణా, ఆతిథ్య తదితర అనుబంధ రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఈ తరుణంలో దేశ, విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, మ్యూజియాలు, ముఖ్య కట్టడాలను ఇల్లు కదలకుండానే వీక్షించేందుకు లోకల్ ఎక్స్పర్ట్ భాగస్వాములతో కలిసి ఎక్స్పీడియా అనే అంతర్జాతీయ ట్రావెల్స్ సంస్థ వర్చువల్ టూర్లను ఆఫర్ చేస్తోంది. ట్రావెల్ ఫ్రం హోం సిరీస్‌లో భాగంగా వర్చువల్ ట్రావెల్‌తోపాటు సాంస్కృతిక, విద్య, వినోద అనుబంధ రంగాల్లోని విశేషాలను, వాటికి సంబంధించిన టూర్లను ఇళ్లలో తీరికగా కూర్చొని ఆయా ప్రదేశాల్లో పర్యటించిన అనుభూతి పొందేలా ప్రణాళికకు రూపకల్పన చేసింది. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి ఆన్లైన్లో వర్చువల్ రియాలిటీ (వీఆర్), వెబ్‌కామ్‌లు, కంప్యూటర్ల ద్వారా 360 డిగ్రీల కోణంలో లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా ఆయా పర్యాటక కేంద్రాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తోంది. మరికొన్ని సంస్థలు సైతం ఇదే తరహా టూర్ ప్యాకేజీలు అందిస్తున్నాయి. టూర్ గైడ్లతో లైవ్ వీడియో టూర్... కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలను చూడాలని పర్యాటక ప్రేమికులు కోరుకోవడం, దాని కోసం పెద్దమొత్తం ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ టూర్లకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక, సాంస్కృతిక, ఇతర కేంద్రాల్లోని టూర్ గైడ్లతో లైవ్, ఇంటరాక్టివ్ వీడియో సెషన్ల ద్వారా ‘రిమోట్ ట్రావెల్స్’నిర్వహిస్తున్నారు. ఆత్మీయులతోనో, స్నేహితులతోనో కలసి కొత్త ప్రదేశాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించేలా మనకు నచ్చిన, చూడాలని కోరుకున్న పర్యాటక కేంద్రాలు, వాటి గురించిన ఆసక్తికర వివరాలను టూర్ గైడ్లు వివరించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాలను చూడాలని అనుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ‘ప్రివ్యూ’లను కూడా గైడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యూజియాలను డిజిటల్ టూర్ల మాదిరిగా చూసే అవకాశం లభిస్తోంది. గూగుల్ స్ట్రీట్ ద్వారా ఆధునిక, సమకాలీన చిత్రకళ ప్రదర్శనలను వీక్షించే వీలు కల్పిస్తున్నారు. అయితే బ్రిటిష్ మ్యూజియం పర్యటనకు విషయానికొస్తే మాత్రం ఇది గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌లో లేకపోవడంతో బ్రిటిష్ మ్యూజియం వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి వస్తోంది. -
చనిపోయిన పాపను ఇలా కలుసుకున్న తల్లి
సాక్షి, న్యూఢిల్లీ : ఆత్మీయులు అకాలంగా మరణిస్తే ఎవరికైనా అంతులేని దు:ఖం కలుగుతుంది. అలా కన్న పేగు దూరమైతే వారి దు:ఖం ఇంకా అంతులోనిది. పొగిలి పొగిలి ఏడ్చినా తీరనిది ఆ బాధ. కలలో తప్పించి వారు వారికి కనిపించరు. అలా దూరమైన వారిని, పేగు బంధాన్ని నిజంగా కలుసుకుంటే....కళ్లతో చూస్తూ పెదవులతో మాట్లాడుతూ, చేయి చేయి పట్టుకొని స్పర్శిస్తే..... నిజంగా అది సాధ్యమైతే ఆ అనుభూతి అపారమైనతి. ఎన్నటికీ మరవలేనిది. మరపురానిది. ఓ కొరియన్ టీవీ ‘మీటింగ్ యూ’ అనే షోలో జాంగ్ జీ సంగ్ అనే తల్లికి 2016లో మరణించిన తన కూతురు నయ్యేన్ను చూడటమే కాదు, కలసుకొని మాట్లాడే వీలు కల్పించింది. ఆ తల్లిని ఓ మైదానంలోకి తీసుకెళ్లింది. ఆడుతూ, ఆడుతూ చెక్కల చాటున దాచుకొని అప్పుడే అమ్మా అంటూ ఏడేళ్ల పాప ఆ తల్లి ముందుకు రావడం, ‘ఓ మై ప్రెటీ ఐ మిస్డ్ యూ’ అంటూ ఆ తల్లి ఆ పాప ముఖాన్ని ముట్టుకొని స్పర్శించే ప్రయత్నించడం మనమూ చూడగలం. ఊదారంగు గౌను, నల్లటి జుట్టు కలిగి మెరుస్తున్న కళ్లతో ఆ తల్లిని చూస్తూ ‘ఎక్కడికి పోయావ్ ఇంతకాలం. అసలు నేను గుర్తున్నానా?’ అంటూ అమాయకంగా ప్రశ్నించడం, ‘నిన్ను ఎలా మరచిపోతాను రా కన్నా!’ అంటూ ఆ తల్లి చెప్పడం, ‘అమ్మా నిన్ను ఎంతో కోల్పోయాను’ ‘నేను కూడా ఎంతో కోల్పోయాను’ అంటూ తల్లీ కూతుళ్లు పరస్పరం చెప్పుకోవడం ఆ తల్లికే కాదు, వారిని చూస్తున్న ప్రేక్షకుల్లోని ఆ పాప తండ్రి, సోదరుడు, సోదరితోపాటు ప్రేక్షకులు కంటతడి పెట్టడం అందరిని కలచివేస్తుంది. ఆ పాప ఓ పువ్వు పట్టుకొని తల్లి దగ్గరకు పరుగెత్తుకు రావడం ‘అమ్మా! ఇక నిన్నెప్పుడు బాధ పెట్టను’ అని హామీ ఇవ్వడం అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ఆ పాప టుంగుటూయల పరుపెక్కి ఏదో చదివి తల్లికి వినిపించడం, అలసిపోయానమ్మా, ఇక పడుకుంటానంటూ చెప్పడం, అందుకు పాపకు బాయ్ చెప్పడంతో ఆ తల్లి, ప్రేక్షకులు ఈ లోకం లోకి వస్తారు. ఈ పాటికి అర్థమై ఉండాలి. ‘వర్చువల్ రియాలిటీ (వీఆర్)’ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జాంగ్ జీ సంగ్ అనే తల్లికి తన కూతురుని కలసుకునే అవకాశాన్ని కొరియన్ టీవీ కల్పించింది. ‘మున్వా బ్రాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్ (ఎంబీసీ)’ నయ్యోన్ డిజిటల్ క్యారెక్టర్‌ను సృష్టించేందుకు ఎంతో శ్రమించింది. డిజిటల్ కెమెరా ముఖానికి, డిజిటల్ గ్లౌవ్స్‌ను ధరించడం ద్వారా జాంగ్ నిజంగా తన కూతురును కలుసుకున్న అనుభూతిని పొందారు. తాను తన కూతురు నయ్యేన్ ఎప్పటికీ మరచిపోనని, ఈ టీవీ షోను చూసిన వారెవరు కూడా నయ్యేన్ మరచిపోరాని జాంగ్ తన బ్లాక్‌లో రాసుకున్నారు. -
చనిపోయిన పాపను ఇలా కలసుకున్న తల్లి
-
మాయా ప్రపంచం
శ్రీనగర్‌కాలనీ: చిత్రం...భళారే విచిత్రం..పాట ఎంతో ఫేమస్.. భవిష్యత్‌లో ఆ చిత్రమే భలే విచిత్రంగా కాల్పనిక వాస్తవికతతో అబ్బురుపరుస్తుంది. చిత్రమే చలనం, చలనమే చిత్రం..అన్న తీరులో వర్చువల్ రియాలిటీ (వీఆర్ ) టెక్నాలజీ మాయా ప్రపంచంలోకి తీసుకెళుతుంది. రానున్న కాలంలో వర్చువల్ రియాలిటీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతూ కాలాన్ని వృథా చేస్తున్నారని బాధపడాల్సిన అవసరం లేదు. వారికి సృజనాత్మకత ఉంటే వారే రేపటి వర్చువల్ రియాలిటీకి దిక్సూచిలా ఉంటారు.వర్చువల్ రియాలిటీకి భవిష్యత్‌లో ఊహకందని డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కేవలం వర్చువల్ రియాలిటీ వీడియోగేమ్స్‌కు మాత్రమే పరిమితమై ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తుంది. ఎడ్యుకేషన్, హెల్త్, బిజినెస్, రియల్ ఎస్టేట్ లాంటి వాటికే కాకుండా ల్యాబ్స్ అవసరం లేకుండా వర్చువల్ ల్యాబ్స్‌తో ప్రయోగాలు చేసేలా వర్చువల్ రియాలిటీ కనులను మాయ చేస్తుంది. అంతేకాదండోయ్.. వర్చువల్ రియాలిటీని చేసే సాప్ట్‌వేర్స్ అయిన అన్రీల్ ఇంజన్, యూనిటీ లాంటి సాప్ట్‌వేర్స్‌ని హైదరాబాద్ నగరంలోని అతికొద్ది సంస్థలు విద్యార్థుల కొరకు అందుబాటులోకి తెచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. వీఆర్ పనితీరు వర్చువల్ రియాలిటీ అంటే కాల్పనిక వాస్తవికత. సాంకేతిక హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సహాయంతో వాస్తవంలా అనిపించే 3–డైమెన్షనల్ మిథ్యా వాతావరణాన్ని నిర్మించి ప్రేక్షకుడు, వినియోగదారుడు అనుభూతిని నిజంగా పొందేలా చేసే ప్రక్రియే వర్చువల్ రియాలిటీ. క్లుప్తంగా, సూక్ష్మంగా చెప్పాలంటే మనకు కలలు వచ్చినపుడు ఎలా ఫీలవుతామో అలాంటి స్థితి అని చెప్పవచ్చు. కల్పితంగా, కృత్రిమంగా సృష్టించిన పరిస్థితులు, పరిసరాలు అనుభూతులతో మనిషి మెదడును కదిలించేలా సహజత్వంతో ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. కల్పితం అనే మాట నుంచి కళ్ళకు నిజం చేసే స్థాయికి వర్చువల్రియాలిటీ చేరింది. బ్రహ్మంగారు చెప్పినట్లు కలలు నిజమవుతాయి...జరగనివి జరుగుతాయి..అన్నట్లు వర్చువల్ రియాలిటీ నేడు అన్ని రంగాల్లో భవిష్యత్‌కు మార్గదర్శిగా మారింది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దీని మీద రెడి ప్లేయర్ వన్ అనే చిత్రాన్ని నిర్మించి విజయాన్ని నమోదు చేశారు. కొన్ని అనుమానాలున్నా వాటిని పటాపంచలు చేస్తూ కొత్త భవిష్యత్‌కు మార్గాన్ని సుగమం చేసింది. దీనికి కావాల్సిందల్లా కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌తో పాటు వీఆర్ హెడ్సెట్ ఉంటే చాలు..మనల్ని ఊహా ప్రపంచంలోకి తీసుకెళుతుంది. హెల్త్, ఎడ్యుకేషన్, బిజినెస్‌లలో ప్రముఖంగా... కాల్పనిక వాస్తవికతను ఇప్పుడిప్పుడే హెల్త్, ఎడ్యుకేషన్, బిజినెస్‌లలో ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యంలో వర్చువల్ రియాలిటీ చాలా ఉపయుక్తంగా ఉంటుందనటంటే ఎలువంటి అనుమానాలు లేవు. పిల్లల భయాలను పోగొడుతూ వర్చువల్ రియాలిటీ ద్వారా వారి చికిత్సను అందించడానికి దోహదపడుతుంది.ఆఖరి దశలో ఉన్న రోగికి లేదా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆఖరి కోరికలను వారికి ఇష్టమైన ప్రదేశాలను చూసి ఆనందించేలా చేయడంలో వీఆర్ కీలకంగా మారనుంది. శరీర భాగాల నిర్మాణాలను తయారీలో వినియోగించే 3డీ, 4డీలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తూ సరికొత్తగా వైద్య విద్యార్థులు విద్యను నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది. మంచి ఉపాధి అవకాశం భవిష్యత్‌లో వీఆర్‌కు మంచి భవిష్యత్ ఉంది. అన్ని రంగాల్లో వీఆర్ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ టెక్నాలజీలో ఉపయోగించే అన్రీల్, యూనిటీ సాఫ్ట్‌వేర్స్‌ను టెన్త్ పాసైన విద్యార్థులు సైతం నేర్చుకోవచ్చు. కొద్దిగా నేర్పు, సృజతాత్మకత ఉంటే చాలు. మా సంస్థలో మేము గేమింగ్స్తో పాటు పలు విషయాలపై వీఆర్ ద్వారా ఎక్సపరిమెంట్స్ చేస్తున్నాం. ఈ సాప్ట్వేర్స్ను నేర్పించి మేమే ఉపాధిని కల్పిస్తున్నాం.– వంశీ చౌదరి, సీఈఓ, ఇన్ఫినిటో గేమింగ్ స్టూడియో సృజనాత్మకత ఉంటే చాలు వర్చువల్ రియాలిటీ కలల్ని నిజం చేస్తుంది. మనల్ని ఊహాలోకంలోకి తీసుకెళుతుంది. హెల్త్, ఎడ్యుకేషన్, బిజినెస్ రంగాల్లో వీఆర్ ప్రాముఖ్యత రెట్టింపు అయింది. వీఆర్ సాప్ట్‌వేర్స్ చాలా సులభం. తక్కువ సమయంలో ఈ సా‹ఫ్ట్వేర్స్ అభ్యసించి మంచి వేతనాలను పొందవచ్చు. సృజనాత్మకత ఉన్న విద్యార్థులకు వీఆర్ మంచి అవకాశం. అపోహలను తొలగిస్తూ వీఆర్ నేడు మార్కెట్లో దూసుకుపోతోంది. – రఘు, గేమింగ్ ట్రైనర్ -
విరాట్ కోహ్లీ మెచ్చిన ఆట..
భారతదేశంలో క్రికెట్ అభిమానులకు కొదవలేదు. ఇక మన భాగ్యనగరంలో అయితే గల్లీ క్రికెట్‌కు పెట్టింది పేరు.మైదానంలో ఏ బంతిని ఏ షాట్ కొట్టాలో కూడా టీవీ ముందు కూర్చుని మరీ చెబుతుంటారు. తమకూ ఓ అవకాశంవస్తే మైదానంలో చెలరేగిపోవాలని ఎందరో అనుకుంటారు. సచిన్‌లా చెలరేగిపోవాలని.. ధోనీలా హెలికాఫ్టర్షాట్ కొట్టాలని.. కోహ్లీ లాంటి హిట్టర్‌లా మైదానంలో షాట్లు బాదేద్దాం అని ఎందరో కలలు కంటుంటారు. కానీ అది అంత ఈజీ కాదు. మరి ఆ కలను నిజం చేసుకునే అవకాశం వస్తే..! అదెలా సాధ్యం? అనుకోవద్దు. ఆధునిక టెక్నాలజీతో మనం కూడా పిచ్‌పై చెలరేగిపోవచ్చు. క్రికెట్ ప్రేమికుల కోసం ఇప్పుడు నగరంలో ఓ డిజిటల్ క్రీడా మైదానాలు అందుబాటులోకి వచ్చాయి. జస్ట్ హెడ్సెట్ పెట్టుకుని, బ్యాట్ పట్టుకుని ఉప్పల్ స్టేడియంలో వేలాది మంది క్రీడాభిమానులు చూస్తుండగా మనం కూడా షాట్స్ బాదేయవచ్చు. అదెలాగంటారా..! అయితే ఈ కథనం చదవాల్సిందే. – హిమాయత్‌నగర్ ఐబీ క్రికెట్ అంటే ఏంటి..? ఇదీ ఓ విధంగా చెప్పాలంటే వీడియో గేమ్ లాంటిదే. కానీ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఆడేది. సంస్థ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో క్రికెట్ సెటప్ మైదానంలో మనం ఉన్నట్లే అనిపిస్తుంది. ఆ ప్లే జోన్లో కళ్లకు హెడ్సెట్(వీఆర్ గేర్ లాంటిది) తగిలించుకోవాలి. బ్యాట్ పట్టుకుని పిచ్‌పై నిలబడాలి. అంతే.. ప్రతి బాల్కి మీరు బ్యాట్‌ను ఊపుతుంటే ఆ బాల్స్ సిక్సర్లు, ఫోర్ బౌండరీలకు చేరుతాయి. మీరు షాట్లు కొడుతుంటే చుట్టూ ఉన్న వేలాది మంది అభిమానులు చప్పట్లు కొడుతూ, అరుపులు.. ఈలలతో మిమ్మల్ని ప్రోత్సహించడం ఇందులో ప్రత్యేకం. ఐబీ క్రికెట్‌కు నగరంలో గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్, మదీనాగూడ ప్రాంతాల్లో ప్లే జోన్స్ ఉన్నాయి. అక్కడ మనం మైదానంలో ఆడినట్టే క్రికెట్ ఆడొచ్చు. అంతేకాదు.. జాతీయ, అంతర్జాతీయ మైదానాల్లో వేలాది మంది అభిమానుల మధ్య ఆడుతున్నట్టే ఉంటుంది. ‘వ్యూ’ యాప్ ద్వారా వర్చువల్ గేమ్ ఆడిన స్టార్ క్రికెటర్లు.. విరాట్ కోహ్లీ మెచ్చిన ఆట ఐబీ క్రికెట్ గురించి తెలుసుకున్న ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబైలో స్వయంగా హెడ్సెట్ పెట్టుకుని వర్చువల్ క్రికెట్ ఆడి ఫిదా అయిపోయాడని త్రివిక్రమ్‌రెడ్డి, వసంత్‌సాయి చెప్పారు. ఈ జోన్లో అచ్చం మైదానంలో ఆడినట్లే ఉందని, నేటి యువతకు ఇటువంటి మంచి టెక్నాలజీని పరిచయం చేయడం గొప్ప విషయమని కితాబిచ్చినట్టు వారు తెలిపారు. అంతేకాదు.. సెహ్వాగ్, హర్భజన్‌సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, రైనా, మెక్కలాం, దిల్షన్, హర్షల్ గిబ్స్, సాంబ్లింగ్స్, పృధ్విషా, సుభామగిల్, కైఫ్, ఆండ్రూ రసల్’ వంటి క్రికెటర్లు ‘వ్యూ’ యాప్ ద్వారా ఈ గేమ్‌ను అడారు. టికెట్ కొని గ్రౌండ్‌కు వెళ్లే పనిలేకుండా మంచి కాన్సెప్ట్‌ని రూపుదిద్దినందుకు త్రివిక్రమ్‌రెడ్డి, వసంత్సాయిలకు కితాబిచ్చారు. త్రివిక్రమ్, వసంత్ నగరానికి చెందిన వసంత్‌సాయి, త్రివిక్రమ్‌రెడ్డి స్నేహితులు. వసంత్‌సాయి నగరంలోని ఐఐఐటీలో, త్రివిక్రమ్‌రెడ్డి ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. వీరూ క్రికెట్ ప్రేమికులే. ఆట మీదున్న అభిమనంతో కోట్లాది రూపాయిల ప్యాకేజీ వచ్చే ఉద్యోగాలను వదిలేసి తమలాంటి వారి కోరికను తీర్చే పనికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ‘వర్చువల్ క్రికెట్’ని దేశ క్రీడాభిమానులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ‘ఐబీ క్రికెట్’ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 14 ప్రదేశాల్లో లక్షలాది మంది క్రికెట్ అభిమానుల మన్నలను అందుకుంటోంది ఈ ఐబీ క్రికెట్. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ ఇక్కడ క్రికెట్ అడాలనుకునేవారు ‘ఐబీ క్రికెట్’ వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో నేరుగా కూడా స్లాట్ బుక్‌చేసుకోవచ్చు. గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో రెండు గంటలకు రూ.130, మదీనాగూడలో రూ.125 చొప్పున చార్జి చేస్తారు. తమ వద్ద ఎనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ల వారు క్రికెట్ ఆడొచ్చని బిజినెస్ డెవలప్పర్ బాలాజీ చెప్పారు. ఈ సంస్థ నగరంతో పాటు చండీఘర్, జైపూర్, పట్నా, చెన్నై, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, కొచ్చి తదితర ప్రాంతాల్లో కూడా ఐబీ క్రికెట్ ప్లే జోన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్‌కు ఐపీఎల్ తరహా పోటీలు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి తమకు నచ్చిన ఆటగాడు ఏ టీమ్‌లో ఉంటే.. ఆ జట్టును సపోర్ట్ చేస్తాం. ఇలాంటి వారికోసం ‘ఐబీ క్రికెట్’ జోన్స్‌లో పోటీలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ‘సీఎస్కే, ఆర్సీబీ, ఆర్ఆర్, కేకేఆర్, ఢిల్లీ’ యాజమాన్యాలు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తమకు నచ్చిన టీమ్‌ను సపోర్ట్ చేసే వారిని జట్లుగా విభజిస్తారు. ఓవర్స్ లేదా రన్స్ చొప్పున గేమ్‌ని ఆడిస్తారు. ఇందులో విజయం సాధించిన జట్టు సభ్యులకు ఖరీదైన గిఫ్ట్‌లను కూడా ఇస్తున్నారు. -
విద్యలో వర్చువల్ విప్లవం
సాక్షి, విశాఖపట్నం/చోడవరం: విద్యలో వర్చువల్ విప్లవం వస్తోందని, రాష్ట్రంలో వర్చువల్ టెక్నాలజీతో తరగతులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు తరగతి గదుల్లో టీచర్లు ఎప్పుడొస్తారా? అని విద్యార్థులు ఎదురు చూసేవారని.. ఇప్పుడు వర్చువల్ క్లాస్‌ల ద్వారా వారే టీచర్లుగా మారారన్నారు. రాష్ట్రంలో 4వేల వర్చువల్ క్లాస్‌రూమ్‌లు, 5వేల డిజిటల్ తరగతి గదులను నడుపుతున్నామన్నారు. విశాఖలోని ఓ హోటల్లో మూడు రోజులపాటు జరిగే ఎడ్యుటెక్–2018 సదస్సును ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విశాఖలో ఇంటెలిజెంట్ గ్లోబల్ హబ్(గేమింగ్ యూనివర్సిటీ) ఏర్పాటుకు యూనిసెఫ్ స్థలం అడిగిందని, ఇందుకు 50 ఎకరాలు కేటాయించనున్నామని తెలిపారు. కాగా, ఈ సదస్సులో ప్రకటించే వైజాగ్ డిక్లరేషన్‌ను యునెస్కో అడాప్ట్ చేసుకునేలా యునెస్కో వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెడతామని తెలిపారు. కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ 9వ తరగతి నుంచి దేశంలో 15 లక్షల క్లాస్‌రూమ్‌ల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. యునెస్కో ఎంజీఐఈపీ తరఫున కిర్జికిస్తాన్ మాజీ అధ్యక్షురాలు రోజా ఒతుబుయేవి ప్రారంభోపన్యాసం చేశారు. మూడు ఎంఓయూలు రాష్ట్రంలో 3 ప్రాజెక్టుల అమలుకు సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శాంసంగ్ మైడ్రీం ప్రాజెక్టు, డిజైన్ యూనివర్సిటీ, స్కిల్లింగ్ ప్రోగ్రాం ఆన్ క్రియేటివ్ డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ ఒప్పందాలు కుదిరాయి. గేమ్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ హ్యాకథాన్ చాలెంజ్ విన్నర్లను ప్రకటించి వారికి సీఎం బహుమతులు అందజేశారు. శాంసంగ్ స్మార్ట్ క్లాసుల కార్యక్రమాన్ని, తెలుగులో తొలి గ్లోబల్ వర్సిటీ యాప్‌ను, యునెస్కో–ఎంజీఐఈపీ అభివృద్ధి పరచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం–కలెక్టివ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌ను సీఎం ప్రారంభించారు. సదస్సులో యునెస్కో డైరెక్టర్ అనంత దురైయప్ప, డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కిడారి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్–వన్ ప్రాజెక్టుకు విశాఖ జిల్లా చోడవరంలో సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మేలోగా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలను పూర్తిచేసి ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా ఎడ్యుటెక్–2018 సదస్సు జరిగిన హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. విలేకరులకు సదస్సు ప్రారంభానికి, మీడియా సమావేశానికి వేర్వేరుగా పాస్లిచ్చారు. సదస్సుకు పక్కనే మీడియా సమావేశం నిర్వహించే హాలులోకి వెళ్లేందుకు కూడా విలేకరుల్ని అనుమతించకుండా కట్టడి చేశారు. చోడవరంలో కార్యక్రమానికీ భద్రత అధికంగానే కల్పించారు. ఏపీ ప్రగతినే తన ఘనతగా మోదీ చెప్పుకుంటున్నారు ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రగతినే తన ఘనతగా చెప్పుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ నిన్న సింగపూర్ వెళ్లారు. ఫిన్‌టెక్ సిటీ బాగుందన్నారు. అది ఎక్కడుంది? విశాఖలో ఉంది. మొన్న జపాన్ పోయారు.. అక్కడ 3 పాయింట్లు మాట్లాడారు. డబుల్ డిజిట్ గ్రోత్ అని చెప్పుకున్నారు. ఎక్కడుంది? ఓన్లీ ఏపీలోనే. సెల్‌ఫోన్ గురించి గొప్పలు చెప్పారు. అవీ ఎక్కువగా ఏపీలోనే తయారవుతున్నాయి. ఇస్రో గురించీ చెప్పారు. అది ఉంది? ఇక్కడే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పైనా ప్రధాని మాట్లాడారు. ఇవన్నీ ఏపీవే.. కానీ ఆయనవిగా చెప్పుకుంటున్నారు’’ అని ఆక్షేపించారు. కాగా, పత్రికల్లో తమ గురించి బాగా రాయాలని మీడియా ప్రతినిధుల్ని అభ్యర్థించారు. -
సినిమా చూపిస్తారు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చేలా మహబూబ్‌నగర్ జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్‌కు అనూహ్యమైన స్పందన రావడం, ఎన్నికల కమిషన్ ఈసారి పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టడంతో పాటు పోలింగ్‌కు అందరూ హాజరయ్యేలా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇక తాజాగా యువతే లక్ష్యంగా వారిని ఆకట్టుకునేలా వర్చువల్ రియాలిటీ షోల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా... యువతే లక్ష్యం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని.. పోలింగ్ పాల్గొనకుంటే ఏమవుతుందిలే అనే భావనతో పలువురు యువతీ, యువకులు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. గత కొన్నేళ్లలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇది నిజమేనని తెలుస్తోంది. ఈసారి అలా కాకుండా యువ ఓటర్లను వంద శాతం పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా వారికి వినూత్న తరహాలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రత్యేక చొరవతో దేశంలోనే మొదటిసారిగా వర్చువల్ రియాలిటీ షోల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఫోన్‌ను వీఆర్ డివైజ్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను వీక్షించే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. ఈ డివైజ్లతో మండలానికి కేటాయించిన ట్రైనర్లు వచ్చి ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతారు. అందుకోసం వీఆర్ఎలు, కంప్యూటర్ ఆపరేటర్లకు మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆధ్వర్యాన వర్చువల్ రియాలిటీ షోపై శిక్షణ ఇచ్చారు. ఇలా చేస్తారు... మండలాల్లో కార్యక్రమాల నిర్వహణ, ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, వీఆర్ డివైజ్‌ల వాడకం, వర్చువల్ రియాలిటీ షోల నిర్వహణపై పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన కల్పించారు. కాగా, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లు, వీఆర్ డివైజ్‌లు అందజేస్తారు. అందులో యాప్ డౌన్లోడ్ చేసి ఊర్లలో ప్రధాన కూడళ్లు, కళాశాలలు, ఇతర రద్దీ ప్రాంతాలకు వెళ్లి ఆ డివైజ్‌లో ఫోన్ ఉంచి యువతీ, యువకులకు ఇస్తూ పోలింగ్‌కు సంబంధించి వీడియోను ప్లే చేస్తారు. తద్వారా వారు నిజమైన పోలింగ్ కేంద్రానికి వెళ్లిన అనుభూతిని పొందడం ద్వారా పోలింగ్‌కు వెళ్లాలనే ఆసక్తి కలుగులుందని అధికారుల భావన. యువ ఓటర్లు 5,90,897 మంది మహబూబ్‌నగర్ జిల్లాలో ఈసారి జరగనున్న సాధారణ ఎన్నికల్లో యువత ఓటు కీలకం కానుంది. ఓటర్ల జాబితాలో వారిదే అగ్రస్థానంగా ఉండటం, అందులో చదువుకున్న వారే ఉండడంతో ఎన్నికలు పారదర్శకతకు వేదిక కానున్నాయి. జిల్లాలో మొత్తం 10,04,481 మంది ఓటర్లు ఉండగా అందులో సగానికి పైగా 18 నుంచి 39 ఏళ్ల లోపు ఉన్నవారు 5,90,897 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు యువ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే, మంచీ చెడులను బేరీజు వేసుకొని పూర్తి అవగాహనతో యువత సమర్థులైన నాయకులకే పట్టం కట్టే అవకాశముంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో యువత ఓట్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానుందని భావిస్తున్నారు. పోలింగ్‌లో పాల్గొంటున్న అనుభూతి వినూత్న తరహాలో అవగాహన కల్పించేందుకు వినియోగించనున్న వర్చువల్ రియాలిటీ షోను ఓటర్లు వీక్షించే సమయంలో స్వయంగా పోలింగ్ బూత్‌లో పాల్గొంటున్న అనుభూతి కలుగుతుంది. క్యూలైన్ మొదలుకుని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, అధికారులెవరెవరు ఉంటారు, ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు వేయడమెలా, ఓటు వేసి బయటికి వచ్చే వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఈ షో ద్వారా వీక్షించే వారికి స్వయంగా పోలింగ్‌లో పాల్గొంటున్న అనుభూతి కలుగుతుంది. జిల్లాలో ఇప్పటికే స్వీప్ కార్యక్రమాలు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, మాక్‌పోలింగ్, కళాకారుల ద్వారా ప్రచారం నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించిన అధికార యంత్రాంగం యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని సరికొత్త విధానంలో వర్చువల్ రియాలిటీ షోల ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలకు ఉపక్రమించింది. అన్ని మండల కేంద్రాల్లోని కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు వంటి ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేస్తున్నారు. సరైన వ్యక్తికే నా ఓటుసరైన వ్యక్తికే నా ఓటు నేను ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశాను. ఓటు హక్కు రాగానే ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎలాంటి వారో తెలుసుకుని మంచి వ్యక్తికే నా ఓటు వేస్తాను. అభ్యర్థి పని తీరు బేరీజు వేసుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటా. నగదు పంపిణీ చేసే నాయకులను నా ఓటుతో వ్యతిరేకిస్తా. – పి.శిరీష, పల్లెమోని కాలనీ గ్రామపంచాయతీ అభివృద్ధి చేసే వారికే... అభివృద్ధి చేసే వారికే నేను నా ఓటు వేస్తా. మొదటి సారిగా నాకు ఈసారే ఓటు హక్కు లభించింది. నా ఓటును వృథా కానివ్వను. అభ్యర్థుల మంచీ చెడులు తెలుసుకుంటా. ఎవరు సమర్థులో గుర్తించాక మంచి వ్యక్తికే ఓటు వేస్తా. నేను డబ్బులు పంపిణీ చేసే వారికి ఓటు వేయను. – ఎం.శిల్ప, బండ్లగేరి, మహబూబ్‌నగర్ -
అలరించిన డెమో షో..
కాజీపేట అర్బన్: ప్రపంచాన్ని క్రికెట్ ఆట శాసిస్తుందంటే అతిశయోక్తి కాదు. నేడు చిన్న పిల్లల నుంచి వృద్ధులకు వరకు టీవీల్లో క్రికెట్ వస్తుందంటే బయట అడుగుపెట్టకుండా టీవీలకే అత్తుకుపోతారు. అంతటి క్రేజ్ గల క్రికెట్ ఆటకు నూతన ఓరవడినందిస్తూ సరికొత్తగా వర్చువల్ రియాల్టీ (కాల్పనిక) క్రికెట్‌కు రూపకల్పన చేశారు. ఐఐటీ ఢీల్లీలో విద్యను పూర్తి చేసిన సిద్దిపేటకు చెందిన త్రివిక్రం, హైదరాబాద్‌కు చెందిన వసంతసాయి సాంకేతిక విద్యనభ్యసించి ప్రోయుగా అనే సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. ప్రోయుగా కంపెనీకి సీఈఓగా భాద్యతలు నిర్వర్తిస్తున్న త్రివిక్రం రూ.కోటి జీతాన్ని అందించే కొలువును సైతం వదులుకుని ప్రపంచానికి తన మేధా శక్తి అందించాలనే తపనతో తొమ్మిది నెలలు శ్రమించి ‘ఇంపాక్ట్ బిలియన్’ అనే సందేశంతో వర్చువల్ రియాల్టీ క్రికెట్‌ను ఆవిష్కరించాడు. ఆడుతున్న అనుభూతి... ప్రోయుగా కంపెనీ ద్వారా రూపొందించిన స్టార్టప్ ఐబీ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో ఆహ్లాదకరమైన మైదానంలో చుట్టూ ప్రేక్షకులు, బరిలో క్రీడాకారులు, బంతిని విసురుతున్న బౌలర్‌ను తలపిస్తూ బ్యాటింగ్ చేస్తున్న అనుభూతిని అందిస్తుంది. కళ్లకు ప్రత్యేకంగా రూపొందించిన హెడ్సెట్, కస్టమ్ బ్యాట్, సెన్సార్లను ప్రత్యేకంగా రూపొందించారు. వివిధ సాప్ట్వేర్ల అనుసందానంతో హెడ్‌సెట్‌ను ధరించినప్పుడు దానికి అనుసంధానంగా ఉన్న మానీటర్లో కనిపించే అంతర్జాతీయ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న అనుభూతితో క్రికెట్లో లోకంలో విహరిస్తారు. నిజంగా బౌలింగ్‌కు ఎదురొడ్డి బ్యాటింగ్ చేస్తున్నట్లుగా సిక్సర్లు కొడుతారు. వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన ప్రోయుగా తన స్టార్టప్ వీఆర్ క్రికెట్ విశేషంగా అలరించింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆసక్తిగా ఐబీ క్రికెట్‌ను ఆడేందుకు ఉత్సాహాన్ని చూపారు. వీస్పోర్ట్గా ప్రపంచానికి వర్చుయల్ క్రికెట్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు గాను ఏప్రిల్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 25 వేల ఐబీ క్రికెట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాబోవు రోజుల్లో ప్రస్తుతం ఆదరణ పొందుతున్న క్రీడల మాదిరిగా వర్చుయల్ క్రికెట్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రోయుగా ముందుకు సాగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం... ఫిబ్రవరి 22న లక్నోలో నిర్వహించిన ఐటీ ఇన్వెస్టర్స్ సమీట్లో భాగంగా ప్రోయుగా రూపొందించిన ఐబీ క్రికెట్‌ను రాష్ట్రపతి రాంనా«థ్ కోవింద్ తొలి బ్యాటింగ్‌తో ప్రారంభించారు. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, యూనియన్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ బ్యాట్‌పై తొలి సంతకం చేశారు. వీస్పోర్ట్స్‌గా ప్రపంచానికి... ప్రోయుగా కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన ఐబీ క్రికెట్‌ను వీస్పోర్ట్స్‌గా ప్రపంచ వ్యాప్తంగా అందించేందుకు కృషిచేస్తున్నాం. ప్రఖ్యాత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మంచి ఆదరణ సాధిస్తుందని అభినందించా రు. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వీస్పోర్ట్స్‌గా ఐబీ క్రికెట్‌ను ఏర్పాటు చేసేందుకు ఏప్రిల్‌లో 25 వేల ఐబీ క్రికెట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. – నీరధ్, వినోద్కర్, పంకజ్,ఐబీ క్రికెట్ నిర్వాహకులు -
మార్స్‌పై నడుస్తారా? సరే రండి..
వాషింగ్టన్: ఇప్పటిదాకా చంద్రుడిపైకే వెళ్లలేదు. మరి మార్స్‌పై నడవడమేంటి? అదీ సింపుల్‌గా ‘మార్స్‌పై నడుస్తారా? సరే రండి..’ అంటూ సింపుల్‌గా ఆహ్వానించడమేంటి? అయినా ఎవరుపడితే వారు మార్స్‌పై ఎలా నడుస్తారు? ఎంతో శిక్షణ పొందిన వ్యోమగాములే ఇలా నడవడం సాధ్యం కదా? ... పై శీర్షిక చూసిన తర్వాత ఇలాంటి ఎన్నో డౌట్లు వస్తున్నాయి కదూ..! నిజమే, అయితే మార్స్‌పై నడిచేందుకు మీరు అక్కడిదాకా వెళ్లనక్కర్లేదు. మీ లివింగ్ రూమ్‌లో ఉంటూనే మార్స్‌పై క్యాట్ వాక్ చేయొచ్చు. ఎలాగంటారా? ఈ సదుపాయాన్ని గూగుల్ మీకు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం మీ దగ్గర ఉండాల్సిందల్లా ఓ వర్చువల్ రియాల్టీ గ్యాడ్జెట్ మాత్రమే. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ చిత్రీకరించిన దృశ్యాలను గూగుల్ వీఆర్ టెక్నాలజీ సాయంతో మీ గదికి తీసుకొస్తోంది. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా ఎటువంటి యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్.. బ్రౌజింగ్ చేస్తే చాలు. వీఆర్ గ్యాడ్జెట్‌ను కళ్లకు తగిలించుకొని, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, బ్రౌజింగ్ చేస్తే... ఏకంగా మార్స్‌పై నడుస్తున్న ఫీలింగ్ కలగడం ఖాయమని చెబుతున్నారు గూగుల్ క్రియేటివ్ ల్యాబ్ నిర్వాహకులు. మరింకెందుకు ఆలస్యం.. నడిచేద్దామా? -
గూగుల్ ఎర్త్ కొత్త వెర్షన్‌పై లుక్కేయండి
గూగుల్ ఎర్త్ గురించి మీకు తెలుసుగా... అదేనండీ.. కంప్యూటర్ తెరపై ప్రపంచం మొత్తాన్ని మీ కళ్లముందు ఉంచే అప్లికేషన్!.. ఆ.. తెలుసు అయితే ఏంటి? ఈమధ్య కాలంలో ఎప్పుడైనా దీన్ని వాడారా? లేదంటే వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఓ లుక్కేయండి! ఏంటబ్బా అంత స్పెషల్? అంటారా..? చాలానే ఉన్నాయి. మచ్చుకు కొన్ని చూద్దామా? ఓకే.. లెట్స్ స్టార్ట్. కొత్త గూగుల్ ఎర్త్‌ను ఓపెన్ చేయగానే.. స్క్రీన్ పై ఎడమవైపున ఓ బుల్లి డైస్ లాంటిది కనిపిస్తుంది. కర్సర్‌ను దానిపై కదిలిస్తే ఐ ఆమ్ ఫీలింగ్ లక్కీ అని ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. భూ ప్రపంచంపై ఉన్న ఎన్నో వింతలూ విడ్డూరాల గురించి మీకు ఒక్కటొక్కటే తెలుస్తూంటుంది. వికీపీడియాలోనూ ఇలాంటివి ఉంటాయిగా? ఉంటాయి కానీ.. వాటి పేర్లు తెలిస్తేగానీ వెతుక్కోలేము. ఎర్త్లోనైతే క్లిక్ చేస్తే చాలు.. బోలెడంత సమాచారం. అలా అలా వచ్చేస్తూంటుంది. ఒకటా.. రెండా దాదాపు 20 వేల ప్రదేశాలు, వింతల తాలూకూ సమాచారం ఉంది మరి! అంతేనా అనొద్దు.. దుబాయిలోని అట్లాంటిస్ హోటల్ మొదలుకొని ప్రపంచంలోని 21 వింతలను వీఆర్‌లో చూసేందుకూ వీలు కల్పిస్తోంది ఈ కొత్త వెర్షన్ గూగుల్ ఎర్త్. అమెరికా నేషనల్ పార్కులలో ఆన్లైన్లోనే తిరుగుతూ ఒక్కో అంశం గురించి తెలుసుకోవాలన్నా... చింపాంజీ పరిశోధకురాలు జేన్ గోడాల్తో కలిసి టాంజానియాలో విహరించాలన్నా సాధ్యమే. వాయేజర్ బటన్‌ను నొక్కితే చాలు.. బీబీసీ ఎర్త్ కార్యక్రమాలు, ఇతర టీవీ డాక్యుమెంటరీల సాయంతో ఆయా ప్రాంత విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. అప్డేట్ చేసిన గూగుల్ ఎర్త్ అప్లికేషన్ ప్రస్తుతం వెబ్‌కు మాత్రమే పరిమితం. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు మరో వారం రోజుల్లో... ఐఫోన్ వినియోగదారులకు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని గూగుల్ చెబుతోంది! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కట్టప్ప ఈరోజైనా సీక్రెట్ చెబుతాడా..?
హైదరాబాద్: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ మూవీ చూసిన అందిరికీ అతిపెద్ద సందేహం వచ్చింది. సింహాసనానికి కట్టుబానిసగా ఉన్న కట్టప్ప(సత్యరాజ్) తనను మామ అంటూ ప్రేమగా పిలిచే బాహుబలి (ప్రభాస్)ని ఎందుకు చంపాడన్న ప్రశ్న తలెత్తింది. అయితే నేడు నగరంలో జరుగుతున్న బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాయంత్రం ప్రారంభమైంది. బాహుబలి టీమ్ అఫీషియల్ ట్విట్టర్ లో అభిమానులను మరోసారి ఊరించింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ చర్చిస్తున్న ఓ ఫొటోను మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. కనీసం ఈరోజైనా కట్టప్ప.. బాహుబలిని చంపడం వెనక ఉన్న మర్మాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మనకు చెబుతాడా ఎదురుచూద్దాం అనే అర్థం వచ్చేలా వారి పోస్ట్‌లో రాసుకొచ్చారు. మూవీలోని ప్రధాన పాత్రధారులు అందరూ ఒక్కవేదిక వద్దకు రావడంలో బాహుబలి అభిమానులు ఎంతో హుషారుగా ఈవెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను బాహుబలి యూనిట్ వర్చువల్ రియాల్టీలో ప్రసారం చేయనుండటం గమనార్హం. బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ - ఫోటో గ్యాలరీ Maybe today will be the day Sathya Raj tells us, why Kattappa killed Baahubali… or maybe not… #Baahubali2PreReleaseEvent pic.twitter.com/X75dDafcRt — Baahubali (@BaahubaliMovie) 26 March 2017 -
బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తున్నా..
హైదరాబాద్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి-2'. ఈ మూవీ కోసం టాలీవుడ్ అభిమానులతో పాటు బాలీవుడ్ దర్శకనిర్మాతలు, నటులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో నేటి సాయంత్రం ప్రారంభమైన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొనేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ నగరానికి వచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను పాలు పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. భారత సినీ చరిత్రలో ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి ప్రాజెక్టులు ఎవర్ గ్రీన్ అని కరణ్ ప్రశంసించాడు. భారత్‌లో గొప్ప దర్శకుడు అని చెప్పడం రాజమౌళి స్థాయిని చాలా తక్కువచేసి చెప్పడమే అవుతుందని, హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ లాంటి వ్యక్తులతో పోలిక సరైనదని చెప్పాడు. బాహుబలిని మనకు అందించిన నిర్మాతలను కచ్చితంగా అభినందించక తప్పదన్నాడు. తనను ఇలాంటి భారీ ఈవెంట్‌కు ఆహ్వానించినందుకు బాహుబలి యూనిట్‌కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ ధన్యావాదాలు తెలిపాడు . ప్రపంచంలోనే తొలిసారిగా బాహుబలి-2 సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను వర్చువల్ రియాల్టీలో ప్రసారం చేసి మూవీ యూనిట్ రికార్డు నెలకొల్పనుంది. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ రియాల్టీలోనూ ప్రసారం చేసేందుకు సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లు అందిస్తున్న సంస్థ ఏఎండీకి చెందిన రేడియాన్ టెక్నాలజీస్ గ్రూప్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఫంక్షన్‌ను వీక్షించేందుకు బాహుబలి అభిమానులు తరలి వచ్చారు. బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ - ఫోటో గ్యాలరీ On my way to the #Baahubali2PreReleaseEvent in Hyderabad!!!! The countdown to the biggest movie event begins!!! @ssrajamouli pic.twitter.com/5pmZeZXC0a — Karan Johar (@karanjohar) 26 March 2017 -
వర్చువల్ రియాల్టీలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్!
ట్రెయిలర్‌తోనే రికార్డులు సృష్టించిన మెగా మూవీ ‘బాహుబలి–2’ మరో సంచలనానికి తెరతీస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను వర్చువల్ రియాల్టీలో ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం ఈ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ రియాల్టీలోనూ ప్రసారం చేసేందుకు సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లు అందిస్తున్న సంస్థ ఏఎండీకి చెందిన రేడియాన్ టెక్నాలజీస్ గ్రూప్ అన్ని ఏర్పాట్లు చేసింది. ‘బాహుబలి–2’ నిర్మాణ సమయంలో ఈ సంస్థ రెండు వర్చువల్ రియాల్టీ బిట్లను అభివృద్ధి చేసింది. ‘బీబీ360సీసీ’ పేరుతో అభివృద్ధి చేసిన 32 కెమెరాలున్న సూపర్ వీఆర్ క్యాప్చరింగ్ కెమేరాతో వీటిని చిత్రీకరించింది. ఈ 32 కెమేరాల్లోని దృశ్యాలను సీన్‌గా మార్చేందుకు లూమ్ పేరుతో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఒకదాన్ని తయారు చేశారు. ఒకవైపు షూటింగ్ జరుగుతూండగానే.. మరోవైపు ఈ సాఫ్ట్వేర్ వర్చువల్ రియాల్టీ సీన్స్‌ను సిద్ధం చేస్తూంటుంది. ఇలా చిత్రీకరించిన సీన్స్‌ను వీఆర్ హెడ్‌సెట్‌తో చూసినప్పుడు.. ప్రేక్షకుడికి తాను సన్నివేశం మధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుంది. అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ చేసే యుద్ధ విన్యాసాలు మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ), బీబీ360సీసీ కెమేరా, లూమ్ సాఫ్ట్వేర్లను కలిపి ఉపయోగించడం ద్వారా అత్యద్భుతమైన నాణ్యతతో వర్చువల్ రియాల్టీ సన్నివేశాలను సిద్ధం చేయవచ్చునని ఏఎండీ అంటోంది. పైగా.. లూమ్ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ సోర్స్ పద్ధతిలో అభివృద్ధి చేసినందున.. దీన్ని ఎవరైనా వాడుకునే వీలుంటుందని సంస్థ ఉన్నతాధికారి రాజా కోడూరి తెలిపారు. ‘బాహుబలి’ కోసం తాము వీఆర్‌లో రెండు సీన్స్ సిద్ధం చేశామని, దీంట్లో ఒకటి బాహుబలి సెట్స్‌కు సంబంధించినది కాగా, రెండోది ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబలి’ అని ఆయన చెప్పారు. బాహుబలి సెట్స్ తాలూకు వీఆర్ క్లిప్‌ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రత్యేకమైన పాడ్స్లలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శించనున్నారు. -
తొలి వీఆర్ సినిమాకు భారత్‌లో శ్రీకారం
న్యూఢిల్లీ: ‘డిస్ప్లేస్డ్’ అనే వర్చువల్ రియాలిటీ (వీఆర్) సినిమాను మనం చూస్తే ఎలాంటి అనుభూతి చెందుతాం? వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల్లో బతుకు చిధ్రమైన ముగ్గురు శరణార్థి పిల్లలు తమ విషాధ గాధలను వివరించి చెప్పడమే ఆ సినిమా కథ. ఆ సినిమాను చూస్తున్న మనం వారితో ప్రత్యక్ష్యంగా మాట్లాడవచ్చు. వారితో కలసి పక్క పక్కనే నడవచ్చు. వారిని తాకిన స్పర్శ అనుభూతిని కూడా పొందవచ్చు. అదే బాహుబలి సినిమాను వీఆర్‌లో చూశామనుకోండి? బాహుబలి స్థానంలో అంటే, ప్రభాస్ స్థానంలో ఎత్తై జలపాతాలను మనమూ ఎక్కవచ్చు. ఇదే వీఆర్ టెక్నాలజీ సినిమా సృష్టించే మాయాజాలం. వీఆర్ సినిమాలకు హాలివుడ్ ఎప్పుడో శ్రీకారం చుట్టినప్పటికీ భారత్ మాత్రం ఇంకా వెనకబడే ఉంది. ఇక ఆ బెంగ కూడా ఎంతో కాలం అక్కర్లేదు. బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ గాంధీ భారత్‌లో తొలిసారిగా వీఆర్ సినిమాను తీస్తున్నారు. ‘షిప్ ఆఫ్ థీసియస్’ చిత్రం ద్వారా బాలీవుడ్లో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆనంద్ గాంధీ వినూత్న దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెల్సిందే. ఆయన తీసిన తొలి చిత్రానికి జాతీయ ఉత్తమ ఫీచర్ సినిమాతోపాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. భారత్‌లో తొలి వీఆర్ సినిమాను తీసేందుకు ఆయన ‘మెమిస్ కల్చర్ ల్యాబ్’ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన రచయితలను, సినిమా నిర్మాతలను, ఇన్నోవేటర్లు, విజువల్ కళాకారులు, మేథావులతో పెద్ద ఎత్తున సంప్రతింపులు జరుపుతున్నారు. ప్రముఖ డాక్యుమెంటరీ డెరైక్టర్ ఫైజ్ అహ్మద్ ఖాన్ సహాయ సహకారాలు కూడా ఆనంద్ గాంధీ తీసుకుంటున్నారు. ఫైజ్ అహ్మద్‌ఖాన్ ఇటీవలనే చత్తీస్‌గఢ్‌లోని గనులపైనా ‘కాస్ట్ ఆఫ్ కోల్’ అనే డాక్యుమెంటరీని వీఆర్ టెక్నాలజీతో తీశారు. తాను తన సినిమా కోసం ఇశాక్ అశ్మోవ్ తదితరులు రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలు చదివానని ఆనంద్ గాంధీ తెలిపారు. మనసుకు నచ్చినట్లు, హృదయానికి హత్తుకునేలా కథలు చెప్పడంలో భారతీయులు అగ్రగణ్యులేనని, ఆ కథలను వీఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో మరింత అనభూతిపరంగా చెప్పవచ్చని ఆయన అంటున్నారు. టీవీల్లో వీఆర్ వీడియో గేమ్స్, వీఆర్ సినిమాలను చూసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే భారతీయులకు అందుబాటులోకి వచ్చింది. వీటిని చూడాలంటే వీఆర్ గ్లాసెస్‌ను ధరించక తప్పదు. ఈ గ్లాసులు మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. మున్ముందు సోషల్ మీడియా కూడా వీఆర్ మయమే అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్ ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుండగా, ఫేస్‌బుక్‌ను వీఆర్ మయం చేసేందుకు జుకర్‌బర్గ్ కృషి చేస్తున్నారు. రానున్న యాభై ఏళ్లలో అంగారక గ్రహంపై మానవులు నివాసం ఏర్పాటు చేసుకుంటారో, లేదో చెప్పలేముగానీ ఈ వీఆర్ పరిజ్ఞానం ద్వారా మాత్రం అది సాధ్యమవుతుంది. -
వర్చువల్ రియాల్టీపై ఫేస్బుక్ దృష్టి
వర్చువల్ రియాల్టీలో అగ్రగామిగా నిలవడానికి సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తీవ్రంగా కృషిచేస్తోంది. యూరప్ లో తన వొకొలస్ వర్చువల్ రియాల్టీ డివిజన్ ను విస్తరించడానికి లండన్ లో నిపుణులను నియమించుకుంది. 2014 లో 200 కోట్ల డాలర్ల వొకొలస్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్న ఆరునెలల్లోనే బ్రిటిష్ టీమ్ ఇంజనీర్లను, డెవలపర్ సిబ్బందిని పెంచుకోవడం ప్రారంభించింది. భవిష్యత్తులో పెరగబోతున్న వర్చువల్ రియాల్టీ డిమాండ్ కు తగ్గట్లుగా మారి.. ఆ రంగంలో తామే అగ్రగామిగా నిలవాలని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిర్ణయించారు. గతేడాది బ్రిటన్‌కు చెందిన వర్చుయువల్ రియాల్టీ స్టార్టప్ సర్ రియల్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. ఈ టీమ్ ను రెడ్ మాండ్ లోని వొకోలస్ ఆఫీసుకు తరలించింది. గూగుల్ లో సీనియర్ ఇంజనీర్ గా పనిచేసిన మైక్ లీబ్యూను బ్రిటన్ వొకొలస్ టీమ్ కు అధినేతగా కంపెనీ నియమించింది. జనవరిలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. వచ్చే తరమంతా సోషల్ మీడియాలో వర్చువల్ రియాల్టీ మీదే ఎక్కువ సమయం గడుపుతుందని అంచనా. ఒకరితో మరొకరు సంప్రదింపులు జరపడానికి ఇది అతి పెద్ద టెక్నాలజీగా రూపొందనుందని జుకర్ బర్గ్ విశ్వసిస్తున్నారు. సోషల్ ప్లాట్ ఫాంలో వర్చువల్ రియాల్టీ ఎక్కువగా అభివృద్ధి చెందబోతుందని, వచ్చే తరంలో రాబోతున్న సోషల్ యాప్స్ కు, వర్చువల్ రియాల్టీకి కొత్త టీమ్ ను నియమించుకోబోతున్నట్టు మార్క్ జుకర్ బర్గ్ ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించారు. వర్చువల్ రియాల్టీ రంగంలో అగ్రస్థానాల కోసం ఫేస్ బుక్, గూగుల్, సోనీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. యాపిల్ సైతం ఈ టెక్నాలజీపై దృష్టి సారించింది. -
గాలిలో మీ ఫోన్ ఫీచర్లు కనిపిస్తే..!
మన ఫోన్లోని ఫీచర్స్‌ని స్క్రీన్ మీద కాకుండా త్వరలో గాలిలో చూడబోతున్నామా? అంటే అవుననే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా వర్చువల్ స్ర్కీన్ పేరు విన్నారా? అదేనండీ ఎదురుగా కంటికి కనిపించకపోయినా సాఫ్ట్వేర్ సాయంతో చూపడం. ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ టెక్నాలజీని ఉపయోగించే మేజిక్ లీప్ అనే అమెరికన్ స్టార్టప్ మనకు కావలసినప్పుడు అవసరమైన చోట దీన్ని ఉపయోగించుకునేలా తయారుచేయడానికి నిర్ణయించుకుంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో గాలిలోనే యాప్స్ సాయంతో వర్క్, ఆన్లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ తదితరాలను చేసుకోవడం ఉంది. ఈ వీడియో అంతా ఒక గదిలోనే చిత్రించడం వల్ల పగటిపూట ఎలా పనిచేస్తుందోననే అనుమానాలూ ఉన్నాయి. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి సమాచారం అధికారికంగా ప్రకటించకపోయినా కళ్లజోడు లేక కాంటక్ట్ లెన్స్‌లను ఉపయోగించడం వల్ల పగటిపూట కూడా ఈ టెక్నాలజీని వాడేందుకు ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇది మైక్రోసాఫ్ట్ 2015లో విడుదల చేసిన హాలోగ్రామ్(కాంతితో ఏ ఆకారన్నయినా తయారుచేసుకోవడం)ను పోలినట్లుగా ఉంది. ఇప్పటికే గూగుల్ ఈ టెక్నాలజీ మీద పరిశోధనలు చేస్తూ 3డి కళ్లజోడు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి 2015లోనే విడుదల కావాల్సిన గూగుల్ కళ్లజోడుకు మరికొన్ని ఫీచర్స్‌ను జతచేసేందుకు ఆ పనిని విరమించుకుంది. ప్రస్తుతం గూగుల్‌తో పాటు ఆలీబాబా, క్వాల్కామ్లు ఈ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. -
ఎక్కడో ఉండి, మరెక్కడో ఉన్నట్లు సెల్ఫీ దిగొచ్చు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల పట్ల పెరుగుతున్న మోజును దృష్టిలో పెట్టుకొని ఇందులో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది ఫేస్బుక్. ప్రస్తుతం మనకు నచ్చిన ప్రాంతంలో, నచ్చిన వారితో సెల్ఫీ తీసుకోవాలంటే నచ్చిన వారిని తీసుకొని ఆ నచ్చిన ప్రాంతానికి భౌతికంగా వెళ్లాల్సిందే. ఇకముందు అలాంటి అవసరం ఉండదు. ఎక్కడ ఉన్నా మరో ప్రాంతంలో ఉన్నట్టు సెల్ఫీ దిగవచ్చు. నచ్చిన వారు కూడా మన పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. పక్క పక్కనే ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఉదాహరణకు భారత్‌లో ఒకరుండి, లండన్‌లో ఒకరుండి, ఇద్దరు కలసి అమెరికాలో ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఫేస్బుక్ ఇటీవలనే మార్కెట్లోకి విడుదల చేసిన వర్చువల్ రియాలిటీ యాప్, హెడ్‌సెట్‌ను ఉపయోగించి ఇలాంటి సెల్ఫీలను సాధించవచ్చని ఫేస్బుక్ మంగళవారం నాడిక్కడ నిర్వహించిన వార్షిక సమావేశ వేదికపై ప్రదర్శించి చూపింది. అందులో ఇద్దరు వీఆర్ హెడ్ సెట్ కలిగిన వారు సిలికాన్ వ్యాలీ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల ఉండి, లండన్ వంతెనపై ఉన్నట్లుగా సెల్ఫీ దిగారు. అయితే ఆ ఛాయా చిత్రం మాత్రం ఆర్టిస్ట్ వేసిన రేఖా చిత్రంగానే కనిపించింది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, ఇది భవిష్యత్ రియాలిటీకి నేడు పునాది వేయడమేనని ఫేస్బుక్ డెవలపర్ వివరించారు. వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకోవడం ఎలా సాధ్యమైందో, అలాగే వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌కు వీడియో కాల్‌ను లింక్ చేయడం ద్వారా అసలైన చిత్రాల్లాగా సెల్ఫీలు ఉండేలా చేయవచ్చని చెప్పారు. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. -
క్రీజులో మీరు... ఆండర్సన్ బౌలింగ్!
మీరు క్రికెట్ వీరాభిమానులా? ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వేగంగా విసిరే బంతుల్ని మీరే స్వయంగా క్రీజులో ఉండి ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? ఊహల్లో తప్ప నిజం కాదని మీరు నిరుత్సాహపడకండి. ఇప్పుడు మీకు అలాంటి కొత్త అనుభూతిని కల్పించే హెడ్సెట్ ఒకటి తయారైంది. ఈ ఆక్యులస్ రిఫ్ట్ హెడ్‌సెట్‌ను ధరిస్తే, నిజమని భ్రమ కలిగించేలా వర్చ్యువల్ రియాలిటీ అనుభూతి కలుగుతుంది. విషయం ఏమిటంటే, ఈ హెడ్సెట్ కోసం ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్ బౌలింగ్ తాలూకు హెచ్.డి. ఫుటేజ్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అభిమానులు ఈ హెడ్‌సెట్‌ను తలకు పెట్టుకోగానే తక్షణమే క్రీజులోకి వెళ్ళినట్లూ, గంటకు 80 మైళ్ళ వేగంతో ఆండర్సన్ వేసే బంతులను ఎదుర్కొంటున్నట్లూ అనుభూతి కలుగుతుంది. యార్క్‌షైర్ టీ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఇ.సి.బి) కలసి రూపొందించిన ఈ హెడ్‌సెట్‌కు ‘ఎ ప్రాపర్ బాల్’ అని పేరు పెట్టారు. మైదానంలో ఆట చూసేందుకు వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ వర్చ్యువల్ రియాలిటీ (వి.ఆర్) టెక్నాలజీ మరపురాని అనుభూతే.