సినిమా చూపిస్తారు | Awareness on EVMs And VVPATs In Mahaboobnagar | Sakshi
Sakshi News home page

సినిమా చూపిస్తారు

Published Thu, Nov 8 2018 10:14 AM | Last Updated on Thu, Nov 8 2018 10:56 AM

Awareness on EVMs And VVPATs In Mahaboobnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రం వద్దకు తీసుకొచ్చేలా మహబూబ్‌నగర్‌ జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్‌కు అనూహ్యమైన స్పందన రావడం, ఎన్నికల కమిషన్‌ ఈసారి పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టడంతో పాటు పోలింగ్‌కు అందరూ హాజరయ్యేలా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇక తాజాగా యువతే లక్ష్యంగా వారిని ఆకట్టుకునేలా వర్చువల్‌ రియాలిటీ షోల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా... 

యువతే లక్ష్యం 
రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేని.. పోలింగ్‌ పాల్గొనకుంటే ఏమవుతుందిలే అనే భావనతో పలువురు యువతీ, యువకులు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. గత కొన్నేళ్లలో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇది నిజమేనని తెలుస్తోంది. ఈసారి అలా కాకుండా యువ ఓటర్లను వంద శాతం పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చేలా వారికి వినూత్న తరహాలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ప్రత్యేక చొరవతో దేశంలోనే మొదటిసారిగా వర్చువల్‌ రియాలిటీ షోల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో యాప్‌ను మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్‌ను వీఆర్‌ డివైజ్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలింగ్‌ ప్రక్రియను వీక్షించే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. ఈ డివైజ్‌లతో మండలానికి కేటాయించిన ట్రైనర్లు వచ్చి ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతారు. అందుకోసం వీఆర్‌ఎలు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆధ్వర్యాన వర్చువల్‌ రియాలిటీ షోపై శిక్షణ ఇచ్చారు.

ఇలా చేస్తారు... 
మండలాల్లో కార్యక్రమాల నిర్వహణ, ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వీఆర్‌ డివైజ్‌ల వాడకం, వర్చువల్‌ రియాలిటీ షోల నిర్వహణపై పూర్తి స్థాయిలో అధికారులు అవగాహన కల్పించారు. కాగా, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి త్వరలోనే ఆండ్రాయిడ్‌ ఫోన్లు, వీఆర్‌ డివైజ్‌లు అందజేస్తారు. అందులో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఊర్లలో ప్రధాన కూడళ్లు, కళాశాలలు, ఇతర రద్దీ ప్రాంతాలకు వెళ్లి ఆ డివైజ్‌లో ఫోన్‌ ఉంచి యువతీ, యువకులకు ఇస్తూ పోలింగ్‌కు సంబంధించి వీడియోను ప్లే చేస్తారు. తద్వారా వారు నిజమైన పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన అనుభూతిని పొందడం ద్వారా పోలింగ్‌కు వెళ్లాలనే ఆసక్తి కలుగులుందని అధికారుల భావన. 

యువ ఓటర్లు 5,90,897 మంది 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈసారి జరగనున్న సాధారణ ఎన్నికల్లో యువత ఓటు కీలకం కానుంది. ఓటర్ల జాబితాలో వారిదే అగ్రస్థానంగా ఉండటం, అందులో చదువుకున్న వారే ఉండడంతో ఎన్నికలు పారదర్శకతకు వేదిక కానున్నాయి. జిల్లాలో మొత్తం 10,04,481 మంది ఓటర్లు ఉండగా అందులో సగానికి పైగా 18 నుంచి 39 ఏళ్ల లోపు ఉన్నవారు 5,90,897 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు యువ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే, మంచీ చెడులను బేరీజు వేసుకొని పూర్తి అవగాహనతో యువత సమర్థులైన నాయకులకే పట్టం కట్టే అవకాశముంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో యువత ఓట్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానుందని భావిస్తున్నారు. 

పోలింగ్‌లో పాల్గొంటున్న అనుభూతి
వినూత్న తరహాలో అవగాహన కల్పించేందుకు వినియోగించనున్న వర్చువల్‌ రియాలిటీ షోను ఓటర్లు వీక్షించే సమయంలో స్వయంగా పోలింగ్‌ బూత్‌లో పాల్గొంటున్న అనుభూతి కలుగుతుంది. క్యూలైన్‌ మొదలుకుని పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, అధికారులెవరెవరు ఉంటారు, ఈవీఎం, వీవీ ప్యాట్‌ల ద్వారా ఓటు వేయడమెలా, ఓటు వేసి బయటికి వచ్చే వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఈ షో ద్వారా వీక్షించే వారికి స్వయంగా పోలింగ్‌లో పాల్గొంటున్న అనుభూతి కలుగుతుంది. జిల్లాలో ఇప్పటికే స్వీప్‌ కార్యక్రమాలు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, మాక్‌పోలింగ్, కళాకారుల ద్వారా ప్రచారం నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించిన అధికార యంత్రాంగం యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని సరికొత్త విధానంలో వర్చువల్‌ రియాలిటీ షోల ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలకు ఉపక్రమించింది. అన్ని మండల కేంద్రాల్లోని కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు వంటి ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేస్తున్నారు.  
 

సరైన వ్యక్తికే నా ఓటుసరైన వ్యక్తికే నా ఓటు
నేను ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశాను. ఓటు హక్కు రాగానే ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎలాంటి వారో తెలుసుకుని మంచి వ్యక్తికే నా ఓటు వేస్తాను. అభ్యర్థి పని తీరు బేరీజు వేసుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటా. నగదు పంపిణీ చేసే నాయకులను నా ఓటుతో వ్యతిరేకిస్తా.
– పి.శిరీష, పల్లెమోని కాలనీ గ్రామపంచాయతీ 

అభివృద్ధి చేసే వారికే... 
అభివృద్ధి చేసే వారికే నేను నా ఓటు వేస్తా. మొదటి సారిగా నాకు ఈసారే ఓటు హక్కు లభించింది. నా ఓటును వృథా కానివ్వను. అభ్యర్థుల మంచీ చెడులు తెలుసుకుంటా. ఎవరు సమర్థులో గుర్తించాక మంచి వ్యక్తికే ఓటు వేస్తా. నేను డబ్బులు పంపిణీ చేసే వారికి ఓటు వేయను. 
– ఎం.శిల్ప, బండ్లగేరి, మహబూబ్‌నగర్‌  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement