బ్యాంకుల గురించి సామాజిక మాధ్యమాల్లో బోలెడు జోక్స్, మీమ్స్ కనిపిస్తుంటాయి. మచ్చుకు కొన్ని...
‘ఈరోజు మీకు బ్యాంకులో పని ఉందా? అయితే ఇవి మీతో పాటు తెచ్చుకోవడం అనివార్యం...
1. ఐడీ ప్రూఫ్, 2. లంచ్ బాక్స్, 3.ప్లేయింగ్ కార్డ్స్ 4. డిన్నర్ సరంజామా, 5.బెడ్‌షీట్, 6. మెత్తని దిండు, 7. బ్లాంకెట్ 8.ఫోన్ చార్జర్... వీటన్నికంటే ముఖ్యమైనది బోలెడు ఓపిక’
‘ఈ అమ్మాయి పేరు సువర్ణముఖి. బ్యాంకుకు వెళ్లే ముందు ఎంత ఫ్రెష్‌గా ఉందో చూడండి. బ్యాంకుకు వెళ్లి వచ్చిన తరువాత చంద్రముఖిగా మారిన సువర్ణముఖి రూపం ఇది’
‘ఒక బ్యాంకు ఉద్యోగి వాచ్‌లో టైమ్ స్థానంలో లంచ్, లంచ్, లంచ్... అని ఉంటుంది. గడియారం ముళ్లు వాటి మీదే తిరుగుతుంటాయి’ ఇవి అతిశయోక్తితో కూడిన జోక్స్ అయినప్పటికీ, సంప్రదాయ బ్యాంకులకు వెళ్లడానికి నవతరంలో ఎక్కువమంది అంతగా ఆసక్తి చూపడం లేదు. దీని కారణాలలో క్యూ, దూరభారంలాంటివి ఉన్నాయి. బ్యాంకులకు వెళ్లడానికి ఇష్టపడని మిలీనియల్స్ నియో బ్యాంకులపై ఆసక్తి చూపుతున్నారు.
ఏమిటీ నియో బ్యాంకులు?
నియో బ్యాంకులు అనేవి వర్చువల్ బ్యాంక్స్. వీటికి ఫిజికల్ బ్రాంచ్‌లు ఉండవు. అయితే ఫిజికల్ బ్రాంచ్‌లు ఉన్న ప్రముఖ బ్యాంకులతో వీటికి భాగస్వామ్యం ఉంటుంది. ‘క్యూ’ కంటే ‘క్విక్’ విధానానికి ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఈ బ్యాంకులను అమితంగా ఇష్టపడుతుంది. సంప్రదాయ బ్యాంకులకు ‘విశ్వసనీయత’ అనేది గట్టి పునాది అయినప్పటికీ, వీటితో పోల్చితే నియో బ్యాంకులు రకరకాల ప్రత్యా మ్నాయ అవకాశాలు కల్పిస్తున్నాయి. మనీ మేనేజ్‌మెంట్ టూల్స్ అనేవి మరో ప్లస్ పాయింట్‌గా మారింది. వీటి ద్వారా తమ ఖర్చులు, పొదుపు నకు సంబంధించి స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశం యూజర్‌కు కలుగుతుంది.
బడ్జెటింగ్, సేవింగ్, ఇన్వెస్టింగ్, రుణ నిర్వహణకు సంబంధించి సులభంగా గ్రహించగలిగే ఆర్థిక సలహాలను బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కోరుకుంటున్నారు మిలీనియల్స్. వారి అంచనాలు సంప్రదాయ బ్యాంకులు అందుకోలేక పోవడం కూడా నియో బ్యాంకుల వైపు ఆకర్షితులు కావడానికి ఒక కారణం. రోబోటిక్స్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ సమయంలో సేవలు అందిస్తున్నాయి నియో బ్యాంకులు. తక్కువ ఛార్జీలు, సులభంగా ఖాతా ప్రారంభించే అవకాశం ఉండడం, రుణాలు, బిల్లులు... మొదలైన చెల్లింపులను గుర్తు చేయడానికి రిమైండర్ సదుపాయం... ఇలాంటివి నియో విజయానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.
రకరకాల ఫైనాన్షియల్ సర్వీస్‌లను నియో బ్యాంకులు ఒకే గొడుగు కిందికి తీసుకురావడం టెక్–సావి మిలీనియల్స్‌ను ఆకట్టుకునే అంశం. రేజర్ పే ఎక్స్, జూపిటర్, ఓపెన్... మొదలైనవి మన దేశంలోని కొన్ని నియో బ్యాంకులు. గూగుల్ పే క్రియేటర్స్ సుజిత్ నారాయణ్, సుమిత్‌లు మిలీనియల్స్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ‘ఫై’ అనే నియోబ్యాంకును ప్రారంభించారు. ఇది ఫెడరల్ బ్యాంక్ భాగస్వామ్యంతో పనిచేస్తుంది. మన దేశంలో నియో బ్యాంక్ స్టార్టప్‌ల సంఖ్య పెరగడానికి కారణం మిలీనియల్స్ ఆదరణ. స్థూలంగా చెప్పాలంటే... నియో బ్యాంకింగ్ సెగ్మెంట్‌లో మిలీనియల్స్ అతి ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకున్నారు. అయితే నియో బ్యాంకుల మధ్య కూడా గట్టి పోటీ ఉంది. వాటి పనితీరు ఆధారంగా రేటింగ్స్ ఉంటున్నాయి. డిజైన్ లాంగ్వేజ్ అనేది వాటి ఆదరణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment