దేశంలో అన్నీ బ్యాంకుల్లో బ్రాంచ్ లెవల్ అధికారులు స్థానిక భాషల్లో మాట్లాడాలని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలా మాట్లాడితే వినియోగదారుల వ్యాపార సంబంధిత అవసరాలు తీరుతాయని అన్నారు.ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బ్యాంకర్స్‌తో నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు కొత్త భాషల్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.
బ్యాంకులు ఉద్యోగుల ఎంపిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అన్నారు. స్థానిక భాషల్లో మాట్లాడే వారిని కస్టమర్ ఫేసింగ్ బ్రాంచ్ ఆఫీస్‌లో ఉండేలా చూసుకోవాలని, లోకల్ లాంగ్వేజ్ రాని ఉద్యోగులకు ఆఫీస్ బ్యాకెండ్ కార్యాకలాపాలు అప్పగించాలని సూచించారు.
పనితీరు బ్రహ్మాండం
బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (బీసీలు)గా మహిళా ఉద్యోగులు పాత్రపై నిర్మలా సీతారామన్ ప్రశంసల వర్షం కురిపించారు. మహిళా బీసీలు తమ పురుష సహోద్యోగుల కంటే బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. బ్యాంకర్లు "మరింత మంది మహిళలను బీసీలుగా నియమించుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో బ్యాంకుల కీలక పాత్రను పునరుద్ఘాటిస్తూ ప్రశంసించారు. అయితే బ్యాంకుల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ఆమె ధ్వజమెత్తారు. ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా బ్యాంకర్లు చూసుకోవాలని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment