ముంబై: ఈ వారం దేశీయ స్టాక్ సూచీలపై ప్రపంచ పరిణామాలు ప్రభావం ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా బ్యాంక్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ సమావేశ పరిణామాల నేపథ్యంలో సెంటిమెంట్ ప్రతికూలంగానే ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ, బాండ్ల రాబడులపై దృష్టి సారించవచ్చు.
‘‘స్టాక్ సూచీల ఒడిదుడుకులకు ట్రేడింగ్ కొనసాగే వీలుంది. కొన్ని వారాలుగా జరిగిన ఏకపక్ష అమ్మకాలతో మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బేరిష్‌గా మారింది. సాంకేతికంగా నిఫ్టీ గత ఏడు వారాల కన్సాలిడేషన్ రేంజ్‌ను చేధించి 17100 స్థాయి వద్ద ముగిసింది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. ఎగువ స్థాయిలో 17,250–17,400 రేంజ్‌ని చేధించాల్సి ఉంటుంది’’అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు.
గడిచిన వారంలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. విస్తృత మార్కెట్‌లోనూ అమ్మకాలు కొనసాగడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2 శాతం, 2.5 శాతం చొప్పున క్షీణించాయి.
1. బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ ఘంటికలు
ద్రవ్యోల్బణం ముదిరి ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తున్న వేళ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే ఏకంగా ఐదు బ్యాంకులు భారీ కుదుపులకు లోనయ్యాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా, సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత పరిణామాల తర్వాత తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కో ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ఉదంతం తెరపైకి వచ్చింది. అయితే ఈ బ్యాంకును కాపాడేందుకు 11 పెద్ద బ్యాంకులు కలిపి 30 బిలియన్ డాలర్ల సమకూర్చాయి.
ఈ ప్రకంపనలు అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల బ్యాంకులకు విస్తరించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతవారంలోనే క్రిడెట్ సూసీ ఆర్థిక ఐసీయూపైకి చేరడంతో స్విస్ నేషనల్ బ్యాంక్ 54 బిలియన్ డాలర్ల నగదు సాయం చేసింది. ‘‘ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తక్షణ నిధులు సమకూర్చినంత మాత్రన బ్యాంకింగ్ సంక్షోభం ముగిసిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ప్రస్తుతానికి అదుపులో ఉందంతే. ఐరోపాలోని బ్యాంకుల పరిస్థితులను గమనిస్తే యూఎస్ పరిస్థితులు అక్కడి పాకినట్లు తెలుస్తుంది. ఈ సంకేతాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఈక్విటీ మార్కెట్లకు మంచిది కాదు’’ అని ఫస్ట్ వాటర్ క్యాపిటల్ ఫండ్ సహ వ్యవస్థాపకుడు అరుణ్ చులానీ తెలిపారు.
మంగళవారం ఫెడరల్ రిజర్వ్ సమావేశం
ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం మంగళవారం(మార్చి 21న) ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు బుధవారం ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటీ నిర్ణయాలను ప్రకటించనున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం దిగివచ్చిన నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని... అలాగే తదుపరి సమావేశాల నుంచి రేట్ల పెంపు ఉండకపోవచ్చనే ప్రకటన వెలువడుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పుటికే యూరోపియన్ యూనియన్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఇప్పుడు ఫెడ్ రిజర్వ్, బ్యాంక్ ఇంగ్లాండ్ (మార్చి 23న)లు ఏమేర రేట్ల పెంపు ఉంటుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తి ఎదురు
చూస్తున్నాయి.
వారం రోజుల్లో రూ. 8 వేల కోట్ల విక్రయాలు
విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో వారం రోజుల్లో రూ. 8 వేల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.9,200 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ‘‘ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఎఫ్‌ఐఐలు బంగారం, డాలర్ వంటి రక్షణాత్మక సాధనాల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఇటీవల డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొంత ప్రతికూలంగా మారింది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ప్రపంచ పరిణామాలు...
ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రూడాయిల్ ధరలు సైతం బేర్ గుప్పిట్లోకి వెళ్లాయి. ప్రస్తుత సంవత్సరంలోనే వారం ప్రాతిపదికన అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. క్రూడ్ ధరల పతనం భారత్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశమైనప్పట్టకీ.., క్షీణత స్థిరంగా ఉంటేనే స్వాగతించాలని నిపుణులు చెబుతున్నారు. నేడు అమెరికా జనవరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, రేపు యూరోజోన్ కన్‌స్ట్రక్షన్ అవుట్ డేటా వెల్లడి అవుతాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య కమిటీ నిర్ణయాలుతో పాటు బ్రిటన్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణ డేటా బుధవారం విడుదల అవుతుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను ప్రకటిస్తుంది. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా ఫిబ్రవరి రిటైల్ అమ్మకాలతో పాటు జపాన్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణం, యూరోజోన్ మార్చి ప్రథమార్థపు తయారీ రంగ వివరాలు వెల్లడి అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment