స్థూల ఆర్థిక గణాంకాలూ కీలకమే
ఎఫ్‌ఐఐల క్రయ, విక్రయాలపై దృష్టి
మార్కెట్ గమనంపై నిపుణుల అంచనా
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య కమిటీ విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, యూఎస్, భారత్ బాండ్లపై రాబడులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు.
వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. అలాగే వచ్చే వారంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ప్లాట్‌ఫామ్ నార్తెర్న్ ఆర్క్ క్యాపిటల్ ఐపీఓల సబ్‌స్క్రిబ్షన్‌తో పాటు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్‌పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు.
‘‘ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా
తెలిపారు
స్థూల ఆర్థిక గణాంకాలు
దేశీయ ఆగస్టు టోకు ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఫెడ్ కమిటీ ఆర్థిక అంచనాలు, యూఎస్ నిరుద్యోగ క్లెయిమ్స్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం విడుదల కానుంది అదే రోజున బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు వెలువడనున్నాయి.
క్రూడాయిల్ ధరలూ కీలకం
ద్రవ్యోల్బణంతో పాటు ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్లపై ప్రభావాన్ని చూపే క్రూడాయిల్ ధరలూ ఈ వారం కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ధరలు 14 నెలల కనిష్టం వద్ద ట్రేడవుతున్నాయి. భారత్‌లో అధికంగా వినియోగించే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71.61 డాలర్ల దిగువకు చేరుకుంది. దీంతో చమురు దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే దేశమైన భారత్‌కు ఇది సానుకూల అంశంగా మారింది.
ఫెడ్ నిర్ణయాలపై దృష్టి
వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీరేట్లను 25 లేదా 50 బేసిస్ పాయింట్లు మేర ఫెడ్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగళవారం(సెపె్టంబర్ 17న) మొదలవుతాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం(18న) రాత్రి ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెల్లడించనున్నారు. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ద్రవ్య కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది.
ప్రథమార్థంలో రూ.27,856 కోట్లు
ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ ప్రథమార్థం(1–15న) విదేశీ ఇన్వెస్టర్లు రూ.27,856 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్‌ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్‌మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–13 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,525 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్‌ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment