దేశంలోని బ్యాంకులు ప్రస్తుతం వారానికి 6 రోజులు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్‌లో బ్యాంకులు మూతపడతాయి. రానున్న రోజుల్లో వారానికి 5 రోజులే పనిదినాలు ఉండేలా ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు బ్యాంక్ హాలిడేస్ గురించి ఆందోళన చెందుతుంటారు.
దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) కస్టమర్ల కోసం అన్ని రోజులూ సేవలు అందించనుంది. ఇందుకోసం వినూత్నమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది. దేశంలో 24x7 లైవ్ వీడియో బ్యాంకింగ్ సేవను ప్రారంభించిన మొదటి బ్యాంక్‌గా ఏయూ స్మాల్ ఫైనాన్స్ నిలిచింది.
తాము తీసుకొచ్చిన 24x7 వీడియో బ్యాంకింగ్ సదుపాయం బ్యాంక్ బ్రాంచ్‌లు అందుబాటులో లేనివారికి, టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవారికి, బిజీగా ఉండే ప్రొఫెషనల్‌లకు, సీనియర్ సిటిజన్‌లకు అనుకూలంగా ఉంటుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
24x7 వీడియో బ్యాంకింగ్ ఫీచర్లు
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24x7 వీడియో బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు నేరుగా బ్యాంకు సిబ్బందితో వీడియో కాల్‌లో మాట్లాడవచ్చు. అన్ని రోజులూ ఎప్పుడైనా వీడియో కాల్ చేసి బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. ఈ బ్యాంక్ గతంలోనే వీడియో బ్యాంకింగ్ సదుపాయం తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడు దాన్ని 24x7 కస్టమర్లకు సేవలు అందించేలా విస్తరించింది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24x7 వీడియో బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు డెమోగ్రాఫిక్ అప్‌డేట్‌లు చేయించుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చు. కొత్త ఖాతాలను తెరవవచ్చు. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్‌లు, లోన్‌లపై విచారణతోపాటు ఇతర బ్యాంకింగ్ సమస్యలు ఉన్నా రియల్ టైమ్ సేవలు పొందవచ్చు.
భద్రత, ఇతర ప్రయోజనాలు
వీడియో బ్యాంకింగ్ సేవల ద్వారా డేటా లీక్ అవుతుందని, మోసాలు జరుగుతాయని కస్టమర్లు భయపడాల్సిన పని లేదని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెబుతోంది. కస్టమర్ల సమాచారాన్ని, లావాదేవీలను రక్షించడానికి ఎన్‌క్రిప్షన్, ఫేషియల్ రికగ్నిషన్, ఓటీపీ, వీడియో ధ్రువీకరణ వంటి అధునాతన చర్యలను తీసుకుంటున్నట్లు బ్యాంక్ పేర్కొంటోంది.
ఇదీ చదవండి: Bank Charges: బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment