Woman claims she was virtually groped in Meta VR metaverse: లైంగిక వేధింపులు-మీటూ ఉద్యమం ద్వారా విస్తృత చర్చ జరిగిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదనే విషయంపై స్పష్టత వచ్చింది కూడా మీటూ ద్వారానే!. అయితే వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఇలాంటి అనుభవాలు తప్పవని, పైగా అవి మరింత ఆందోళనకరంగా ఉంటాయనే విషయం తాజాగా ఓ ఘటన ద్వారా రుజువైంది.
వర్చువల్‌రియాలిటీ (VR), అగుమెంటెడ్ రియాలిటీల(AR)ల సంకరణ కలయికగా రాబోతున్న టెక్నాలజీనే ‘మెటావర్స్’. ఇదొక ఒక 3డీ వర్చువల్ ప్రపంచం. వ్యక్తిగతంగా పక్కపక్కన లేకున్నా.. భౌతిక ప్రపంచంలో చేయలేని పనులను కలిసి చేయగలగడం మెటావర్స్ ప్రపంచ ప్రత్యేకత. వాస్తవానికి కార్పొరేట్ రంగం కోసం పుట్టుకొచ్చిన ఈ టెక్నాలజీని.. దాదాపు అన్నింటా అన్వయింపజేయాలని టెక్ దిగ్గజాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో మెటావర్స్ యాప్ బేటా వెర్షన్ టెస్టింగ్‌లో భాగంగా మెటా కంపెనీ(ఫేస్‌బుక్) హోరిజోన్ వరల్డ్స్ ఫీచర్‌ను పరిశీలిస్తోంది. ఇందులో పని చేస్తున్న ఓ టెస్టర్‌కు పాపం చేదు అనుభవం ఎదురైంది.
మెటా కంపెనీలో పని చేస్తున్న ఆ టెస్టర్ అవతార్(కార్టూన్ తరహా రూపం)ను ఓ ఆగంతకుడు బలవంతంగా వాటేసుకున్నాడట. అక్కడితో ఆగకుండా అసభ్యంగా ప్రవర్తించాడట. అఘాయిత్యానికి పాల్పడే సమయంలో తాను భరించలేక.. వెంటనే హెడ్‌సెట్‌ను తొలగించినట్లు ఆమె వెల్లడించింది. పైగా ఈ ఘటనపై ఫేస్‌బుక్ గ్రూప్‌కి ఆమె రిపోర్ట్ చేయడంతో పాటు వర్జ్ వేదికగా ఆ చేదు అనుభవాన్ని పంచుకుంది.
‘సాధారణ ఇంటర్నెట్-సోషల్ మీడియాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడమే దారుణం. అలాంటిది వర్చువల్ రియాలిటీలో ఇలాంటి ఘటనలు మరింత ప్రమాదకరమని నా అనుభవంతో రుజువైంది. ఘటన జరగడం కంటే.. ఆ ఘటనకు చాలామంది మద్దతు ఇవ్వడం నన్ను ఇంకా బాధించింది. నన్ను ఒంటరిని చేశారనే భావనలోకి నెట్టేసింది ఈ అనుభవం’ అంటూ ఆమె వర్జ్ బ్లాగ్‌లో రాసుకొచ్చింది. దీనిపై టెక్ నిపుణులు స్పందిస్తున్నారు. మెటా ప్రపంచంలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ ఘటనే కిందటి నెల 26నే చోటు చేసుకుందట. అయితే విమర్శల నేపథ్యంలో ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించింది మెటా. టెస్టర్‌పై జరిగిన వర్చువల్ దాడిని ఖండిస్తూ.. అపరిచితులతో జాగ్రత్త ఉండాలంటూ యూజర్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి వేధింపులను తట్టుకునేందుకు ‘మెటా సేఫ్‌జోన్ ఫీచర్’ సరిపోదనే అభిప్రాయాన్ని తామూ అంగీకరిస్తున్నట్లు పేర్కొంది కంపెనీ. అయితే ఈ విషయంలో యూజర్లకు తగిన శిక్షణ అవసరమని, వేధింపులు ఎదురైనప్పుడు అవతలి వాళ్లను బ్లాక్ చేయగలిగేలా అవగాహన ఉండాలని, ఇందుకు సంబంధించి ప్రణాళికను తాము రూపొందిస్తామని హరిజోన్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ శర్మ వెల్లడించారు.
2020 ప్యూ రీసెర్చ్ పోల్ ప్రకారం.. ఆన్‌లైన్ వేధింపుల ఘటనలు(ఆడామగా తేడా లేకుండా బాధితులు) 25 శాతం పైగా పెరిగాయి. భౌతిక దాడుల బెదిరింపులు, వెంబడించడం, పదే పదే వేధింపులకు గురి చేయడం లాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ ఉదంతాలు మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇందులో వీఆర్ సంబంధిత వేధింపులు సైతం ఉండడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment