వర్చువల్ రియాల్టీపై ఫేస్‌బుక్ దృష్టి
వర్చువల్ రియాల్టీలో అగ్రగామిగా నిలవడానికి సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తీవ్రంగా కృషిచేస్తోంది. యూరప్ లో తన వొకొలస్ వర్చువల్ రియాల్టీ డివిజన్ ను విస్తరించడానికి లండన్ లో నిపుణులను నియమించుకుంది. 2014 లో 200 కోట్ల డాలర్ల వొకొలస్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకున్న ఆరునెలల్లోనే బ్రిటిష్ టీమ్ ఇంజనీర్లను, డెవలపర్ సిబ్బందిని పెంచుకోవడం ప్రారంభించింది. భవిష్యత్తులో పెరగబోతున్న వర్చువల్ రియాల్టీ డిమాండ్ కు తగ్గట్లుగా మారి.. ఆ రంగంలో తామే అగ్రగామిగా నిలవాలని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిర్ణయించారు. గతేడాది బ్రిటన్‌కు చెందిన వర్చుయువల్ రియాల్టీ స్టార్టప్ సర్ రియల్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. ఈ టీమ్ ను రెడ్ మాండ్ లోని వొకోలస్ ఆఫీసుకు తరలించింది.
గూగుల్ లో సీనియర్ ఇంజనీర్ గా పనిచేసిన మైక్ లీబ్యూను బ్రిటన్ వొకొలస్ టీమ్ కు అధినేతగా కంపెనీ నియమించింది. జనవరిలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. వచ్చే తరమంతా సోషల్ మీడియాలో వర్చువల్ రియాల్టీ మీదే ఎక్కువ సమయం గడుపుతుందని అంచనా. ఒకరితో మరొకరు సంప్రదింపులు జరపడానికి ఇది అతి పెద్ద టెక్నాలజీగా రూపొందనుందని జుకర్ బర్గ్ విశ్వసిస్తున్నారు. సోషల్ ప్లాట్ ఫాంలో వర్చువల్ రియాల్టీ ఎక్కువగా అభివృద్ధి చెందబోతుందని, వచ్చే తరంలో రాబోతున్న సోషల్ యాప్స్ కు, వర్చువల్ రియాల్టీకి కొత్త టీమ్ ను నియమించుకోబోతున్నట్టు మార్క్ జుకర్ బర్గ్ ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించారు. వర్చువల్ రియాల్టీ రంగంలో అగ్రస్థానాల కోసం ఫేస్ బుక్, గూగుల్, సోనీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. యాపిల్ సైతం ఈ టెక్నాలజీపై దృష్టి సారించింది.