కాలం మారింది. టెక్నాలజీ మారుతోంది. దాంతో నేరాల తీరు కూడా మారుతోంది. ఈరోజు మనం ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని ఒక నేరం గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ లో 16 సంవత్సరాల వయసున్న ఒక బాలిక అవతార్ పై మెటావర్స్ లో గ్యాంగ్ రేప్ చేశారు. అంటే ఆమెపై భౌతికంగా ఎలాంటి దాడీ జరగలేదు, వర్చువల్ రియాలిటీలో జరిగింది. కానీ ఆమె నిజ జీవితంలో అత్యాచార బాధితులు అనుభవించే మానసిక, భావోద్వేగ వేదననే అనుభవిస్తోంది. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్చువల్ రియాలిటీ గురించి, దాని లాభనష్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి?
వర్చువల్ రియాలిటీ (VR) అంటే... నిజజీవితంలో లభించే అనుభవాన్ని కంప్యూటర్ వాతావరణంలో అందించే సాంకేతికత. ఫేస్బుక్ సంస్థ మెటా ఇప్పుడు మెటావర్స్ పేరుతో అలాంటి టెక్నాలజీని అందరికీ అందించే ప్రయత్నంలో ఉంది. దీనివల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. అందువల్ల దీన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించడం ముఖ్యం.
నిజంగా దాడి జరగకపోయినా మానసిక క్షోభ ఎందుకు?
అది సరే.. ఆ అమ్మాయిపై ఎలాంటి దాడి జరగకపోయినా మానసిక వేదన కలగడానికి కారణమేమిటనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా. మీరో చిన్న పనిచేయండి. కళ్లు మూసుకుని, చేతిలో నిమ్మకాయ ఉన్నట్లు ఊహించండి. దాని వాసన చూస్తున్నట్లుగా, టేస్ట్ చేస్తున్నట్లుగా ఊహించండి. మీ నోటిలో లాలాజలం ఊరిందా? మీరు నిమ్మకాయ తినకుండానే లాలాజలం ఎలా ఊరింది? వర్చువల్ రియాలిటీ అనుభవం కూడా అలాంటిదే.
► నిజానుభవం లాంటి అనుభవాన్ని కంప్యూటర్ ప్రపంచంలో అందించడమే వర్చువల్ రియాలిటీ లక్ష్యం. వినియోగదారులు తాము నిజమైన వాతావరణంలో ఉన్నట్లు భావించేలా చేయడం. అందువల్ల మెదడు వర్చువల్ అనుభవాలను వాస్తవంగా భావిస్తుంది.
► భౌతిక ప్రపంచంలో లేదా వర్చువల్ రియాలిటీలో మనం సంఘటనలను అనుభవించినప్పుడు, మన మెదడు వివిధ నాడీ మార్గాల ద్వారా సమాచారాన్ని ఒకేలా ప్రాసెస్ చేస్తుంది. అందువల్ల నిజమైన లేదా వర్చువల్ అనుభవాలకు సమానంగా ప్రతిస్పందిస్తుంది.
► ఒక సంఘటన వల్ల జరిగే నష్టాన్నికేవలం శారీరక హాని ద్వారా మాత్రమే నిర్ణయించరు. దానికి మించిన ఎమోషనల్ పెయిన్ ఉండవచ్చు, ముఖ్యంగా అత్యాచారం లాంటి దుర్ఘటనల్లో. వర్చువల్ రియాలిటీలో జరిగిన అత్యాచారాన్ని వాస్తవమైనట్లుగా మెదడు ప్రాసెస్ చేసిందా కాబట్టే ఆ అమ్మాయి నిజమైన మానసిక క్షోభకు గురయ్యింది. అత్యాచారం జరగకపోయినా, ఎమోషనల్ పెయిన్ మాత్రం నిజం.
► అలాగని అందరూ అలాగే స్పందించాలని లేదు. వ్యక్తిత్వం, గత అనుభవాలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలు వ్యక్తి వర్చువల్ పరిస్థితులను ఎలా గ్రహించి ప్రతిస్పందిస్తారో ప్రభావితం చేయవచ్చు.
కాపాడుకోవడం ఎలా?
► మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఇకపై నిజ జీవితంలోనే కాదు వర్చువల్ రియాలిటీలో కూడా మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
► హానికరమైన సాఫ్ట్‌వేర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అధికారిక స్టోర్‌లు నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి.
► సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్‌ను, అప్‌డేట్ చేస్తూ ఉండండం వల్ల బగ్స్ నుంచి తప్పించుకోవచ్చు.
► వర్చువల్ రియాలిటీలో మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి. మీ అసలు పేరు, చిరునామా లేదా ఆర్థిక సమాచారం వంటి సున్నితమైన డేటాను షేర్ చేసుకోవద్దు.
► మీ VR ఖాతాల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
► వాస్తవ ప్రపంచంలో లానే VRలో కూడా అపరిచితులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
► వర్చువల్ ప్రపంచంలో ఎదురైన వ్యక్తులను నిజ జీవితంలో కలవకుండా ఉండండి.
► మీ పిల్లలు VRని ఉపయోగిస్తుంటే, వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలించండి. వయస్సుకి తగిన కంటెంట్ పరిమితులను సెట్ చేయండి.
► VR ప్లాట్‌ఫారమ్ అందించిన పేరంటల్ కంట్రోల్స్ ను ఉపయోగించండి.
► VR ప్లాట్‌ఫారమ్‌లో ఏదైనా అనుమానాస్పదంగా, అనుచితంగా కనిపిస్తే వెంటనే బ్లాక్ చేయండి, ప్లాట్ ఫారమ్ కు రిపోర్ట్ చేయండి.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment