సారిక ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం ఆమెకు మానుకోలేని అలవాటుగా మారింది. తన ఫ్రెండ్స్, ఆన్‌లైన్ ఫ్రెండ్స్ పెట్టిన వెకేషన్ పోస్టులు, కెరీర్ సక్సెస్ పిక్స్ లాంటివి చూసి ఆందోళన చెందుతోంది, అసంతృప్తికి లోనవుతోంది.
కెరీర్‌లో అవకాశాలు పోతాయనే భయంతో విపరీతంగా పనిచేస్తోంది. అయినా వెనుకబడిపోతాననే ఆందోళన. కొలీగ్స్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బిజినెస్ మీటింగ్స్ అంటే ఉత్సాహంగా వెళ్లేది. ఈ మధ్య ఇతరుల ప్రెజెంటేషన్లతో పోల్చుకుని ఆందోళన చెందుతోంది. తరచుగా బిజినెస్ మీటింగ్స్‌కు డుమ్మా కొడుతోంది. అది ఆమె ఒంటరితనాన్ని మరింత పెంచుతోంది.
ఏదో మిస్ అవుతున్నాననే బాధతో గిటార్‌ను, పెయింటింగ్‌ను పక్కన పడేసింది. ఏం చేయాలో తెలియక సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూంటుంది. అలా అర్ధరాత్రి వరకూ మేల్కొంటోంది. ఆ తర్వాత కూడా సరిగా నిద్ర పట్టడం లేదు. పగలంతా చికాకుగా ఉంటోంది. ఇవన్నీ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ లాంటివి ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో ఫ్రెండ్ సలహాతో కౌన్సెలింగ్‌కు వచ్చింది.
‘నేను తప్ప అందరూ నాకంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. నేను అన్నీ మిస్ అవుతున్నాను’ అని చెప్పింది. సారిక ‘ఏదో మిస్ అవుతన్నాననే భయం (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–ఫోమో)తో బాధపడుతోందని అర్థమైంది. సారికలానే ఈ జనరేషన్‌లో చాలామంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు.
కారణాలు..
– ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం ఉంటాయి. జయాపజయాలు ఉంటాయి. కానీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆనందకరమైన అంశాలను మాత్రమే పంచుకుంటారు. ఇవి వాస్తవికతను వక్రీకరిస్తాయి. ఫోమోకు కారణమవుతాయి.
– సారిక తన జీవితాన్ని ఆన్‌లైన్‌లో చూసే పర్‌ఫెక్ట్ లైఫ్‌లతో పోల్చుకుంటోంది. తనకలాంటి జీవితం లేదని అసంతృప్తి, తానలా సాధించలేకపోతున్నాననే అసమర్థతా భావనలతో కుంగిపోతోంది.
– నిజ జీవితంలో కంటే కూడా సోషల్ మీడియాలో అందరూ తనను ఆమోదించాలని, మెచ్చుకోవాలని కోరుకుంటోంది. తన పోస్ట్‌లకు, ఫొటోలకు లైక్స్ రాకపోతే తీవ్ర నిరాశ చెందుతోంది.
లక్షణాలు..
– సోషల్ మీడియా అప్‌డేట్స్‌ను నిరంతరం చెక్ చేయాలనే ఆలోచన, చెక్ చేయకుండా ఉండలేకపోవడం ఫోమో ప్రధాన లక్షణం..
– ఏదో మిస్ అవుతున్నాననే భయం, ఆందోళన..
– సోషల్ మీడియా సెలబ్రిటీలతో పోల్చుకోవడం వల్ల తానలా లేననే దిగులు, డిప్రెషన్..
– ఇంటి పనులు, ఆఫీసుపనులపై దృష్టి పెట్టలేకపోవడం..
– తనకన్నా మంచి జీవితం గడుపుతున్నట్లు కనిపించే ఇతరుల పట్ల అసూయ..
– అర్ధరాత్రి వరకూ సోషల్ మీడియా వాడకం వల్ల నిద్రలేమి..
సెల్ప్ హెల్ప్ టిప్స్..
– సోషల్ మీడియాను చెక్ చేయడానికి నిర్దిష్ట సమయాలను పెట్టుకోండి.
– చెక్ చేయాలనే కోరికను తగ్గించుకోవడానికి మీ స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్‌ను తొలగించండి. కనీసం నోటిఫికేషన్స్‌ను ఆపేయండి.
– మీ జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉండాల్సిన విషయాలను రాయండి.
– మీకు స్ఫూర్తినిచ్చే, ఆనందాన్ని అందించే అకౌంట్స్‌ను మాత్రమే అనుసరించండి. ఆందోళన కలిగించే అకౌంట్స్‌ను అనుసరించవద్దు.
– స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి, సానుకూల భావాలను పెంపొందించే అర్థవంతమైన పరిచయాలను పెంచుకోండి.
– ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే హాబీలను అలవాటు చేసుకోండి.
– మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఆ వ్యాయామాలు.. ఏదో కోల్పోతున్నామనే ఆందోళనను తగ్గించేందుకు, వర్తమానంలో బతికేందుకు సహాయపడతాయి.
– అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం మొహమాటపడకుండా, భయపడకుండా సారికలా సైకాలజిస్ట్‌ను కలవండి.
– కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) ఆందోళన తగ్గించేందుకు సహాయ పడుతుంది. మీ విలువను, బంధాల విలువను గుర్తిస్తారు. మళ్లీ మీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. – డా. సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment