ప్రతీకాత్మక చిత్రం
ఆనంది అందమైన అమ్మాయి. ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్‌గా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ తెచ్చిన సంబంధాలన్నీ వద్దంటోంది. క్రమేపీ ఇంట్లో వాళ్లతో మాట్లాడటం తగ్గించింది.
ఆస్పత్రినుంచి రాగానే తన గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటోంది. మెల్లగా ఆస్పత్రికి వెళ్లడం కూడా తగ్గించింది. కారణమేంటని అడిగితే ఏడుస్తోంది. తను ఆలా ఎందుకు ఏడుస్తోందో పేరెంట్స్‌కు అర్థం కావడం లేదు. అడిగితే ఏమీ చెప్పడం లేదు. ఒకరోజు హఠాత్తుగా చెయ్యి కోసుకుంది. పేరెంట్స్ సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెను కాపాడుకున్నారు. తనకు అంత పని చేయాల్సినంత కష్టం ఏమొచ్చిందో అర్థం కాక తల్లడిల్లుతున్నారు.
డిప్రెషన్
ఆనందిలా నిద్రాహారాలకు దూరమై, బంధాలన్నింటికీ స్వస్తిచెప్పి, నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి, ఒంటరిగా కూర్చుని కుమిలిపోవడాన్నే డిప్రెషన్ అంటారు. డిప్రెషన్‌కు లోనైన వ్యక్తుల్లో కొందరికి బలవన్మరణ ఆలోచనలూ రావచ్చు.
కొందరు ఆనందిలా ప్రయత్నాలు కూడా చేస్తారు. జనాభాలో దాదాపు ఐదుశాతం డిప్రెషన్‌తో బాధపడుతుంటారు. ఈ డిప్రెషన్ మహిళల్లో ఎక్కువ. తల్లిదండ్రుల్లో డిప్రెషన్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఎందుకు వస్తుంది?
డిప్రెషన్ ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పడం కష్టమే. సకల సౌకర్యాలతో జీవిస్తున్న వ్యక్తులూ హఠాత్తుగా డిప్రెషన్‌లో పడిపోవచ్చు. తామెప్పుడో చేసిన చిన్న తప్పును భూతద్దంలో చూడటం, తన జీవితమే తప్పు దారిలో వెళ్తోందని అతిగా ఆలోచించడం, తప్పు చేసిన తాను ఎందుకూ పనికిరాననే ఆత్మన్యూనతకు లోనవ్వడం వంటివన్నీ.. డిప్రెషన్‌కు కారణమవుతాయి.
ఆనంది విషయంలో జరిగిందదే. తన టీనేజ్ అఫైర్‌ను ఇప్పుడు గుర్తు చేసుకుని, అతిగా ఆలోచించి, తాను తప్పు చేశా కాబట్టి పెళ్లికి అర్హురాలిని కాదని, తనను తాను తక్కువ చేసుకుని, ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేక డిప్రెషన్‌లోకి జారిపోయింది. మరికొన్ని సందర్భాల్లో జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు డిప్రెషన్‌కు వెళ్లిపోతారు.
ఆ కోల్పోవడం ఆర్థికంగా లేదా మానసికంగా లేదా సామాజికంగా కావచ్చు. ఒక్కోసారి ఆర్థికంగా, వస్తురూపంగా ఎలాంటి నష్టం లేకపోయినా అహం దెబ్బతినడం, అవమానం పాలవ్వడం కూడా డిప్రెషన్‌కు కారణం కావచ్చు. ఒక్కోసారి ఎలాంటి ప్రత్యేక కారణాలు లేకుండానే డిప్రెషన్‌కు లోనుకావచ్చు. మెదడులోని సెరటోనిన్ అనే రసాయనంలో హెచ్చుతగ్గుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు.
గుర్తించడం ఎలా?
డిప్రెషన్‌ను గుర్తించడం కొంచెం సులభం, మరికొంచెం కష్టం కూడా. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి ఆనందిలా సరిగా నిద్రపోలేరు. తిండిపై ఆసక్తి ఉండదు. ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారో కూడా ఆలోచించరు. చిన్న చిన్న పనులకే అలసిపోతారు. హఠాత్తుగా బరువు తగ్గుతారు. మద్యం తాగడం పెంచుతారు. కొందరిలో తరచూ తలనొప్పి, ఒళ్లునొప్పులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి శారీరక లక్షణాలూ కనిపిస్తాయి.
డాక్టర్ దగ్గరకు వెళ్తే అన్ని పరీక్షలు చేసి ఎలాంటి సమస్యా లేదని చెప్తారు. కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంటుంది. మందులు వాడినా శారీరక బాధలు తగ్గనప్పుడు, దీర్ఘకాలం దిగులుగా ఉన్నప్పుడు అది డిప్రెషన్ అని గుర్తించాలి.
ఏం చేయాలి?
►డిప్రెషన్‌కు లోనయ్యామని తెలుసుకున్నప్పుడు మొదట దానికి దారితీసిన కారణాలను వెదకాలి. ఆ కారణాలకు దిగులుపడాల్సిన అవసరం ఉందా, లేదా అనే విషయాన్ని విశ్లేషించుకోవాలి.
►పని ఒత్తిడి భరించలేని స్థాయికి వచ్చినందువల్ల కూడా డిప్రెషన్‌కు లోనయ్యే చాన్స్ ఉంది కాబట్టి వీలైనంత వరకు పని ఒత్తిడి తగ్గించుకోవాలి.
►హెల్తీ బాడీ, హెల్తీ మైండ్ అంటారు. అలాగే యాక్టివ్ బాడీ, యాక్టివ్ మైండ్. శరీరం చురుగ్గా ఉంటేనే మనసూ ఉత్సాహంగా ఉంటుంది. అందుకే శరీరానికి పనిపెట్టండి. వాకింగ్, ఏరోబిక్ ఎక్సర్ సైజ్‌లు, యోగ వంటివి ప్రాక్టీస్ చేయాలి.
►ఒంటరిగా కూర్చుంటే దిగులు మరింత పెరుగుతుంది. కాబట్టి ఒంటరిగా కూర్చోకుండా బయటకు కదలాలి. స్నేహితులను కలవాలి. వాళ్లతో నవ్వుతూ కబుర్లు చెప్పుకోవాలి. హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ ఉండే వాతావరణంలో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలి.
►మీ స్నేహితుడో, సన్నిహితురాలో డిప్రెషన్‌తో బాధపడుతున్నారని అనిపించినప్పుడు వారికి సపోర్ట్‌గా నిలవండి. వారిని సంతోషపెట్టే మార్గాలు అన్వేషించండి.
►మీ కుటుంబంలో ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు.. ఏమీ చేయకుండా కూర్చున్నారని తిట్టకండి. వారి మనసులోని బాధేమిటో తెలుసుకుని అనునయించండి.
►అవసరమైతే వారితో సన్నిహితంగా ఉండేవారి సహాయం తీసుకోండి.
►మీ ప్రయత్నాలేవీ ఫలించనప్పుడు సైకాలజిస్ట్‌ను కలవండి. ఆయన పరీక్షించి మైల్డ్, మోడరేట్ లెవెల్లో ఉంటే కౌన్సెలింగ్, సైకోథెరపీ ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడటానికి సహాయం చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్‌కు రిఫర్ చేస్తారు.
-సైకాలజిస్ట్ విశేష్
చదవండి: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. పరిష్కారం?
Comments
Please login to add a commentAdd a comment