సాగర్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. చాలా చలాకీగా, చురుగ్గా ఉండేవాడు. సేల్స్ టార్గెట్స్ అందుకోవడంలో ముందుండేవాడు. పెళ్లయ్యాక కూడా ఆ ఉల్లాసం, ఉత్సాహం కొనసాగింది. తర్వాతే మెల్లమెల్లగా దూరమవసాగింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లే కారణమనుకున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా తన మానసిక పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.
ప్రమోషన్ వచ్చినా, ఇల్లు కట్టుకున్నా, కార్ కొనుక్కున్నా, ఆఖరుకు బిడ్డ పుట్టినా సాగర్‌లో ఎలాంటి ఆనందం లేదా సంతృప్తి లేదు. క్రమంగా తన పనితీరు కూడా దెబ్బతినసాగింది. టార్గెట్స్ అందుకోలేక పోతున్నాడు. అలా నిరాశ, నిస్పృహలతో మూడేళ్లు తనలో తానే మథనపడ్డాడు. దానివల్ల భార్యాపిల్లలతో కూడా సంతోషంగా ఉండలేకపోయాడు.
ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్న సాగర్ ఒంటరిగా మారిపోయాడు. దాంతో మరింత నలిగిపోయాడు. ఎప్పుడూ నిస్సత్తువగా అనిపించసాగింది. చిన్నపనికే అలసిపోతున్నాడు. మానసిక గందరగోళానికి లోనవుతున్నాడు. అతని మనసొక యుద్ధభూమిగా మారింది.
నిరంతరం నెగటివ్ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు. వీటన్నింటివల్ల తనపై తనకు నమ్మకం పోయింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఈ లక్షణాలను బట్టి సాగర్ పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్ (పీడీడీ)తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఏళ్ల తరబడి దిగులే దీని ప్రధాన లక్షణం.
అనేక కారణాలు...
మేజర్ డిప్రెసివ్ డిజార్డర్‌కు పీడీడీకి ఉన్న ప్రధానమైన తేడా.. కాలం. కనీసం రెండేళ్లపాటు డిప్రెషన్ ఉంటే దాన్ని పీడీడీగా పరిగణిస్తారు. దీనికి కచ్చితమైన కారణం తెలియదు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్‌లానే వివిధ కారణాలుంటాయి.
♦ పీడీడీ ఉన్నవారి మెదడు నిర్మాణంలో, న్యూరో ట్రాన్స్‌మిటర్లలో మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా ఎమోషన్స్, ఫీలింగ్స్‌ను నియంత్రించే సెరటోనిన్ తగ్గుదల దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి.
♦ కుటుంబ హిస్టరీ ఉన్న వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. డిప్రెషన్‌కు కారణమయ్యే జన్యువులను కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.
♦ ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, ఆర్థిక సమస్యలు లేదా అధికస్థాయి ఒత్తిడి వంటి బాధాకరమైన సంఘటనలు కొంతమందిలో పీడీడీని ప్రేరేపిస్తాయి.
♦ నిత్యం తనను తాను విమర్శించుకోవడం, తనపై తనకు నమ్మకం లేకపోవడం, ఇతరులపై ఆధారపడటం, ఎప్పుడూ చెడు జరుగుతుందని ఆలోచించడం వంటి వ్యక్తిత్వ లక్షణాలు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు.
నివారణ లేదు, నియంత్రణే మార్గం...
పీడీడీని నివారించడానికి కచ్చితంగా మార్గం లేదు. ఇది తరచుగా బాల్యంలో లేదా యుక్తవయస్సులో మొదలవుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉన్న పిల్లలను గుర్తించడం వారికి ముందస్తు చికిత్సను అందించడంలో సహాయపడుతుంది. లక్షణాలను తగ్గించడానికి లేదా నిరోధించడానికి సహాయపడే వ్యూహాలు...
♦ ఒత్తిడిని నియంత్రించడానికి, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంచడానికి చర్యలు మొదలుపెట్టాలి
♦ సంక్షోభ సమయాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు తీసుకోవాలి
♦ వాస్తవిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి
♦ దిగులుగా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు
♦ తమను తాము ఉత్సాహపరచుకునేందుకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్, జీవిత చరిత్రలు చదవాలి
♦ మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
♦ మంచి ఆహారం తీసుకోవాలి, వీలైనంత వరకు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే ప్రయత్నం చేయాలి
♦ సమస్య ముదిరేవరకు ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే సైకాలజిస్ట్‌ను కలసి చికిత్స పొందాలి
♦ సైకోథెరపీ ద్వారా మీ ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటిని సానుకూలమైన వాటితో భర్తీ చేయాలి.
నిరాశ, నిస్సహాయత...
పీడీడీ లక్షణాలు కనిపించడానికి సాధారణంగా సంవత్సరాలు పడుతుంది. అలాగే ఆ లక్షణాలు పోవడానికీ సంవత్సరాలు పట్టవచ్చు. లక్షణాల తీవ్రత కాలక్రమేణా మారవచ్చు. ఆ లక్షణాలేంటంటే...
♦ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, విచారం, శూన్యత
♦ రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం.
♦ అలసట, శక్తి లేకపోవడం.
♦ తనను తాను గౌరవించుకోకపోవడం, తనను తాను విమర్శించుకోవడం
♦ ఫోకస్ చేయడంలో సమస్య, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది.
♦ పనులు సక్రమంగా లేదా సమయానికి పూర్తి చేయడంలో సమస్యలు.
♦ చిరాకు, అసహనం లేదా కోపం.
♦ సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం.
♦ గతం గురించి చింత, అపరాధ భావాలు
♦ ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం.
♦ నిద్ర సమస్యలు.
సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment