రికార్డులూ బద్దలు కొడతారు | Attention Definition Hyperactive Disorder | Sakshi
Sakshi News home page

రికార్డులూ బద్దలు కొడతారు

Published Thu, May 17 2018 12:25 AM | Last Updated on Thu, May 17 2018 12:25 AM

Attention Definition Hyperactive Disorder - Sakshi

కుండలో పట్టనంత ఎనర్జీ ఉంటుంది ఈ పిల్లల్లో! ఇవాళ వీళ్లు ఆగరు... రేపు వీళ్లను పట్టలేం. వీళ్లలో ఉన్న ఈ అత్యుత్సాహం, సూపర్‌ ఎనర్జీని కంట్రోల్‌ చేయడం తల్లిదండ్రుల తరం కాదు. కానీ... 
ఈ దూకుడును దారిలో పెడితే ఫ్యూచర్‌లో రికార్డులూ  బద్దలు కొట్టగలరు.

ముందుగా ఒక ఉపకథతో ఈ రుగ్మత గురించి మొదలుపెడదాం. ఇప్పుడతడి వయసు 33 ఏళ్లు. కానీ చిన్నప్పుడు అతడి పరిస్థితి వేరు. దేనిమీదా దృష్టి కేంద్రీకరించేవాడు కాదు. ఉన్నచోట కుదురుగా ఉండేవాడూ కాదు. ప్రతిరోజూ స్కూల్‌ టీచర్‌ నుంచి ఫిర్యాదులే ఫిర్యాదులు. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళితే  దేనిమీదా దృష్టి సారించలేని ఒక జబ్బు ఉందని తేలింది. దృష్టి కేంద్రీకరించ లేకపోవడం, అతిచురుగ్గా ఉండటం ఆ జబ్బులో భాగం. అతడి అతి చురుకుదనాన్ని ఎలా భరించాలో తల్లికి తెలియలేదు.  ఆ అతిచురుకుదనాన్ని చానలైజ్‌ చేయాలనుకుని  స్విమ్మింగ్‌పూల్‌ను పరిచయం చేసింది తల్లి. ‘ ముఖం తడిసిపోతుంది... ఈదను’ అన్నాడా పిల్లాడు. ‘సరే బ్యాక్‌స్ట్రోక్‌తో మొదలుపెట్టు’ అని మరో సలహా ఇచ్చింది. అంతే.  2016 ఒలింపిక్స్‌ నాటికి ఈతలో అతడు సాధించిన మొత్తం మెడల్స్‌ 28. వాటిలో 23 బంగారు పతకాలు. ఆ కుర్రాడి పేరు మైకెల్‌ ఫెల్ప్స్‌. అతడికి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఆ జబ్బు పేరు ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌’. సంక్షిప్తంగా దాన్నే ఏడీహెచ్‌డీ అంటారు. అటెన్షన్‌ డిఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌  (ఏడీహెచ్‌డీ) అంటే: పిల్లల వికాసంలో లోపాన్ని కలిగించే ఒక రుగ్మత ఇది. ఈ రుగ్మతలో దృష్టి కేంద్రీకరణ లోపంతో పాటు, ప్రమాదకరంగా పరిణమించే  తీవ్రమైన అతిచురుకుదనం ఉంటుంది. ఈ రెండు లక్షణాల్లో ఒక్కోసారి ఒక్కొక్కటి బయట పడుతుంటాయి. గతంలో ఏడేళ్ల వయసులో బయటపడే ఈ రుగ్మత ఇప్పుడు నాలుగేళ్లకే కనిపిస్తోంది. 

విస్తృతి కూడా ఎక్కువే:  మానసిక వైద్యశాస్త్రంలో దీనిని ఒక రుగ్మతగా పరిగణిస్తున్నారు.  ఏడీహెచ్‌డీలో అనేక రకాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 శాతం పిల్లల్లో ఈ రుగ్మత కనిపిస్తోంది. ఇదొక దీర్ఘకాలిక సమస్య. పిల్లలుగా ఉన్నప్పుడు బయటపడ్డ ఈ రుగ్మత 30 నుంచి 50 శాతం మందిలో ఆ తర్వాత యుక్తవయసుకు వచ్చాక కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక తల్లిదండ్రుల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు ఉంటే పిల్లలకు ఇది వచ్చే అవకాశాలు జన్యుపరంగా చాలా ఎక్కువ. 

ఏడీహెచ్‌డీకి కారణాలు 
ఏడీహెచ్‌డీకి కారణాలు ఇప్పటికీ నిర్దిషంగా తెలియదు. జన్యుపరమైన, వాతావరణపరమైన, ఆహారపరమైన, సామాజికమైన అనేక అంశాలు ఈ రుగ్మతకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటు న్నారు. 
జన్యుపరమైనవి: ఏడీహెచ్‌డీకి కారణమైన జన్యుపరమైన లోపాలను పెట్‌ స్కాన్‌ ద్వారా గుర్తిస్తారు. ఈ స్కాన్‌లో మెదడును పరీక్షించినప్పుడు డోపమైన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రక్రియ తక్కువ స్థాయిలో జరుగుతుందని గుర్తించారు. 
వాతావరణపరంగా: వాతావరణంలో సీసం (లెడ్‌) కాలుష్యం ఎక్కువగా ఉండేచోట ఉన్న పిల్లల్లోనూ ఇది ఎక్కువ. మద్యం, పొగాకు, పొగతాగడం వంటి నేపథ్యంలో పెరిగే పిల్లల్లో ఈ తరహా రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు తల్లి సమస్యలు ఎదుర్కోవడం లేదా నెలలు నిండకముందే పుట్టడం వంటి కేసుల్లోనూ ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ప్రసవం సమయంలో తలకు గాయం అయిన వారు ఏడీహెచ్‌డీకి గురయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా టీవీ చూసే పిల్లలు, ఇంటర్‌నెట్, వీడియోగేమ్స్‌ ఆడే పిల్లల్లో ఏడీహెచ్‌డీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లలు చదువులపై, లక్ష్యసాధనపై నిమగ్నం చేయలేక త్వరగా తమ దృష్టిని వేరే అంశాల వైపునకు మళ్లిస్తారు.  

ఆహారం: స్వాభావిక ఆహారంపై పెరగకుండా కృత్రిమరంగులు వేసే ఆహారం, ప్రిజర్వేటివ్స్‌ కలిపిన ఆహారం తినే పిల్లల్లో ఏడీహెచ్‌డీ ఎక్కువ. దీనితోపాటు చక్కెర ఎక్కువగా విడుదలయ్యే ‘హై గ్లైసీమిక్‌ ఇండెక్స్‌’  ఉన్న ఆహారం... అంటే స్వీట్లు, చాక్లెట్లు తినే పిల్లల్లో ఇది ఎక్కువ. జంక్‌ఫుడ్, ఎక్కువగా పాలిష్‌ చేసిన బియ్యంతో వండిన పదార్థాలు తినే పిల్లల్లోనూ ఏడీహెచ్‌డీ అవకాశాలు ఎక్కువ. 
సామాజిక అంశాలు: కుటుంబ బాంధవ్యాలు సక్రమంగా లేని పిల్లల్లోనూ, సమస్యాత్మక కుటుంబ నేపథ్యం ఉన్న చిన్నారుల్లో ఈ  రుగ్మత ఎక్కువ. ఇటీవలి పరిశోధనల ప్రకారం కుటుంబం పట్ల మంచి శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులు, తాతా అమ్మమ్మలు, తాతా నాయనమ్మలతో మంచి సంబంధాలున్న పిల్లల్లో తమను తాము చక్కదిద్దుకునే సామర్థ్యం చాలా ఎక్కువ అని తెలిసింది. పిల్లలతో ఆరోగ్యవంతమైన మంచి సంబంధాలు నెరపుతూ, వారితో  మంచిగా మసలుతుంటే ఏడీహెచ్‌డీ తీవ్రత తగ్గుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

చక్కదిద్దడం ఎలా?
ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలను సరిదిద్దడం అన్నది ఇటు ఇంట్లో, అటు స్కూల్లో... ఇలా రెండూచోట్లా ఒకేసారి (సైమల్టేనియస్‌గా) జరగాలి. ఈ రెండుచోట్లా పిల్లల ప్రవర్తనను చక్కదిద్దడం (బిహేవియర్‌ మాడిఫికేషన్‌), జీవనశైలిలో మార్పులు, కౌన్సెలింగ్, ధ్యానం వంటి వాటి ద్వారా ఏడీహెచ్‌డీని అదుపులో పెట్టవచ్చు. తల్లిదండ్రుల ప్రవర్తన సైతం ఇలాంటి పిల్లల్లో  మంచి మార్పు తీసుకుని వస్తుంది. ఇలాంటి పిల్లల పట్ల కఠినంగా ఉండటం,  శిక్షించడం  సరికాదు. మొదట్లో ఇలాంటి చర్యలతో వెంటనే కొంత మెరుగుదల ఉన్నట్లు కనిపించినా దీర్ఘకాలిక ఫలితాలు చాలా తక్కువ. శాశ్వత మెరుగుదల కోసం చాలా ఓపిక, మంచి సంయమనం, పిల్లల పట్ల శ్రద్ధ చాలా అవసరం. 

విషయం వారికి తెలియనే తెలియదు... 
తనకు ఏదో లోపం ఉన్నట్లు పిల్లవాడికి తెలియనే తెలియదు. యుక్తవయసుకు వచ్చేవరకు దాని గురించి తెలిసే అవకాశమే లేదు. ఓరల్స్‌ విషయంలో వాళ్ల పని తీరు బాగున్నా ఇలాంటి పిల్లలు రాతపని చేయడానికి, హోమ్‌వర్క్‌ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఫలితంగా వాళ్ల గ్రేడ్స్‌ తగ్గుతాయి.  దాంతో  ఇలాంటి పిల్లలు అంత తెలివితేటలు ఉన్నవారు కాదనే ముద్ర పడుతుంది. నిజానికి వీళ్లు కూడా చాలా చురుకైన పిల్లలే. మంచి తెలివితేటలు ఉన్నవారే. అయితే తమ శక్తియుక్తులన్నీ చదువు మీద గాక, ఆటపాటలు, ఇష్టమైన హాబీల వంటి వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.

సమస్య నియంత్రణకు మార్గాలు
∙రోజూ జరిగినవి అడిగి తెలుసుకోవడం: పిల్లల రోజువారీ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని, ఆ రోజు చేసిన తప్పు పనుల వల్ల కలిగే అనర్థాలు వివరించాలి. మంచి విషయాలను ప్రోత్సహించాలి. మర్నాడు తప్పులు జరగకుండా చూడటంతో పాటు, మంచిపనులు చేసేలా ఉత్సాహపరచాలి. 

మెచ్చుకోవడం: పిల్లల్లోని మంచి విషయాలను మెచ్చుకుంటూ ఉండాలి. మరోమారు అవే చేసేలా  పిల్లల్ని ప్రోత్సహించాలి. 

క్రమబద్ధంగా గడిపేలా చేయడం: వాళ్ల రోజువారీ కార్యక్రమాలు ఒక క్రమపద్ధతిలో జరిగేలా ఒక నిర్దిష్టమైన టైమ్‌టేబుల్‌ రూపొందించాలి, ఆ ప్రకారం వాటిని చేసేలా చూడాలి. వారు చెడుగా ప్రవర్తించకుండా చూస్తూ ఎప్పుడూ బిజీగా ఉంచాలి.

కథలు చెప్పడం: నీతిపాఠాలు హత్తుకునేలా కథలు చెప్పాలి. ఆ కథలకు సంబంధించిన ప్రశ్నలు అడిగిలా ప్రోత్సహించి, వాటిని నివృత్తి చేయాలి. 

శారీరక వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు ఆటల్లో, వ్యాయామంలో పాల్గొనేలా చూడాలి.

తల్లిదండ్రుల శ్రద్ధ: పిల్లల చదువులతోపాటు అన్ని   విషయాల్లోనూ పేరెంట్స్‌ మంచి శ్రద్ధ తీసుకోవాలి. 

మందులు: ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో స్టిమ్యులెంట్స్, నాన్‌స్టిమ్యులెంట్స్‌ అనే మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను ఆరేళ్లకు పైబడినవారిలో ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ మందులతో పాటు ఫిష్‌ ఆయిల్, ప్రోబయోటిక్‌ వంటి సప్లిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 

దృష్టి కేంద్రీకరణ లోపాలుండే  పిల్లల్లో  కనిపించే  లక్షణాలు 
ఇలాంటి పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ లోపాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అవి... ∙మతిమరపు. ∙ కమాండ్స్‌ను సరిగా స్వీకరించలేకపోవడం ∙ఇచ్చిన వ్యవధిలో తమక అప్పగించిన బాధ్యతలను నెరవేర్చలేకపోవడం ∙స్పెల్లింగ్స్‌ చెప్పలేక సిల్లీ తప్పులు చేయడం ∙క్లాస్‌రూమ్‌లో జరుగుతున్న అంశంపై నుంచి త్వరగా దృష్టి మరల్చడం ∙చాలా ఎక్కువగా మాట్లాడుతుండటం. ∙పగటికలలు కనడం ∙ఇంట్లోంచి తీసుకెళ్లిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయడం. ఇక  దృష్టి నిలపలేకపోవడం అనే ముఖ్య లక్షణం ప్రతిసారీ అతిచురుకుదనం (హైపర్‌యాక్టివిటీ)తో కలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి పిల్లలను విధేయతా, క్రమశిక్షణా లేనివారిగానూ పరిగణిస్తారు. కానీ అది సరికాదు.  దృష్టి కేంద్రీకరణ లోపాలు ఉన్న పిల్లల్లోనూ విధేయత, క్రమశిక్షణ ఉంటాయి. వారిలో తమపై తమకు కొంత నియంత్రణ ఉంటుంది. 

ఏడీహెచ్‌డీకి చికిత్స తప్పనిసరి...  ఎందుకంటే...
ఒక మోస్తరు (మాడరేట్‌)  ఏడీహెచ్‌డీ నుంచి తీవ్రమైన    (సివియర్‌) ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలకు చికిత్స అందించకపో
1. దృష్టి కేంద్రీకరణ శక్తి, ఏకాగ్రతా మరింతగా తగ్గిపోతాయి. చదువుల్లో బాగా వెనకబడిపోతారు. స్కూలు నుంచి  పేరెంట్స్‌కు ఫిర్యాదులు ఎక్కువవుతాయి. అది పిల్లలపైనా, తల్లిదండ్రులపైనా తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది.  తల్లిదండ్రులకు మనోవేదనగా   పరిణమిస్తుంది. 

2. పిల్లలు అతిచురుకుదనంతో చేసే అల్లరీ, వారు చేసే విధ్వంసకరమైన పనులు  శ్రుతిమించి,  ఒక్కోసారి అది పిల్లలకూ లేదా ఇతరులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇంతటి పరిస్థితుల్లోనూ దాన్ని పసితనపు అల్లరిగానే పరిగణించి అప్పటికీ తగిన చికిత్స అందించకపోతే యుక్తవయసు వచ్చే నాటికి అతడు తీవ్రమైన నిస్పృహకులోనై డిప్రెషన్‌లోకి వెళ్లవచ్చు. అందుకే ఏడీహెచ్‌డీ పిల్లలకు చికిత్సతో పాటు క్రమం తప్పకుండా  ఫాలోఅప్‌లు అవసరం. 

తెలివైనవారు కాదనేది ఒక అపోహ మాత్రమే 
ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు స్వతహాగా తెలివైనవారే అయినప్పటికీ వారు ఇంటెలిజెంట్‌ కాదనే దురభిప్రాయం ఉంది. ఆ అపోహ వల్ల వాళ్ల ప్రవర్తనలో మార్పులు (బిహేవియరల్‌ ప్రాబ్లమ్స్‌) వస్తాయి. పిల్లల్లో వచ్చే దృష్టి కేంద్రీకరణ లోపాలను కొద్దిపాటి ఓపికతో చాలా బాగా పరిష్కరించవచ్చు. సామాజిక బాధ్యతగల టీచర్లు ఉండే స్కూళ్లలో ఇలాంటి పిల్లలను తేలిగ్గా దారికి తేవచ్చు. అయితే కొద్దిగా మానసిక వైకల్యం ఉండి, ఇలాంటి దృష్టి కేంద్రీకరణ సమస్య వస్తే మాత్రం అలాంటి విద్యార్థులకు ప్రత్యేక (స్పెషల్‌) స్కూల్స్‌లో చేర్చాలి. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సేవలు అవసరమవుతాయి.  
– డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, 
కన్సల్టెంట్‌  సైకియాట్రిస్ట్‌ లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement